
మెదక్: మండలంలోని శెట్పల్లి గ్రామంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. గుర్తుతెలియని దుండగులు ఆమె గొంతుకోసి మెడలోని బంగారు హారాన్ని ఎత్తుకెళ్లారు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు… పట్టణంలోని మార్కెట్‌లో గ్రామానికి చెందిన వెంకటేశం, సుజాత దంపతులు కూరగాయల వ్యాపారం చేస్తుంటారు. వీరికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు.
శనివారం ఉదయం 10 గంటల సమయంలో భార్య సుజాత వంట చేసి భోజనం తీసుకురావడానికి ఇంటికి వచ్చింది. మధ్యాహ్నం వరకు తిరిగి రాకపోవడంతో భర్త వెంకటేశం మొబైల్‌కు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో ఇంటికి వెళ్లి చూడగా భార్య సుజాత (40 ఏళ్లు) హత్యకు గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మెదక్ డీఎస్పీ సైదులు, టౌన్ సీఐ మధు, మెదక్ రూరల్ సీఐ విజయ్ కుమార్ తదితరులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్, పోలీస్ డాగ్ టీమ్ ఆధారాలు సేకరిస్తున్నాయి.
జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని సంఘటనా స్థలాన్ని సందర్శించి హత్య జరిగిన తీరును పరిశీలించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఆమె తెలిపారు.
