Telangana | ఓటమి భయంతో బీజేపీ, కాంగ్రెస్ కలిసి తనపై కుట్రలు పన్నుతున్నాయని మెదక్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక మీడియాకు లీకులు ఇచ్చి, తప్పుడు వార్తలు రాయించి లబ్ధి పొందాలని చూస్తున్నాయని మండిపడ్డారు.

Telangana | ఓటమి భయంతో బీజేపీ, కాంగ్రెస్ కలిసి తనపై కుట్రలు పన్నుతున్నాయని మెదక్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక మీడియాకు లీకులు ఇచ్చి, తప్పుడు వార్తలు రాయించి లబ్ధి పొందాలని చూస్తున్నాయని మండిపడ్డారు. గత ఎన్నికల్లో తాను పోటీ కూడా చేయలేదని, కానీ తాను డబ్బులు తరలించినట్టు కథ అల్లి ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకుముందు వరకు తాను ఎమ్మెల్సీగా పరోక్ష రాజకీయాల్లోనే ఉన్నానని గుర్తుచేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.
‘లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించి బీజేపీ, కాంగ్రెస్ చేతులు కలిపి నన్ను ఓడించాలని దుష్ట పన్నాగం పన్నుతున్నాయి. సిద్ధాంతాలు, విలువలు గాలికి వదిలి, ప్రజలను మభ్యపెట్టే స్థాయికి దిగజారాయి. ప్రభుత్వ ఉద్యోగిగా, కలెక్టర్‌గా ప్రజలకు నిజాయితీగా సేవలు అందించా. ప్రజా సేవకుడిగా ఇంకా ఎక్కువ సేవలు అందించడానికి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చా. పేద విద్యార్థులకు విద్య అందించేందుకు, స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాల కోసం వంద కోట్లతో పీవీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేశా. ప్రతి నియోజకవర్గంలో ఫంక్షన్ హాల్ నిర్మించి సేవలు అందిస్తా. ఓట్ల కోసం అబద్ధాలు చెప్పే వ్యక్తిని కాదు. నీచ రాజకీయాలు చేసే వ్యక్తిని కాదు. ఈ విషయం ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలందరికీ తెలుసు’ అని వెల్లడించారు. తనపై విమర్శలు చేయడానికి ఎలాంటి అవకాశం లేకపోవటంతోనే బీజేపీ, కాంగ్రెస్ కుట్ర చేస్తున్నాయని, తన మనోస్థైర్యం దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎవరెన్ని జిమ్మికులు చేసినా ప్రజలు తనవైపే ఉన్నారని స్పష్టం చేశారు.