ఇది అది అని గాక ఏ ప్రభుత్వం చేసే తప్పులనైనా ఎత్తిచూపటం, ప్రజల మేలు కోసం ఏమి జరగాలో సూచించటం మేధావుల బాధ్యత. పదేండ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏమి సూచనలు చేశారో తెలియదు గాని, తప్పులను విమర్శించే బాధ్యతను మాత్రం కొందరు మేధావులు బాగానే నిర్వర్తించారు.

ఇది అది అని గాక ఏ ప్రభుత్వం చేసే తప్పులనైనా ఎత్తిచూపటం, ప్రజల మేలు కోసం ఏమి జరగాలో సూచించటం మేధావుల బాధ్యత. పదేండ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏమి సూచనలు చేశారో తెలియదు గాని, తప్పులను విమర్శించే బాధ్యతను మాత్రం కొందరు మేధావులు బాగానే నిర్వర్తించారు. అంతవరకు కూడా ఆహ్వానించదగినదే. తర్వాత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వారు ఒక అడుగు ముందుకువేసి కాంగ్రెస్ ప్రచార రథాలకు ఉత్సాహంగా జెండాలూపారు.
అందులో ఆక్షేపించవలసింది కూడా ఏమీ లేదు. ఆ పార్టీ అధికారానికి వచ్చినట్టయితే అంతవరకు జరిగిన తప్పులు జరగబోవని, ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని వారు నిజంగానే నమ్మి ఉండవచ్చు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన గత నాలుగు మాసాలలో ఏమి జరుగుతూ వస్తున్నదో వారెపుడైనా సమీక్షించారా? వంద రోజుల గడువు పెట్టిన ఆరు గ్యారెంటీల విషయంలో గాని, ఇతరత్రా క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న మంచి చెడులపైగాని వారి మధ్య చర్చలేమైనా సాగుతున్నాయా? అన్నవి మన ముందుకు వస్తున్న ప్రశ్నలు. ఇందుకు సమాధానాలు కనీసం బయటకైతే ఏమీ కన్పించటం లేదు.
ఇక్కడ ఉద్దేశిస్తున్న మేధావులు జెండాలూపిన సందర్భాన్ని ముందుగా చూద్దాము. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కొందరు నిరుద్యోగులు బస్సులలో తెలంగాణలోని పలు ప్రాంతాలకు వెళ్లి బీఆర్ఎస్కు వ్యతిరేకంగా తీవ్రమైన ప్రచారం జరిపారు. ఆ ఖర్చులన్నింటినీ భరించింది కాంగ్రెస్ పార్టీ అనే అభిప్రాయం అందరికీ కలిగింది. ఆ విధంగా సారాంశంలో మేధావులు జెండాలూపింది కాంగ్రెస్ ప్రచార రథాలకన్న మాట. అందువల్లనే, పౌర హక్కుల రంగంలో గల ఒక ప్రముఖ సంస్థ, మేధావులు ఆ విధంగా ఒక పరిధిని దాటడం సరికాదని భావించి వారి ఈ విధమైన కార్యకలాపాలకు దూరంగా ఉండిపోయింది. అయినప్పటికీ, ఒక వేళ కొత్త ప్రభుత్వంలో నిరుద్యోగులకు మేలు జరిగి ఉంటే దీనినంతా ఉపేక్షించవచ్చు. కాని జరుగుతున్నదేమిటి?
అధికారానికి వచ్చిన ఏడాది కాలంలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయగలమన్నది కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీ. ఏడాది కాలం 2024 డిసెంబర్ మొదటి వారానికి పూర్తవుతుంది. ఇప్పటికి గడిచిన నాలుగు నెలల కాలంలో జరిగిందేమిటి? బీఆర్ఎస్ ప్రభుత్వమే నోటిఫికేషన్లు ఇచ్చి పరిపాలనా ప్రక్రియ పూర్తయి ఎన్నికల కోడ్ వల్ల ఆగిన 30,000 ఉద్యోగాలకు కేవలం నియామక పత్రాలిచ్చి, ఆ ఉద్యోగాలను తామే ఇచ్చినట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నుంచి కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ వచ్చిన రాహుల్‌గాంధీ వరకు అందరూ చెప్తున్నారు. ఈ మాట నిజం కాదని, అవన్నీ బీఆర్ఎస్ నోటిఫికేషన్లని, కొత్త ప్రభుత్వం ఇచ్చింది ఒక్కటైనా లేదని స్వయంగా నిరుద్యోగులు, వారి టీచర్లు గొంతెత్తి స్పష్టం చేస్తున్నారు. ఇదంతా జెండాలూపిన మేధావుల దృష్టికి వచ్చిందా? వారేమీ మాట్లాడినట్టయితే లేదు.
