
- కేరళ ఉన్నత విద్య మరియు సామాజిక న్యాయ శాఖ మంత్రి ఆర్ బిందు
భూదాన్ పోచంపల్లి, డిసెంబర్ 27: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని కేరళ ఉన్నత విద్య, సామాజిక న్యాయ శాఖ మంత్రి ఆర్.బిందు కొనియాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దేశ్ ముఖి గ్రామంలోని సెయింట్ మేరీస్ ఇంజినీరింగ్ కళాశాలలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్ పీఆర్ డీ) మూడో మహాసభ మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వికలాంగుల సంక్షేమాన్ని పట్టించుకోకుండా వారి హక్కులను కాలరాస్తోందన్నారు. వికలాంగులు సమిష్టిగా కేంద్రాన్ని ఎదిరించి తమ హక్కులు, సాధికారత, సంక్షేమం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. 2020లో ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానంలో వికలాంగుల హక్కులు, వారికి కల్పిస్తున్న సౌకర్యాల గురించి ప్రస్తావించలేదని దుయ్యబట్టారు. కేంద్ర విధానం వికలాంగుల ఆశలను వమ్ము చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కంపెనీలు, బడా పెట్టుబడిదారులకు రాయితీలు కల్పిస్తోందని, ఎలాంటి చర్యలు తీసుకోకుండా సామాన్యులు, పేదలు, మధ్యతరగతి, వికలాంగుల జీవితాలతో భారం మోపుతున్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా 60 శాతానికి పైగా పాఠశాలల్లో విద్యుత్ సౌకర్యం లేదని, చాలా గ్రామీణ పాఠశాలల్లో ఇంటర్నెట్ సదుపాయం లేదని చెప్పారు. కార్యక్రమంలో ఎన్‌పిఆర్‌డి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరన్, రాష్ట్ర కార్యదర్శి ఎం.అడివియ్య తదితరులు పాల్గొన్నారు.
