దేశవ్యాప్తంగా వివిధ కోర్సులకు ప్రవేశ పరీక్షలు, ఉద్యోగార్హత పరీక్షల కోసం అభ్యర్థులకు శిక్షణ ఇచ్చే కేంద్రాలకు కేంద్ర విద్యాశాఖ నూతన మార్గదర్శకాలు జారీ చేసింది.
- ఫలితాలపై మోసపూరిత ప్రకటనలు చేయొద్దు
- ర్యాంకుల కోసం ఒత్తిడి చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిక
- సిబ్బంది తప్పనిసరిగా డిగ్రీ పాసై ఉండాలని ఆదేశం
Coaching Centers | హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా వివిధ కోర్సులకు ప్రవేశ పరీక్షలు, ఉద్యోగార్హత పరీక్షల కోసం అభ్యర్థులకు శిక్షణ ఇచ్చే కేంద్రాలకు కేంద్ర విద్యాశాఖ నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. విద్యార్థుల ఆత్మహత్యలు నివారించటంతో పాటు వారికి సరైన సౌకర్యాలు కల్పించటం, బోధన విధానాలు మెరుగుపర్చటం, అధిక రుసుములు వసూలు చేయకుండా కట్టడి చేసేందుకు వీటిని రూపొందించినట్టు వెల్లడించింది. ఇందులో భాగంగా శిక్షణ కేంద్రాలకు పలు సూచనలు చేసింది.
మార్గదర్శకాలు
- సెకండరీ పాఠశాల విద్య పూర్తిచేసిన వారిని మాత్రమే కోచింగ్ కోసం పేరు నమోదుకు అనుమతించాలని, 16 ఏండ్లలోపు వారిని చేర్చుకోవద్దని కేంద్రం ఆదేశించింది.
- శిక్షణ కేంద్రాల్లో అర్హులైన సిబ్బందిని నియమించుకోవాలని, వారు తప్పనిసరిగా డిగ్రీ పూర్తి చేసి ఉండాలని స్పష్టం చేసింది.
- విద్యార్థుల తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించేలా ర్యాంకులు, మారుల గురించి ఎలాంటి హామీలు ఇవ్వకూడదని
హెచ్చరించింది. - సిబ్బంది అర్హత, కోచింగ్ సెంటర్ వివరాలు, శిక్షణ అందించే కోర్సులు, వసతి సౌకర్యాలు, ఫీజు రీఫండ్ సమాచారం వెబ్సైట్లో పొందుపర్చాలని తెలిపింది.
- ఫలితాలపై మోసపూరిత ప్రకటనలు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామంది.
- కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యార్థులకు చాలినంత స్థలం కేటాయించాలని, కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
- అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణ నష్టం నివారించేందుకు భద్రత ప్రమాణాలు పాటించాలని సూచించింది.
- శిక్షణ ఇచ్చే వ్యక్తి లేదా సంస్థ కోచింగ్ ప్రారంభించిన మూడు నెలల్లో కచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపింది.
- మార్గదర్శకాలకు విరుద్ధంగా నిర్వహిస్తే గుర్తింపు రద్దు చేసి తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.
- ఒకే పేరుతో వేర్వేరు ప్రాంతాల్లో శిక్షణ ఇచ్చే సంస్థలు తప్పనిసరిగా ