‘ఈ దేహం బతికున్నంత వరకే’ అన్న వేదాంతాన్ని పూర్వ పక్షం చేస్తూ సృష్టికి ప్రతిసృష్టి చేస్తున్నాడు రాజేశ్! మరపురాని మనుషుల్ని మళ్లీ మళ్లీ చూడాలనే కోరికను నిజం చేసే సృజనాత్మక శిల్పి అతడు. ప్రాణానికి ప్రాణమైన మనిషిని ప్రతిమగా మలచగలడు. ప్రాణమొక్కటే పోయలేడు. అతని సృజనేమీ లేనిది ఉన్నట్టుగా చూపే ఇంద్రజాలం కాదు.

‘ఈ దేహం బతికున్నంత వరకే’ అన్న వేదాంతాన్ని పూర్వ పక్షం చేస్తూ సృష్టికి ప్రతిసృష్టి చేస్తున్నాడు రాజేశ్! మరపురాని మనుషుల్ని మళ్లీ మళ్లీ చూడాలనే కోరికను నిజం చేసే సృజనాత్మక శిల్పి అతడు. ప్రాణానికి ప్రాణమైన మనిషిని ప్రతిమగా మలచగలడు. ప్రాణమొక్కటే పోయలేడు. అతని సృజనేమీ లేనిది ఉన్నట్టుగా చూపే ఇంద్రజాలం కాదు. ఉన్నది ఉన్నట్టుగా సృష్టించే రాజేంద్రజాలం. సహజత్వమే తన శిల్ప కళకు ప్రమాణం. సజీవ శిల్పాల సృష్టే అతని ప్రయాణం!
దైవ సాక్షాత్కారం కోసం రుషులు తపస్సు చేసినంత దీక్షతో శిల్పాలకు రూపమిస్తాడు రాజేశ్. అతడి సృజనకు మెచ్చి.. దైవమే దిగివస్తుందేమో! శిల్పాలే అయినా.. సజీవంగా వెలిసిన అనుభూతిని కలిగిస్తాయి రాజేశ్ మలిచిన సాయి రూపాలు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన రాజేశ్ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందడానికి ఓ కారణం ఉంది. షిరిడీని దర్శించుకున్న భక్తులకు రాజేశ్ శిల్పాలు సుపరిచితమే. సాయి ఆలయంలోని ధ్యాన మందిరంలో కొలువుదీర్చిన శిల్పాన్ని చూస్తే… అచ్చంగా బాబా వచ్చి కూర్చున్నాడా అన్నట్టు ఉంటుంది. ‘ఈ సజీవ శిల్పానికి ప్రాణం పోసిన శిల్పి.. రాజేశ్’ అని రాసి ఉంటుందక్కడ. ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించిన మరో నాలుగు బాబా విగ్రహాల రూపకర్త కూడా రాజేశే!
ఈ దేవుడు నాకే దక్కాలి!
సాయిబాబా శిల్పాలను తీర్చిదిద్దడం వెనుక ఓ కథ ఉందంటాడు రాజేశ్. ‘ఓ భక్తుడు సాయిబాబా సజీవ శిల్పం చేయడానికి నా దగ్గరికి వచ్చాడు. ఆర్డర్ ఇచ్చి పోయాడు. విగ్రహం పూర్తయింది. దాన్ని తన ఇంటికి తీసుకుపోయాడు. విగ్రహాన్ని ఆలయానికి తరలించే వేడుక కోసం ఆయన తన బంధువులను, మిత్రులను ఆహ్వానించాడు. వచ్చిన వారంతా ఆ విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోయారు. బాబా మళ్లీ మనిషిగా వచ్చినట్టుందన్నారట. దీంతో ఆ భక్తుడు మనసు మార్చుకున్నాడు. బాబా విగ్రహాన్ని ఆలయానికి ఇవ్వకుండా తన ఇంట్లోనే ప్రతిష్ఠించి నిత్య పూజలు చేయడం మొదలుపెట్టాడు. ఆలయానికి ఇచ్చిన మాట తప్పకూడదని మరో విగ్రహం చేయమని నాకు ఆర్డర్ ఇచ్చాడు’ అని ఆనాటి ముచ్చట చెబుతాడు రాజేశ్. అప్పటి నుంచి లెక్కకు మించి బాబా విగ్రహాలు తయారు చేశారు. ఈ శిల్పి ప్రతిభను గుర్తించిన షిరిడీలోని శ్రీసాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఆయన రూపొందించిన విగ్రహాన్ని ధ్యాన మందిరంలో ప్రతిష్ఠించింది. క్యూ కాంప్లెక్స్‌లో మరో నాలుగు మూర్తులను కొలువు దీర్చింది. రాజేశ్ మలిచిన సాయి విగ్రహాలు అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మొదలైన దేశాల్లోని 65 మందిరాల్లో నిత్య నీరాజనాలు అందుకుంటున్నాయి. మహావతార్ బాబా, మెహర్ బాబా తదితర యోగుల విగ్రహాలనూ ఆయన తీర్చిదిద్దారు.
