Bombay High Court | ఒకరి నిద్రించే హక్కును ఉల్లంఘించలేమని, అది మనుషుల ప్రాథమిక అవసరమని బాంబే హైకోర్టు అభిప్రాయపడింది. ఓ వ్యక్తి విచారణ కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) వ్యవహరించిన తీరుపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది.
Bombay High Court : ఒకరి నిద్రించే హక్కును ఉల్లంఘించలేమని, అది మనుషుల ప్రాథమిక అవసరమని బాంబే హైకోర్టు అభిప్రాయపడింది. ఓ వ్యక్తి విచారణ కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) వ్యవహరించిన తీరుపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. మనీలాండరింగ్ కేసులో భాగంగా గత ఏడాది ఆగస్టులో 64 ఏళ్ల రామ్ ఇస్రానీని దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది.
ఆ అరెస్టును సవాల్ చేస్తూ అతను కోర్టును ఆశ్రయించారు. తాను విచారణకు సహకరించానని, పిలిచినప్పుడల్లా హాజరైనా సరే అరెస్టు చేశారని, అది చట్ట విరుద్ధమని తన పిటిషన్లో పేర్కొన్నారు. గత ఏడాది ఆగస్టు 7న అధికారులు తనను రాత్రంతా విచారించి మర్నాడు అరెస్ట్ చేశారని తెలిపారు. దీన్ని పరిశీలించిన న్యాయస్థానం.. ఇస్రానీ పిటిషన్ను తోసిపుచ్చింది. అయితే అతడిని రాత్రంతా ప్రశ్నించడాన్ని మాత్రం తప్పుపట్టింది. నిందితుడి అంగీకారంతోనే తెల్లవారుజాము మూడు గంటల వరకు విచారించినట్లు ఈడీ తరపు న్యాయవాది వాదించడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఏది ఏమైనా అర్ధరాత్రి తర్వాత వాంగ్మూలాన్ని రికార్డు చేసే పద్ధతిని తాము నిరాకరిస్తున్నామని, నిద్ర మనుషుల కనీస అవసరమని, దాన్ని అందించలేకపోవడం హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని వ్యాఖ్యానించారు. అది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని, పగటిపూట మాత్రమే వాంగ్మూలాలను రికార్డు చేయాలని, పిటిషనర్ సమ్మతించినప్పటికీ తర్వాత రోజో, లేదంటే మరోసారో ఆ వ్యక్తిని విచారణకు పిలిచి ఉండాల్సిందని కోర్టు వ్యాఖ్యానించింది.