‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ఆదివారం ప్రచురితమైన ‘సర్కారు ధాన్యం.. దర్జాగా మాయం!’ కథనంపై పోలీసుల్లో చలనం మొదలైంది. వనపర్తి జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు స్వగ్రామమైన పెద్దగడపలోని ప్రభుత్వ గోదాం నుంచి అర్ధరాత్రి వేళ ధాన్యం బస్తాలను తరలిస్తూ అడ్డంగా దొరికిన దొంగల ముఠా వ్యవహారంలో డొంక కదులుతున్నది.
- మరో రెండు వాహనాలు స్వాధీనం
- ‘నమస్తే తెలంగాణ’ కథనంతో చలనం
CMR Rice | వనపర్తి, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ఆదివారం ప్రచురితమైన ‘సర్కారు ధాన్యం.. దర్జాగా మాయం!’ కథనంపై పోలీసుల్లో చలనం మొదలైంది. వనపర్తి జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు స్వగ్రామమైన పెద్దగడపలోని ప్రభుత్వ గోదాం నుంచి అర్ధరాత్రి వేళ ధాన్యం బస్తాలను తరలిస్తూ అడ్డంగా దొరికిన దొంగల ముఠా వ్యవహారంలో డొంక కదులుతున్నది. వనపర్తి సీఐ నాగభూషణరావు ఆధ్వర్యంలో పాన్‌గల్, చిన్నంబావి, వీపనగండ్ల ఎస్సైల పర్యవేక్షణలో వడ్ల బస్తాల తరలింపుపై విచారణ చేస్తున్నారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలానికి చెందిన మరో ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ నేపథ్యంలో నాగర్‌కర్నూల్ మండలం వనపట్లలో ఒక వ్యాపారికి చెందిన షెడ్డులో నిల్వ చేసిన మరో 502 ధాన్యం బస్తాలను గుర్తించి చిన్నంబావి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
వడ్ల బస్తాలను తరలించినట్టుగా భావిస్తున్న మరో రెండు బొలేరో వాహనాలను సైతం స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా, పెద్దదగడలోని ప్రభుత్వ గోదాంలో ఇంకా నిల్వ ఉన్న వడ్ల బస్తాల లెక్క తేల్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, యజమాని శ్రీనివాసులు మాత్రం 28,400 బస్తాల వరకు తక్కువగా ఉన్నాయని చెప్తుండగా.. పోలీసులు మాత్రం 13,900 బస్తాల తేడా ఉన్నదని చెప్పినట్టుగా తెలిసింది. ఇద్దరి లెక్కల్లో తేడా ఉన్నందున ఎంతమేర లోటు అన్నది స్పష్టత రావడం లేదు. అయితే, ధాన్యం బస్తాలతో కూడిన మరో మూడు లారీలను వనపర్తి, నాగర్‌కర్నూల్ ప్రాంతంలో గుర్తించినట్టు తెలుస్తున్నప్పటికీ, ధ్రువీకరణ కాలేదు. ఇప్పటివరకు డ్రైవర్లు, కొందరు కూలీలు, ఒకరిద్దరు వ్యాపార సంబంధితులను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్టు సమాచారం.
ఇంత పెద్ద వ్యవహారం వెనక ఉన్న అసలు ముఠాను గుట్టురట్టు చేయడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారమంతా కొల్లాపూర్ నియోజకవర్గం పెద్దకొత్తపల్లి మండలం చుట్టూనే చక్కర్లు కొడుతున్నది. ధాన్యం బస్తాల తరలింపులో అసలు పాత్రధారులు, సూత్రధారులను తప్పించేందుకు రాజకీయ ఒత్తిళ్లు ఉండటం వల్లే కేవలం కూలీలు, వాహన సంబంధీకులు, చిన్న వ్యాపారుల చుట్టూ ఈ వ్యవహారాన్ని తిప్పుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
జూపల్లి ముఖ్య అనుచరుల ప్రమేయం!
బియ్యం మాయమైన గోదాం మంత్రి జూపల్లి కృష్ణారావు స్వగ్రామంలో ఉండగా, ఈ వ్యవహారంలో ఇప్పటివరకు బయటపడుతున్న వారంతా పెద్దకొత్తపల్లి మండలంలో ఆయనకు ముఖ్య అనుచరులుగా ముద్ర ఉన్నవారే కావడం హాట్ టాపిక్‌గా మారింది. వనపట్లలో పట్టుబడిన ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్ముతుండటంతోనే అక్కడి వ్యాపారి కొనుగోలు చేసినట్టు తెలుస్తున్నది. ఆదివారం పట్టుబడిన బొలేరో వాహనాలకు నెంబర్లు కూడా లేకపోవడంతో ఇదంతా పథకం ప్రకారమే జరిగిందా? అన్న అనుమానాలకు బలం చేకూరుతున్నది. దొంగ దందాకు ఉపయోగించిన వాహనాలను సైతం గుర్తించకుండా జాగ్రత్తలు తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
పత్తాలేని పౌరసరఫరాల శాఖ
వనపర్తి జిల్లాలోని గోదాంలో నిల్వ ఉంచిన ధాన్యం బస్తాలు తరలించుకుపోతున్నా పౌరసరఫరాల శాఖ అధికారులు పత్తాలేకుండా పోయారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. ప్రాథమిక సమాచారం తెలుసుకుందామని ప్రయత్నించినా ఆ శాఖ అధికారులు అందుబాటులో ఉండటంలేదట. పౌరసరఫరాల శాఖ నిర్వాకం వల్లే ఇలాంటి ఘటనలకు ఆస్కారం ఏర్పడిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నిల్వ ఉంచిన ధాన్యం బస్తాలను రాత్రిళ్లు దొంగల ముఠా తరలించుకుపోతున్నా సివిల్ సప్లయ్ శాఖ నిద్ర వీడటం లేదు. ధాన్యం బస్తాల తరలింపు వ్యవహారంపై వనపర్తి సీఐ నాగభూషణరావును ఫోన్‌లో వివరణ కోరగా విచారణ కొనసాగుతున్నదని, పూర్తయిన వెంటనే వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
