KTR | రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హేమాహేమీలవంటి నేతలను ఓడించింది తమ పార్టీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు.

KTR | 1952లో ప్రజాస్వామ్య యుతంగా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకూ ప్రతిపక్షాలు, జర్నలిస్టుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తూనే ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. టీవీ9 లైవ్ షోలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు తదితరులు ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపణలు చేస్తున్నారని, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, డీజీపీ రవిగుప్తా తదితరులకు దీంతో సంబంధం లేదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. డీజీపీలుగా ఉన్న వారిని ఎందుకు విచారించడం లేదని నిలదీశారు. తప్పు చేస్తే శిక్షించండి. ప్రభుత్వాన్ని అడ్డుకునేదెవరని కేటీఆర్ అన్నారు. రోజుకో లీక్ ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. రాజ్యాంగ బద్ధంగా ఇచ్చిన హామీలు అమలు చేయలేక డ్రామలు ఎందుకు అని ప్రశ్నించారు. ఆధారాలతో సహా న్యాయమూర్తి ముందు నిరూపించి శిక్ష చేశారన్నారు. పిచ్చి వాగుడు వాగితే సీఎం రేవంత్ రెడ్డికి పరువు నష్టం నోటీసు పంపుతా అని చెప్పారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 119 సీట్లలో బీఆర్ఎస్ 39 స్థానాల్లో గెలిచిందని కేటీఆర్ చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ 543 స్థానాల్లో 43 కూడా గెలవదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చెబుతున్నారని కేటీఆర్ గుర్తు చేశారు. ఇండియా కూటమిలో మిత్రపక్షం మమతా బెనర్జీ చెబుతున్నారని చెప్పారు. 10-12 సీట్లు బీఆర్ఎస్ గెలిస్తే తెలంగాణ గురించి ఢిల్లీలో మాట్లాడే అవకాశం ఉంటుందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తల్లిని చంపి బిడ్డను తీసుకొచ్చారని పేర్కొన్న ప్రధాని నరేంద్రమోదీ సారధ్యంలోని బీజేపీకి ఎందుకు ఓటేయాలని కేటీఆర్ ప్రశ్నించారు. తమకు బీజేపీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హేమాహేమీలను ఓడించింది బీఆర్ఎస్ పార్టీ అని గుర్తు చేశారు. చేవలేని, చేతగాని కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి పరిమితమై లేని రంకు అంటగడితే ఎలా అని ప్రశ్నించారు.