చంద్రవదనంలో కండ్ల తర్వాత కనువిందు చేసేవి అధరాలే! అరవిరిసిన పెదాలపై పదాలు కట్టిన కవికుల తిలకులు ఎందరెందరో! మోవి గని మొగ్గ అని వర్ణించిన వారు కొందరైతే, గులాబీ రేకులే పెదాల సోకు అని తీర్మానించారు ఇంకొందరు.

Lipology | చంద్రవదనంలో కండ్ల తర్వాత కనువిందు చేసేవి అధరాలే! అరవిరిసిన పెదాలపై పదాలు కట్టిన కవికుల తిలకులు ఎందరెందరో! మోవి గని మొగ్గ అని వర్ణించిన వారు కొందరైతే, గులాబీ రేకులే పెదాల సోకు అని తీర్మానించారు ఇంకొందరు. ముత్యాల పలు వరుసకు కెంపుల పరదాల్లాంటి అధరాల వైనాన్ని వివరించే శాస్త్రమూ ఉంది. అదే లిపాలజీ! వలపు విరుపుల పెదవుల నిర్మాణ రీతిని బట్టి.. ఆ మనిషి తీరును ఇది వివరిస్తుంది.
పలుచటి పెదాలు: పూల రేకుల్లా సన్నని పెదాలున్న వాళ్లు ఇట్టే ఆకట్టుకుంటారు. ఈ తరహా అధరాలు ఉన్నవాళ్లు తమతో తాము గడపడానికి అధిక ప్రాధాన్యం ఇస్తారట. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తారని లిపాలజీ ఉవాచ.
ముద్ద మందారం: ముద్దిచ్చే పెదాలు ముద్ద మందారంలా నిండుగా ఉన్నవాళ్లు.. మెండు మనసు కలిగి ఉంటారని లిపాలజీ చెబుతున్నది. అయితే వీళ్లు చిన్నచిన్న విషయాలకే భంగపడి బుంగమూతి పెట్టుకుంటారట.
పప్పీ పెదాలు: ఒత్తుగా, పెద్దగా ఉండే పెదాలను పప్పీ లిప్స్ అంటారు. ఈ తరహా పెదవులు ఉన్నవాళ్లు విశాల హృదయం కలిగి ఉంటారు. వీళ్లకు సాటివారిపై సానుభూతి ఎక్కువ. జంతువులను అమితంగా ప్రేమిస్తారట కూడా!
పువ్వు విచ్చుకున్నట్టు: ఇలాంటి పెదాలు ఉన్నవారు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తారు. వీళ్ల మనస్తత్వం స్థిరంగా ఉంటుందట. అందంగా మాట్లాడటమే కాదు, ఎదుటివారు చెప్పింది మనస్ఫూరిగా వింటారని సెలవిస్తుంది లిపాలజీ.
స్టంగ్ లిప్స్: చిన్నగా, ఉబ్బెత్తుగా ఉండే పెదాలున్నవాళ్లలో స్వార్థం పాలు ఎక్కువగా ఉంటుందట. మాయమాటలు చెప్పేవారిని త్వరగా నమ్మేస్తారు. ఆ మాటలు తమకు హాని కలిగించేవి అయితే అప్రమత్తం అవుతారట.
పై పెదవి పెద్దగా: కింది పెదవి కన్నా.. పై పెదవి పెద్దగా ఉన్నవాళ్లు వినమ్రులుగా ఉంటారని పెదాల శాస్త్రం పలుకుతున్నది. వీళ్లు నిజాయతీగా ఉంటారు. వీరిలో సెన్సాఫ్ హ్యూమరూ ఎక్కువే!
కింది పెదవి పెద్దగా: పై పెదవి కన్నా.. కింది పెదవి పెద్దగా ఉన్నవాళ్లకు సాహస కృత్యాలంటే ఇష్టం ఉంటుందట. కొత్త పరిచయాలు చేసుకోవాలనే ఆసక్తి వీళ్లలో అధికం. తరచూ ప్రయాణాలు చేయాలని కోరుకుంటారు.