సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు, ప్రజాస్వామ్యంలో ప్రజలు నిజాయితీ సమర్ధత గల నాయకుడిని ఎన్నుకోవడానికి ఓటే వజ్రాయుధం. ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటేనే ప్రజాస్వామ్యం పది కాలాల పాటు పరిఢవిల్లుతుంది.

- ఓటు నమోదుకు ఈ నెల 15 వరకు గడువు
- 18 ఏండ్లు నిండిన వారు అర్హులు
నేరేడుచర్ల , ఏప్రిల్ 13 : సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు, ప్రజాస్వామ్యంలో ప్రజలు నిజాయితీ సమర్ధత గల నాయకుడిని ఎన్నుకోవడానికి ఓటే వజ్రాయుధం. ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటేనే ప్రజాస్వామ్యం పది కాలాల పాటు పరిఢవిల్లుతుంది. అర్హులందరికీ ఓటు హక్కు కల్పించేందుకు ఎన్నికల సంఘం ఈ నెల 15 వరకు అవకాశం కల్పించింది. జనవరి 31, 2024 వరకు 18 ఏండ్లు నిండిన యువతీయువకులు ఓటరుగా నమోదయ్యేందుకు వీలు కల్పించింది. గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఓటు హక్కును నమోదు చేసుకోని వారు త్వరపడి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
గతంలో ఓటు హక్కు పొందిన వారంతా సమీప బూత్ లెవెల్ కేంద్రాల్లోని ఓటరు జాబితాలో తమ పేర్లు ఉన్నాయో, లేదో, తప్పులు ఉన్నాయో అన్న విషయం పరిశీలించుకోవాలన్నారు. జాబితాలో తమ పేర్లు లేకుంటే వెంటనే అక్కడ ఓటు నమోదు చేసుకోవాలి. 01-31-2024 నాటికి 18 ఏండ్లు నిండిన యువతీ, యువకులు ఓటు నమోదు చేసుకునేందుకు ఇదే మంచి అవకాశం. ఓటరు ముసాయిదా జాబితా సవరణకు రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. 18 ఏండ్లు నిండిన యువతీ యవకులు ఫారం-8లో దరఖాస్తు చేసుకోవచ్చు. దాంతో పాటు రెండు పాస్ పోర్టు సైజు ఫొటోలు, రేషన్, ఆధార్ కార్డుతో పాటు వయస్సు ధ్రువీకరణ పత్రం జతచేయాలి.
ఏ ఫారం ఎందుకంటే
కొత్తగా ఓటర్ల నమోదుకు ఫారం-6ను ఉపయోగించాలి. రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, ఆధార్ కార్డు (లేకుంటే నివాస చిరునామ ధ్రువీకరణ పత్రం జతపరచాలి)
ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపు కోసం ఫారం-7ను ఉపయోగించాలి. విచారించిన తర్వాత పేర్లు తొలగిస్తారు
పేరు, పుట్టిన తేదీల్లో తప్పులను సవరించేందుకు ఫారం-8ను పూరించి ఇవ్వాలి. ఈ ఫారానికి సరిచేయాల్సిన పేరుకు సంబంధించిన డిక్లరేషన్, 10వ తరగతి మార్కుల జాబితా, డ్రైవింగ్ లైసెన్స్, లేదా ఏదో ఒకటి జతపరుచాలి
చిరునామ మార్చేందుకు ఫారం-8ఏ ను ఉపయోగించాలి. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ అయిన వారు పూర్వ చిరునామతో ఉన్న గుర్తింపు కార్డు జిరాక్స్‌ను, ప్రస్తుత చిరునామా ధ్రువీకరణ పత్రాన్ని జతపరిస్తే సరిపోతుంది
ఎన్‌ఆర్‌ఐలు ఫారం-6ఏ ను ఉపయోగించాలి. ఇందుకు తాము నివాసముంటున్న దే శాల్లో సిటిజన్ మెంబర్‌షిప్ లేదని, అక్కడి అంబాసిడర్‌తో డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.