సజీవ శిల్ప కళతో ఏ మూర్తినైనా సశరీరంతో ఉన్నట్టుగా ఆవిష్కరించగల దిట్ట రాజేశ్. అందుకే, సినీ తారలను, నాయకుల విగ్రహాలను ఆయనతో తయారు చేయిస్తుంటారు అభిమానులు. కాలం చేసిన తల్లిదండ్రుల చిత్తరువులు ఇచ్చి రాజేశ్‌తో సజీవ శిల్పాలు చేయించుకుంటారు కొందరు శ్రీమంతులు. ఆయన చేతిలో మలిచిన మూర్తులు వాళ్లు మళ్లీ బతికి వచ్చారా అన్నట్టుగా ఉంటాయంటే అతిశయోక్తి కాదు. ఆ విగ్రహాలను ఇండ్లలో ప్రతిష్ఠించుకొని గతించిన వారి జ్ఞాపకాలను శాశ్వతం చేసుకుంటున్నారు.
స్వీట్ మెమొరీ
‘ఎలాంటి విగ్రహం తయారు చేయమన్నా చేస్తా’నంటాడు రాజేశ్. ‘ఒకసారి పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని రాఘవ రెడ్డి వచ్చి ‘మా అమ్మానాన్నల విగ్రహాలు తయారు చేయాలి. వాటిని చూస్తే అచ్చంగా మా అమ్మానాన్నలను చూసినట్టే ఉండాలి! సాధ్యమవుతుందా?’ అని అడిగారు. వారి చిత్తరువులు తీసుకొని.. ఆహార్యాన్ని గమనించి పని ప్రారంభించాను. ముందుగా మట్టి విగ్రహ నమూనా చేశాను. వారి కుటుంబసభ్యులకు చూపించి సూచనలు తీసుకున్నాను. అందుకు తగ్గట్టుగా మార్పులు చేసి నిజమైన మనిషిని పోలిన విగ్రహం వారికి అందించాను. ఫైబర్, మిక్స్డ్ మీడియంతో ఈ విగ్రహాన్ని మనిషి చర్మంతో ఉన్నట్టుగా తయారు చేశాను’ అని చెప్పుకొచ్చాడు రాజేశ్.
‘తొలినాళ్లలో ఈ సజీవ శిల్పాలకు తుది రూపునివ్వడం కఠినంగా ఉండేది. అనుభవంతో ఇప్పుడు అలవోకగా చేస్తున్నా’నని రాజేశ్ అనుభవ పాఠాలు చెప్పాడు. మరెందరో పిల్లలు.. తమ తల్లిదండ్రుల రూపాలను ఈ శిల్పిని సంప్రదించి సజీవ మూర్తులుగా తయారు చేయించుకుంటున్నారు. జీవితమంతా కంపెనీలు, సంస్థల నిర్మాణం కోసం శ్రమించిన కార్పొరేట్ విజేతలను గుర్తుంచుకునేందుకు ఆయా కార్యాలయాల్లో గౌరవంగా ఈ ప్రత్యేక విగ్రహాలను ప్రతిష్ఠించుకుంటున్నారు. ఇలా సజీవ శిల్పాల సృష్టితో అశేషమైన కీర్తిని ఆర్జించాడు మన రాజేశ్ .
