తెలంగాణ విశ్వవిద్యాలయం తొలి నుంచి వివాదాలకు చిరునామాగా నిలిచింది. ఎందరు అధికారులు మారినా గత పరిస్థితి పునరావృతమవుతున్నది. కీలక బాధ్యతల్లోకి ఎవరొచ్చినా సరే అవినీతి ఆగడం లేదు. విద్యార్థుల జీవితాలను, వారి విలువైన భవిష్యతును పణంగా పెట్టి తమ స్వార్థ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారు.
- విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం
- యూనివర్సిటీలో ఇష్టారాజ్యం
- డేటాబేస్ నిర్వహణలో అంతులేని నిర్లక్ష్యం
- ప్రైవేట్‌కు అప్పగించి చేష్టలూడిగిన వైనం
- పర్చేస్ కమిటీలో చర్చించకుండానే ఏకపక్ష నిర్ణయాలు
- పాత వీసీ కాలం నాటి పరిస్థితులే పునరావృతం
నిజామాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ విశ్వవిద్యాలయం తొలి నుంచి వివాదాలకు చిరునామాగా నిలిచింది. ఎందరు అధికారులు మారినా గత పరిస్థితి పునరావృతమవుతున్నది. కీలక బాధ్యతల్లోకి ఎవరొచ్చినా సరే అవినీతి ఆగడం లేదు. విద్యార్థుల జీవితాలను, వారి విలువైన భవిష్యతును పణంగా పెట్టి తమ స్వార్థ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారు. కీలక పదవి చేపట్టిన మొదట్లో మంచిగానే ఉన్నట్లు నటించి, ఆ తర్వాత తమ అసలు స్వరూపం చూపెడుతున్నారు. నిబంధనలను తోసిరాజని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆర్థికపరమైన విషయాల్లో పాత వీసీ రవీందర్ గుప్తా తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఆయన వ్యవహార శైలి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. టీయూ వ్యవహారంతో ప్రభుత్వం మిగిలిన యూనివర్సిటీలకు విధివిధానాలను జారీచేసి పద్ధతిగా నడుచుకోవాలని ఆదేశాలిచ్చే పరిస్థితి ఏర్పడింది. అయితే, ఇప్పుడు అదే టీయూలో పాత పరిస్థితులు పునరావృతం అవుతుండటంతో మళ్లీ మొదటికొచ్చినైట్లెంది. పర్చేస్ కమిటీలో చర్చించకుండానే ఇప్పుడున్న కీలకమైన వ్యక్తులు నిర్ణయాలను తీసుకోవడంపై జోరుగా చర్చ నడుస్తోంది. ప్రమోషన్ల వ్యవహారాల్లోనూ పాత వీసీ నడిచిన వక్రమార్గంలోనే ప్రస్తుత అధికారులు నడుస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యూనివర్సిటీకి ఆయువు పట్టుగా ఉండాల్సిన పరీక్షల విభాగంలో డేటాబేస్ నిర్వహణ లేకపోవడమూ అటు విద్యార్థులను, ఇటు విద్యానిపుణులను కలవరపెడుతున్నది.
డేటాబేస్ ఏది?
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో రెగ్యూలర్, బ్యాగ్‌లాక్ కలుపుకుని ఏటా దాదాపుగా 30 లక్షల మంది విద్యార్థులు వివిధ పరీక్షలకు హాజరవుతున్నారు. వీరి పరీక్ష ఫలితాలు, మార్కుల వివరాలను పొందుపర్చడం కోసం డేటాబేస్ నిర్వహించాల్సి ఉంటుంది. కానీ టీయూలో అలాంటి పరిస్థితి లేదు. వాస్తవానికి విశ్వవిద్యాలయాల్లో ఈ డేటాబేస్‌ను స్వయంగా యూనివర్సిటీలే నిర్వహిస్తుంటాయి. తెలంగాణ యూనివర్సిటీ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. ప్రైవేటు వ్యక్తుల చేతిలో విద్యార్థుల భవిష్యత్తును పెట్టి తమాషా చూస్తున్నది. ఇందుకోసం రూ.లక్షల నిధులను ఆ సంస్థకు కట్టబెడుతున్నది. వర్సిటీలో సర్వర్ సామర్థ్యం పెంచుకునే వెసులుబాటు ఉన్నా ప్రైవేటు వ్యక్తులకు ఎందుకు అప్పగిస్తున్నారనేది ఎవరికీ అంతుబట్టడం లేదు. పైగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి గుట్టు చప్పుడు కాకుండా తిరిగి అవే బాధ్యతలను కట్టబెట్టడం విమర్శలకు తావిస్తున్నది. ఆర్థిక వ్యవహారాలన్నీ పర్చేస్ కమిటీలో చర్చించాకే నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ప్రస్తుతం వర్సిటీలో కీలక అధికారి ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యూనివర్సిటీలో మొత్తం 8 మంది ప్రోగ్రామర్లు ఉన్నప్పటికీ వారికి బాధ్యతలను అప్పగించకుండా, బయటి వ్యక్తులకు ఇవ్వడంపై విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. వర్సిటీలో సంపూర్ణ ప్రక్షాళన కోసం త్వరలోనే పోరుబాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు.
మొదట తాత్సారం.. తర్వాత హడావుడి
టీయూ వసతి గృహాలు, కళాశాలల్లో సమస్యలు పేరుకు పోయాయి. ఏడాదిన్నరగా విద్యార్థులు అసౌకర్యాలతో కొట్టుమిట్టాడుతున్నారు. సమస్యలపై రిజిస్ట్రార్‌కు, ఇతర విభాగాలకు ఫిర్యాదులు చేసినా ఎవరూ స్పందించడం లేదు. సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యాన్ని ఉద్దేశపూర్వకంగానే కొనసాగించి ఆ తర్వాత హడావుడిగా పనులు చేపడుతున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హడావుడి ప్రక్రియలో నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా పనులు చేయొచ్చన్నది కీలక వ్యక్తుల పన్నాగంగా తెలిసింది. వర్సిటీ వ్యవహారంపై ఉన్నత విద్యా మండలికి, విద్యా శాఖ మంత్రికి త్వరలోనే ఫిర్యాదు చేసేందుకు విద్యార్థులతో పాటు విద్యానిపుణులు సిద్ధమవుతున్నారు. ప్రింటర్లు, రీఫిల్లింగ్, ఎలక్ట్రానిక్ వస్తువులు ఇలా యూనివర్సిటీలో ఏ అవసరం వచ్చినా ఒకే సంస్థ వద్ద కొనుగోళ్లు చేయడంపైనా దుమారం రేగుతున్నది. నిజానికి రూ.లక్షలోపు ఖర్చు చేసే వాటికి మాత్రమే కొటేషన్ ఆహ్వానిస్తారు. రూ.లక్ష దాటే పనులకు టెండర్లు వేసి పనులు చేపట్టాలని గతంలోనే పాలక మండలి తీర్మానం చేసింది. కానీ అందుకు విరుద్ధంగా ఇప్పుడు ఉన్న అధికారులు వ్యవహరిస్తుండడం గమనార్హం. పర్చేస్ కమిటీ మీటింగ్‌లో సభ్యులను బెదిరించి తనకు నచ్చిన కన్సల్టెన్సీకి బాధ్యతలు ఇప్పించేలా మార్గం సుగమం చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతున్నది.