Sharad Pawar | రష్యా అధ్యక్షుడు పుతిన్ మాదిరిగానే ప్రధాని నరేంద్రమోదీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారని ఎన్సీపీ (శరద్ పవార్) అధినేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Sharad Pawar | ప్రధాని నరేంద్ర మోదీపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్) అధినేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని నరేంద్రమోదీని పోల్చారు. దేశ ప్రజాస్వామ్యాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రమాదంలోకి నెట్టేస్తున్నారని షోలాపూర్ జిల్లా అక్లూజ్‌లో మీడియాతో శరద్ పవార్ అన్నారు. మాధా, షోలాపూర్ స్థానాల్లో అభ్యర్థులను ఖరారుపై చర్చించేందుకు మాజీ డిప్యూటీ సీఎం విజయ్ సింగ్ మోహితే పాటిల్ ఇంటికి శరద్ పవార్ వచ్చారు. ఆయనతోపాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సుశీల్ కుమార్ షిండే కూడా ఉన్నారు.
‘రష్యాలో ప్రజాస్వామ్యాన్ని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ నెమ్మదిగా నాశనం చేస్తున్నారు. ప్రధాని మోదీ అచ్చం అలాగే వ్యవహరిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్ష నేతలెవరూ ఎన్నికవ్వాలని ఆయన కోరుకోవడం లేదు. వారి ఇద్దరి తీరు ఒకే విధంగా ఉంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే ఒక సీఎం (కేజ్రీవాల్)ని అరెస్ట్ చేశారు. నెమ్మదిగా దేశంలో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారు. ఇది దేశాన్ని నిరంకుశత్వం వైపు మళ్లించడమే అవుతుంది. ప్రజాస్వామ్యంలో అధికార పార్టీతోపాటు ప్రతిపక్షమూ ముఖ్యమే’ అని పవార్ అన్నారు. బీజేపీ మ్యానిఫెస్టో మీద వ్యాఖ్యానించడానికి ఇది సరైన సమయం కాదన్నారు.