ఎన్నికల సీజన్ వచ్చిందంటే ప్రతి పార్టీ ఓ మ్యానిఫెస్టో విడుదల చేయడం ఆనవాయితీ. పార్టీ ఇచ్చే వాగ్దానాలన్నిటిని గుదిగుచ్చి అందులో ఏకరువు పెడతారు. ఇటీవలి కాలంలో మ్యానిఫెస్టోలకు అందమైన పేరు పెట్టడమూ చూస్తున్నాం.
BJP | ఎన్నికల సీజన్ వచ్చిందంటే ప్రతి పార్టీ ఓ మ్యానిఫెస్టో విడుదల చేయడం ఆనవాయితీ. పార్టీ ఇచ్చే వాగ్దానాలన్నిటిని గుదిగుచ్చి అందులో ఏకరువు పెడతారు. ఇటీవలి కాలంలో మ్యానిఫెస్టోలకు అందమైన పేరు పెట్టడమూ చూస్తున్నాం. కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోను ‘పాంచ్ న్యాయ్’ (ఐదు న్యాయాలు) అని పిలిస్తే.. తాజాగా విడుదలైన బీజేపీ మ్యానిఫెస్టోకు ‘బీజేపీ సంకల్ప పత్ర.. మోదీకీ గ్యారెంటీ’ అని ఓ అసాధారణమైన పేరును తగిలించారు. ఓ జాతీయ పార్టీ మ్యానిఫెస్టోకు ఓ వ్యక్తి పేరు తగిలించడం విశేషమే కదా! మ్యానిఫెస్టో పేరులోనే కాదు లోపల నిండా మోదీ పరుచుకుని ఉండటం గమనార్హం. 2014 మ్యానిఫెస్టోలో మోదీ పేరు కేవలం మూడుసార్లు మాత్రమే వస్తే ఇందులో 65 సార్లు ప్రస్తావనకు రావడం పదేండ్లలో మారిన బీజేపీ పరిస్థితికి అద్దం పడుతున్నది.
ఇందులో ఇచ్చిన గ్యారెంటీలు ఏ మేరకు ఓట్లు తెస్తాయనేది అలా ఉంచితే, మోదీయే తమకు దిక్కు అని బీజేపీ గట్టిగా నమ్ముతున్నట్టు మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. ఎప్పుడైనా పాత హమీలు ఏ మేరకు అమలయ్యాయనేదాన్ని బట్టి కొత్త హామీల మీద నమ్మకం ఏర్పడుతుంది. ఈ విషయంలో బీజేపీ రికార్డు అంతంత మాత్రంగానే ఉన్నది. ఉదాహరణకు 2019 మ్యానిఫెస్టోలో 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారు. ఇది అమలైందా లేదా అనేది తెలుసుకునేందుకు పెద్దగా అధ్యయనం చేయాల్సిన పనిలేదు. రైతులు డిమాండ్ల కోసం మళ్లీ ఉద్యమబాట పట్టడం చూస్తే బీజేపీ హమీ ఏ మేరకు అమలైందో తెలుస్తుంది. కనీస మద్దతు ధర హామీ పరిస్థితి కూడా అంతే. ఇక ఉద్యోగాల హామీ, ఖాతాల్లో 15 లక్షల గురించి ఎంత తక్కువగా చెప్పుకొంటే అంత మంచిది.