నిరుద్యోగులు, వారి టీచర్లు ఇంకా కొన్ని మాటలంటున్నారు. వారు కొద్ది వారాల క్రితం ఈ సమస్యలపై అశోక్‌నగర్‌లో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. వారికి సంఘీభావంగా నిరుద్యోగులు రాష్ట్రమంతటి నుంచి వచ్చారు. వారంతా తరచుగా వేసిన ప్రశ్న, ‘ఎక్కడికి పోయారు ఈ మేధావులు? ఎందుకు మా వద్దకు రావటం లే’దని. కొత్త ప్రభుత్వం ఉద్యోగ ఖాళీలను పెంచకపోగా ఉన్నవాటికి కోత పెడుతున్నదని. బ్యాక్‌లాగ్‌లు సృష్టిస్తున్నదని. జాబ్ క్యాలెండర్ ఏమైందని. రెండు లక్షల ఉద్యోగాలు ఏ శాఖలో, ఏవి, ఎన్నున్నాయో లెక్కలు ఎందుకు ప్రకటించరని. లోక్‌సభ ఎన్నికల కోడ్ జూన్ మొదటివారంలో ముగిసినాక ఇక మిగిలే ఆరు నెలల్లో రెండు లక్షల ఉద్యోగాలు ఎట్లా భర్తీ చేస్తారని. అది ఎంతమాత్రం సాధ్యం కాదని. యూత్ డిక్లరేషన్‌లో ప్రకటించిన ప్రకారం మొదటి ఏడాదిలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఎట్లా నింపుతారని. అదే డిక్లరేషన్‌లో నిరుద్యోగులకు ప్రతి నెల రూ.4,000 నిరుద్యోగ భృతి హామీ ఇచ్చి, తాము అసలు అటువంటి హామీ ఇవ్వలేదంటూ అసెంబ్లీలో ఎట్లా మాట్లాడుతారని.
ఈ విషయాలు ఇంతగా రాయటం ఎందుకంటే, మేధావులు జెండాలూపింది ఈ నిరుద్యోగుల ప్రచార రథాలకే. మేధావుల చర్య వల్ల నిరుద్యోగులకు నైతిక బలం కలిగింది. వారు మునుముందు కూడా తమ వెంట నిలువగలరనే ఆశాభావం ఏర్పడింది. దానితో పట్టుదలగా ప్రచారాలు చేశారు. కాని ఈ రోజున అదే నిరుద్యోగ యువత ఆందోళన చెందుతూ, ఆ మేధావులెక్కడ అని ప్రశ్నిస్తున్నది. వాస్తవానికి ఈ మేధావులు పరిస్థితిని గమనించి తమంతట తామే ముందుకు రావలసింది. యువకులకు, ప్రభుత్వానికి మధ్య సంప్రదింపులు జరిపి సమాధానాలు వెతకాల్సింది. కాని ‘అయ్యా మేధావులూ మీరెక్కడున్నా’రని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నా, వారు బయటికి రాలేదు, నిరుద్యోగులను పలకరించలేదు, ప్రభుత్వాన్ని సంప్రదించలేదు. అంతేకాదు, పైన పేర్కొన్న నిరుద్యోగుల ప్రశ్నలలో ఒక్కటంటే ఒక్కదానికైనా తమవైపు నుంచి గల ఆలోచనలేమిటో చెప్పలేదు.
మొదట వివరించుకున్న తరహా తమ బాధ్యతలను ప్రజల విషయంలో, రాష్ట్రం విషయంలో ఈ జెండాలూపిన మేధావులు ఏ విధంగా నిర్వర్తిస్తున్నారనే దానికి ఈ విషయం బాగా అద్దం పడుతున్నది. నిజానికి విద్యారంగం గురించి, విద్యార్థుల గురించి సాధారణ రూపంలో కాంగ్రెస్ మ్యానిఫెస్టోలోనే గాక, 100 రోజుల గడువు గల 6 గ్యారెంటీల విషయంలోనూ మరికొన్ని హామీలున్నాయి. నిరుద్యోగుల గురించే నోరు విప్పని మేధావులు వాటి ప్రస్తావన చేస్తారని ఆశించలేము గనుక ఆ విషయం వదిలివేద్దాం.