అమ్మ చూపిన తొవ్వ …
శిల్పి, చిత్రకారుడు రాజేశ్‌ది హైదరాబాద్. బాలభవన్‌లో నిర్వహించే వేసవి శిక్షణా శిబిరంలో కళలు నేర్చుకోమని వాళ్లమ్మ శారద చేర్పించింది. అప్పుడు ఆయన వయసు 14 ఏండ్లు. ప్రసిద్ధ చిత్రకారుడు తోట వైకుంఠం అక్కడ ఆర్ట్ టీచర్‌గా ఉండేవాడు. ఆయన దగ్గర ఓనమాలు దిద్దుకున్నాడు రాజేశ్. పాఠశాలలోని ఆర్ట్ టీచర్ నరేంద్ర రాయ్ ప్రోత్సాహమూ అందింది. ఇంటర్ పూర్తయ్యాక ‘నీకు ఏది ఇష్టమో అది చేయి, అదే చదువు’ అని వాళ్లమ్మ వెన్నుతట్టింది. జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాలలో బీఎఫ్‌ఏలో చేరాడు. 1998లో చదువు పూర్తయ్యాక పద్మాలయ స్టూడియో, డాటాక్వెస్ట్ సంస్థల్లో 2డీ, 3డీ యానిమేటర్‌గా ఉద్యోగం చేశాడు. అక్కడ పని చేస్తూనే సజీవ శిల్పకళలోకి అడుగులు వేశాడు. అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఉన్నత శిఖరాలు అధిరోహించాడు. సజీవ శిల్పకళలో ఆయన చూపిన ప్రతిభకు అబ్దుల్ కలాం జాతీయ పురస్కారం, ఏయన్నార్ నంది పురస్కారం, పోలీస్ వ్యూ సేవా పురస్కారం అందుకున్నాడు. ఇంగ్లండ్‌లోని హోప్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నాడు.
సజీవ శిల్పమా! సిలికాన్ శిల్పమా!
ఒక కళాకారుడు తనదైన శైలిలో ఎన్ని ప్రయోగాలైనా చేయొచ్చు. కానీ, ఉన్నది ఉన్నట్టుగా ఉండాలంటే మాత్రం ఎంతటి సృజనకారుడికైనా కత్తి మీద సామే! సృజనాత్మక కళాకారులకు ఎన్నో ఊహలు వస్తుంటాయి. కానీ, కళ్లెదుటే కనిపించే రూపాన్నే రూపొందించాలంటే మాత్రం ఎంతో కష్టం. సజీవ శిల్పాల తయారీ కూడా అంతే కష్టం. శిల్పి రాజేశ్ ముందు ఒక ఫొటో పెట్టి ఇదే శిల్పం కావాలంటే?.. అచ్చుగుద్దినట్టుగా రూపొందిస్తాడు. ఈ శిల్పాల రూపకల్పనలో మొదట ఫొటోలో ఉన్న మనిషి ఎత్తు, లావు, ముఖాకృతి, శరీర సౌష్టవాన్ని గుర్తిస్తాడు. దాని ఆధారంగా కొలతలతో మట్టి విగ్రహం రూపొందిస్తాడు. ఆ విగ్రహ నమూనాను కుటుంబ సభ్యులకు చూపిస్తాడు. వాళ్లు పరిశీలించి, అవసరమైన మార్పులు సూచిస్తారు. వాళ్ల సూచనలకు అనుగుణంగా మరో మట్టి విగ్రహం రూపొందిస్తాడు. ఆ విగ్రహాన్ని కుటుంబ సభ్యులు అంగీకరిస్తే… నమూనా మూర్తి సిద్ధమైనట్టే. అదే విగ్రహాన్ని ఫైబర్, మిక్స్డ్ మీడియంతో తయారు చేస్తాడు. ఈ విగ్రహం ఎంత అద్భుతంగా ఉంటుందంటే?.. చర్మం, దానిపై ఉండే ముడతలు కళ్లను మోసం చేస్తాయంటే అతిశయోక్తి కాదు. మిక్స్డ్ ఫైబర్‌తో తయారుచేసిన శిల్పం నిజమైన మనిషిని మన ముందు నిలబెట్టినట్టే ఉంటుంది. కనిపించడమే కాదు. తాకినా నిజమైన మనిషిని తాకినట్టే ఉండాలని విగ్రహ తయారీలో సిలికాన్‌ని ఉపయోగిస్తున్నాడు. అందువల్ల కనులు, కనుబొమలు, చర్మం, అత్యంత సహజంగా ఉంటాయి. కుటుంబసభ్యుల చర్మం రంగును పరిశీలించి, అదే రంగులో విగ్రహం రూపొందిస్తాడు. కనుమరుగైన మనిషిని కళ్లెదుటే ఆవిష్కరించే అద్భుత ప్రయోగం ఇలా జరుగుతున్నదని రాజేశ్ చెబుతున్నాడు.
-నాగవర్ధన్ రాయల