అందుకే గత పదేండ్లలో ఏం సాధించారో చెప్పకుండా కేవలం మోదీ ఇమేజీ మీద ఆధారపడి బీజేపీ రంగంలోకి దిగింది. పోయినసారి జాతీయ పౌర రిజిస్ట్రీ (ఎన్‌ఆర్సీ)ని అచిరకాలంలోనే అమలు చేస్తామని చెప్పారు. ఈసారి మ్యానిఫెస్టోలో దాని ప్రస్తావనే లేకపోవడం మారిన బీజేపీ ప్రాధాన్యాలను తెలియజేస్తున్నది. ఇంతకూ 2024 మ్యానిఫెస్టోలో ఏమున్నది? అని తరచి చూస్తే ప్రత్యేకమైన అంశాలు ఏవీ కనిపించవు. ప్రజలు ఆశగా, ఆర్తిగా ఎదురుచూస్తున్న అనేక అంశాలపై మ్యానిఫెస్టోలో ఎలాంటి హామీలు లేకపోవడం గమనార్హం. రైతురుణమాఫీ, ఆదాయపన్ను రాయితీ, చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ పెంపు, ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ, జాతీయ ప్రాజెక్టు హోదాల వంటివి నామమాత్రంగానైనా ప్రస్తావించకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? పైపై మెరుగులతో పాతను కొనసాగిస్తామనడం తప్ప కొత్తగా తెచ్చే మార్పులేవీ ఉండబోవని బీజేపీ మ్యానిఫెస్టోను చూస్తే అర్థమవుతుంది.
మహిళాశక్తి, యువశక్తి, రైతులు, పేదలు అనే నాలుగు స్తంభాలపై వికసిత భారతాన్ని ఆవిష్కరిస్తామని ప్రధాని మోదీ అంటున్నారు. గత పదేండ్లలో నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురయ్యారని విపక్షాలు చెప్తున్నవి కూడా ఈ నాలుగు వర్గాలే కావడం గమనార్హం. ఇంటింటికీ వంటగ్యాస్, సౌరశక్తి ద్వారా ఉచిత విద్యుత్తు వంటి హామీలు మ్యానిఫెస్టోలో చోటుచేసుకోదగిన స్థాయివి కావు. ఇకపోతే ఉచితాలు. విపక్షాలు ఉచితాలను హామీ ఇస్తే రేవడీలు (తాయిలాలు) అని ఈసడించిన బీజేపీ మరో ఐదేండ్లు పేదలకు ఉచిత ధాన్యం పంపిణీ కొనసాగిస్తామని మ్యానిఫెస్టోలో హామీ ఇవ్వడం ఓ వైచిత్రి. పేదరికం గత పదేండ్లలో తగ్గకపోగా పెరిగింది. మరో ఐదేండ్లూ పరిస్థితి అంతే. ఇది బీజేపీ మ్యానిఫెస్టో చెప్పకుండానే చెప్పిన సంగతి.
ప్రజల నుంచి వచ్చిన 15 లక్షల సూచనలతో మ్యానిఫెస్టో రూపొందిందని బీజేపీ నేతలు అంటున్నారు. కొందరు లబ్ధిదారులను పిలిపించి మ్యానిఫెస్టో విడుదల వేదికపై సన్మానించడం విశేషం. ఈ తతంగమంతా బీజేపీ ఆత్మవిశ్వాసాని కంటే అపనమ్మకాన్నే తెలియజేస్తున్నది. సరికొత్త మ్యానిఫెస్టో విడుదల కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. వేదిక మీద అంబేద్కర్ బొమ్మ, రాజ్యాంగ గ్రం థాన్ని అమర్చడం అదనపు చేర్పు. బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్నే మార్చేస్తుందనే విపక్ష ప్రచారాల నేపథ్యంలో ఈ హంగామాను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంబేద్కర్ స్వయంగా వచ్చినా రాజ్యాంగాన్ని మార్చలేడంటూ ప్రధాని మోదీ ఇటీవల చేసిన ప్రకటన కూడా అంతే. ‘హామీ’ స్థానంలో ‘గ్యారెంటీ’ అనే మాటను ఇటీవలి కాలంలో కాంగ్రెస్ ఎక్కువగా వాడుకలోకి తెచ్చింది. ఆ మాట ను బీజేపీ అక్కున చేర్చుకోవడమే కాకుండా మోదీ పేరు తగిలించి తలకెత్తుకుంటున్నది. వాడి పారేసే వస్తువులకు ఇచ్చే ‘గ్యారెంటీ’ అనే పదాన్ని ఎన్నికల హామీలకు చేర్చడం ఈ కాలపు వింతే మరి.