‘గులాబీ అడ్డ చేవెళ్లకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు వస్తున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో శనివారం సాయంత్రం 5 గంటలకు జరిగే బహిరంగ సభలో పాల్గొంటున్నారు.

- భారీ జన సమీకరణకు ఏర్పాట్లు
- 2 లక్షల వరకు వస్తారని అంచనా
- సభా ప్రాంగణంలో గులాబీ జెండాల రెపరెపలు
- ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
KCR | రంగారెడ్డి, ఏప్రిల్ 12(నమస్తే తెలంగాణ): ‘గులాబీ అడ్డ చేవెళ్లకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు వస్తున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో శనివారం సాయంత్రం 5 గంటలకు జరిగే బహిరంగ సభలో పాల్గొంటున్నారు. ఉమ్మడి జిల్లాలో తొలి ఎన్నికల ప్రచార బహిరంగ సభ కావడంతో పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సభను సూపర్ సక్సెస్ చేసేందుకు భారీగా జనాన్ని సమీకరిస్తున్నారు. సభ ఏర్పాట్లను మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం పరిశీలించారు. గులాబీ బాస్ రాకతో జిల్లాలో లోక్ సభ ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కనున్నది.
గులాబీ సభకు సర్వం సిద్ధం
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న బహిరంగ సభను బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నది. చేవెళ్ల పార్లమెంటు పరిధిలో ఉన్న మహేశ్వరం, చేవెళ్ల, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, వికారాబాద్, పరిగి, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి భారీగా జనాన్ని సమీకరించేలా నేతలకు బాధ్యతలు అప్పగించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు సభ విజయవంతానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. 2 లక్షల మందికి పైగా సభకు తరలివచ్చే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నారు.
ఎండ తీవ్రత నేపథ్యంలో సభకు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మంచినీళ్లు తదితర వాటిని అందుబాటులో ఉంచుతున్నారు. సభకు వచ్చే వీఐపీలు, మీడియా, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళలు ఇలా.. వేర్వేరుగా గ్యాలరీలు, షాబాద్ నుంచి వచ్చే వాహనాలకు అదే రూట్లో పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు. సభా స్థలికి కొద్ది దూరంలో రెండు చోట్ల పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు.
అక్కడే తమ వాహనాలను పార్కింగ్ చేసి కాలినడకన సభా ప్రాంగణానికి ప్రజలు చేరుకోవాల్సి ఉంటుంది. ఫరా కళాశాల మైదానంలోని విశాలమైన స్థలంలో సభకు ఏర్పాట్లు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే మైదానంలో బీఆర్ఎస్ పార్టీ సభ నిర్వహించింది. కేసీఆర్ రోడ్డు మార్గంలోనే సభకు రానున్నట్లు తెలిసింది. ఒకవేళ.. హెలికాప్ట్టర్లో వస్తే.. అందుకు సైతం నేతలు ఏర్పాట్లు చేశారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ తదితరులు దగ్గరుండి సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.