సమస్య ఏమంటే, జెండాలూపిన మేధావులు గత నాలుగు నెలలుగా ప్రజలకు సంబంధించిన అసలే విషయమూ మాట్లాడినట్టు లేరు. అది 6 గ్యారెంటీలలో గల 13 హామీల అమలు కావచ్చు, మొత్తం మ్యానిఫెస్టో కావచ్చు, వీటితో నిమిత్తం లేకుండా క్షేత్రస్థాయిలో ప్రస్తుతం రైతులను తల్లడిల్లజేస్తున్న నీటి సమస్య, వారికి ఇతరత్రా కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు గురించి కావచ్చు. ప్రచార రథాలకు ఆకుపచ్చ జెండాలూపిన మేధావులు, ఎన్నికలతో తమ బాధ్యత ముగిసిందని ప్రజలకు సంబంధించిన ఇటువంటి అంశాలలో మాత్రం తమకు తాము ఎర్రజెండాలు ఊపుకుంటున్నట్టు కనిపిస్తున్నది.
రాయాలంటే చాలా ఉన్నాయి. కాని ప్రజల పట్ల మేధావుల బాధ్యతలేని తనాన్ని, నిష్క్రియాపరత్వాన్ని, పాక్షిక ధోరణులను ఎత్తిచూపే కొన్ని ముఖ్యమైన అంశాలను మాత్రం చూద్దాం. పరిస్థితిని బట్టి మరొకసారి ఇతర విషయాలు చర్చించవచ్చు. ప్రస్తుతం అన్నింటికన్న తీవ్రమైనవి రైతాంగ సమస్యలు. అధికారానికి రాగానే డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, ఆ మాటైనా ఎత్తటం లేదు. రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15,000 రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు రూ.12,000, వరికి క్వింటాలుకు రూ.500 బోనస్ అన్నవి 100 రోజుల గడువు గల 6 గ్యారెంటీలలో ఉన్నాయి. కానీ 120 రోజులు గడిచినా వీటిలో ఏ ఒక్కదాని జోలి లేకపోగా, కౌలురైతులు, వ్యవసాయ కూలీల జాబితాలు తయారుచేసే పని అయినా మొదలుపెట్టలేదు.
పంట బోనస్ లేకుండానే ఖరీఫ్ గడిచిపోగా, ప్రస్తుతం యాసంగి మొదలైంది. అయినా బోనస్ ప్రస్తావన లేదు వ్యవసాయానికి సంబంధించిన మరికొన్ని సమస్యలు, అసలు రైతుభరోసా అందరికీ ఇవ్వకపోవటమే గాక ఎన్ని ఎకరాల పరిమితి విధించేదీ తేల్చకపోవటం. మరణించిన రైతుల కుటుంబాలకు రైతు బీమా ఆపివేయటం. ప్రాజెక్టులలో నీళ్లు ఉన్నచోటనైనా ఇవ్వనందువల్ల, అట్లాగే కరెంటు కోతల వల్ల 12-15 లక్షల ఎకరాలలో పంట ఎండటం. తాజాగా యాసంగి వరి కొనుగోళ్లు మొదలైనాక రైతులకు ప్రభుత్వం కనీస మద్దతు ధర ఇవ్వటంలో శ్రద్ధ వహించనందువల్ల వ్యాపారులు, అధికారులు కలిసి రైతులను పెద్ద పెట్టున మోసం చేస్తుండటం. ఇందుగురించి ఫొటోలతో సహా వార్తలు వెలువడుతున్నా నామ మాత్రపు హెచ్చరికలు తప్ప ప్రభుత్వం చలించకపోవటం. ఈ సమస్యలను తట్టుకోలేక 200 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా, అది నిజం కాదు మొదటి మూడు నెలలలో 63 మంది మాత్రమే ఆత్మహత్య చేసుకున్నారంటూ అది తమ ఘనతగా చాటడం. ఏది నిజమో తేల్చేందుకు స్వతంత్రమైన కమిటీ ఏదీ వేయకపోవటం.
