ధాన్యం కొనుగోలులో ఇంకా వేగం పెంచి రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దాసరి హరిచందన అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని సూచిస్తూ ఆమె ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

- ఇప్పటికి 77,783 మెట్రిక్ టన్నులు సేకరణ
- కలెక్టర్ దాసరి హరిచందన
నల్లగొండ, ఏప్రిల్ 14 : ధాన్యం కొనుగోలులో ఇంకా వేగం పెంచి రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దాసరి హరిచందన అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని సూచిస్తూ ఆమె ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 370 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, ధాన్యం సేకరణ వేగవంతంగా జరుగుతున్నదని తెలిపారు. ఇప్పటి వరకు రూ.171 కోట్ల రూపాయల విలువ చేసే 77,783 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. శనివారం నాటికి 12.66 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఎప్పటికప్పుడు పౌరసరఫరాల శాఖ, మారెటింగ్, సహకార, డీఆర్డీఏ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసేందుకు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేయడంతోపాటు, రెవెన్యూ అదనపు కలెక్టర్, తాసీల్దార్లు పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన టార్పాలిన్లు, తూకం, తేమ కొలిచే యంత్రాలు, తూర్పార బట్టే యంత్రాలు, నీడ, తాగునీటి వసతులు కల్పించినట్లు తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా కోటీ రెండు లక్షల గన్నీ బ్యాగులను సిద్ధం చేశామని, అందులో 34 లక్షల బ్యాగులను కొనుగోలు కేంద్రాలకు పంపించామని తెలిపారు. తాసీల్దార్లు, డిప్యూటీ తాసీల్దార్లు కొనుగోలు కేంద్రాలతోపాటు వారి పరిధిలోని రైస్ మిల్లులను సందర్శించి ధాన్యం దించుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు సమీక్షించి తనకు నివేదికలు పంపించాలని ఈ సందర్భంగా అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే దించుకోవడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన సీఎంఆర్‌ను సకాలంలో చెల్లించాలని మిల్లర్లను ఆదేశించారు.
ధాన్యం కొనుగోలులో సమస్యలను ఎప్పటికప్పుడు పరిషరించేందుకు జిల్లా స్థాయిలో 24 గంటలు పని చేసే విధంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఏమైనా సమస్యలు ఉంటే 9963407064 నంబర్‌ను సంప్రదించాలని రైతులకు సూచించారు. ధాన్యాన్ని శుభ్రపరిచి కొనుగోలు కేంద్రాలకు తెచ్చేలా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. సీరియల్ ప్రకారం ధాన్యం కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేశామని, కేంద్రాల్లో ఏ-2, ఇతర రిజిస్టర్ల నిర్వహణను పౌరసరఫరాల అధికారులు తనిఖీ చేస్తున్నారని తెలిపారు. కొనుగోలు కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసి ధాన్యం సేకరణ సక్రమంగా జరిగేలా చూడాలని ఆర్డీఓలకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.