వలసలను అడ్డుకునేందుకు బ్రిటన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణం తీసుకుంది. కుటుంబ వీసా నిబంధనలను మరింత కఠినతరం చేసింది. బ్రిటిష్ పౌరులు, శాశ్వత నివాసితులు (భారత వారసత్వం ఉన్నవారితో సహా) తమ బంధువులను కుటుంబ వీసాపై తీసుకురావాలనుకుంటే.. అందుకు కనీస వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచింది. దీని గురించి యూకే గతేడాదే ప్రకటించగా.. గురువారం నుంచి ఈ నిబంధన అమల్లోకి వచ్చింది.
ఇక నుంచి ఎవరైనా కుటుంబ వీసాకు స్పాన్సర్ చేయాలంటే.. వారి కనీస వార్షిక వేతనం 29,000 జీబీపీ లుగా ఉండాలని యూకే ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో ఈ పరిమితి 18,600 జీబీపీలుగా ఉండగా.. ఇప్పుడు దాన్ని 55శాతం పెంచారు. అంతేకాదు, వచ్చే ఏడాది నుంచి వృత్తి నిపుణుల వీసా నిబంధనలతో సమానంగా కుటుంబ వీసాల కోసం వేతన పరిమితిని 38,700 పౌండ్లకు పెంచనున్నట్లు అధికారులు తెలిపారు.
ఉపాధి వీసా నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ గతేడాది డిసెంబరులోనే యూకే సర్కారు హౌస్ ఆఫ్ కామన్స్‌లో బిల్లును ప్రవేశపెట్టింది. దాని ప్రకారం.. కుటుంబ వీసా కోసం వేతన పరిమితిని 38,700 డాలర్లకు పెంచాలని నిర్ణయించారు. అయితే, దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రధాని రిషి సునాక్ ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది. రెండు దశల్లో ఈ పెంపును అమలు చేస్తామని ప్రకటించింది. ఈ కఠిన నిబంధనలవల్ల ప్రస్తుత వలసల్లో 3 లక్షల మంది వరకు తగ్గుతారని అప్పట్లో మంత్రి క్లెవర్లీ ప్రకటించారు. ఈ పెంపుతో భారతీయులపైనే అధిక ప్రభావం పడనుంది.
ఇది కూడా చదవండి: పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నాయకుల న్యాయపోరాటం