జెండాలూపిన మేధావులకు ఇంత తీవ్రమైన సమస్యలు కూడా తాము నోళ్లు విప్పదగినవిగా కన్పించటం లేదు గనుక, ఇంకా మిగిలిన వాటి గురించి ప్రస్తుతానికి రాసుకోకుండా ఉండటమే మంచిది కావచ్చు. అయితే రెండు విషయాలు మాత్రం చెప్పుకోవాలి. ఇటీవల రెండు భారీ ఎన్కౌంటర్లలో సుమారు డజన్ మంది నక్సలైట్లు చనిపోయారు. ఇందులో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాత్ర ఉందని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. అది నిజమా కాదా మనకు తెలియదు. ఘటనలు జరిగింది ఛత్తీస్‌గడ్‌లో అయినందున. కానీ విషయం అది కాదు. బీఆర్ఎస్ పాలనలో పౌరహక్కులు లేవని ఈ మేధావులు చాలా విమర్శలు చేశారు. వారి దృష్టినుంచి అది నిజమే కావచ్చు. అయితే, ఇప్పుడీ భారీ ఎన్కౌంటర్ల గురించి గాని, వాటిని పురస్కరించుకొని మావోయిస్టు పార్టీ రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన ఆరోపణల గురించి గాని ఈ మేధావులు-కమ్-పౌరహక్కుల నేతలు ఏమైనా మాట్లాడారా? ఇది ఒకటైతే, వారికి మౌలికమైన ప్రశ్న కూడా ఒకటున్నది.
తెలంగాణలో గాని, దేశంలో గాని పౌరహక్కుల ప్రశ్నలు, ఉద్యమాలు తలెత్తింది అసలు మొట్టమొదట ఏ పార్టీ పరిపాలనలో? ఎప్పటి నుంచి? అనేకులు పౌరహక్కుల నాయకులను, కార్యకర్తలను సైతం వేధించింది, జైళ్ల పాలు చేసింది, చివరకు ప్రాణాలు తీసింది ఏ పార్టీ పరిపాలనలో? అయినప్పటికీ ఈ జెండా మేధావులు అదే కాంగ్రెస్ పార్టీ గెలిచి వచ్చి పౌరహక్కులను కాపాడగలదని ప్రజలను నమ్మించగా, ఇప్పుడీ ఘటనలు చోటుచేసుకున్నాయి మరి. ప్రజలను గొర్రెలు చేసి కసాయికి అప్పగించటంలో మేధావుల పాత్ర చాలానే ఉంటుందని ఎప్పుడో ఎవరో అన్నట్టున్నారు.
ఇది మొదటిది కాగా రెండవ విషయం ఒకటుంది. వాస్తవానికి అది సుదీర్ఘంగా చర్చించవలసింది అయినా, ఇప్పటికి క్లుప్తంగా చెప్పుకుందాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు గడిచింది. అదొక మైలురాయి వంటి కాల వ్యవధి. ఈ కాలంలో జరిగిందేమిటి? జరగనిదేమిటి? వాటిలో మంచి చెడులేమిటి? రాష్ట్రం ఏర్పడక ముందు కాలంతో పోల్చితే వివిధ అభివృద్ధి, సంక్షేమ, సామాజిక రంగాల పరిస్థితి ఏమిటి? జాతీయ స్థితిగతులు, ఇతర రాష్ర్టాలు, వేరే కొత్త రాష్ర్టాలతో పోల్చితే ఏమిటి? మునుముందు ఏమి జరగటం అవసరం? అనే మౌలికమైన ప్రశ్నలపై సమగ్రమైన, నిశితమైన, అకడమిక్ అధ్యయనాలు ఏవైనా గణాంకాలు, విశ్లేషణలతో చేసి ప్రజల ముందుంచటం, ఉంచేందుకు ప్రయత్నించటం ఏదైనా ఈ కడుపులో చల్ల కదలని భద్రలోక్ మేధావులు చేస్తున్నారా? అందుకు సమాధానాలను తమ గజదంత గోపురాలలో కూర్చొని తర్కించటం గాక, క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజలతో మాట్లాడి వారి ఆలోచనలలో కూడా వెతకజూస్తున్నారా? లేక జెండాలూపటంతోనే తమ బాధ్యత తీరిపోయిందనుకుంటున్నారా?
– టంకశాల అశోక్