బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు ఉమ్మడి మెదక్ జిల్లాలో మంగళవారం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సుల్తాన్‌పూర్‌లో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభకు లక్షమందికిపైగా ప్రజలు హాజరవుతారన్న అంచనాతో బీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.
- మెదక్, జహీరాబాద్ లోక్‌సభ సెగ్మెంట్లలో ఎన్నికల శంఖారావం
- సుల్తాన్పూర్ వేదికగా ప్రజాఆశీర్వాద సభ గులాబీదళంలో కదనోత్సాహం
- సంగారెడ్డి జిల్లాలో నేడు కేసీఆర్ సభ
- లక్షల మందితో సుల్తాన్‌పూర్‌లో బహిరంగ సభ
KCR | సంగారెడ్డి, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు ఉమ్మడి మెదక్ జిల్లాలో మంగళవారం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సుల్తాన్‌పూర్‌లో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభకు లక్షమందికిపైగా ప్రజలు హాజరవుతారన్న అంచనాతో బీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. మెదక్, జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని ఆరు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి జనసమీకరణపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు.
సభ నిర్వహించనున్న స్థలాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు సోమవారం పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌తో కలిసి పరిశీలించారు. సభ ఏర్పాట్లపై వారికి పలు సూచనలు చేశారు. అనంతరం చింతా ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. బహిరంగసభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు వస్తున్న కేసీఆర్‌కు ఘన స్వాగతం పలుకుతామని చెప్పారు. సభలో హరీశ్‌రావుతోపాటు మెదక్, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థులు వెంకట్రామిరెడ్డి, గాలి అనిల్‌కుమార్, పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర నాయకులు పాల్గొననున్నారు.
ప్రజా ఆశీర్వాద సభకు భారీగా జనసమీకరణ
సుల్తాన్‌పూర్‌లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేసీఆర్ ప్రసంగించనున్న నేపథ్యంలో భారీ వేదికను తీర్చిదిద్దారు. మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు కేసీఆర్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభ ప్రారంభం కానున్నది. కేసీఆర్ హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో పటాన్చెరు, సంగారెడ్డి మీదుగా సుల్తాన్పూర్ చేరుకుంటారు.
కేసీఆర్‌కు స్వాగతం పలుకుతూ ప్రధాన రహదారులు, కూడళ్ల్ల వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటుచేసి, గులాబీ జెండాలతో అలంకరించారు. బహిరంగసభ ప్రాంతంలో కేసీఆర్‌తోపాటు హరీశ్‌రావు, మెదక్, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థులు వెంకట్రామిరెడ్డి, గాలి అనిల్‌కుమార్ కటౌట్లను సైతం ఏర్పాటుచేశారు. మెదక్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని సంగారెడ్డి, పటాన్చెరు, నర్సాపూర్, జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని జహీరాబాద్, అందోలు, నారాయణఖేడ్ అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు.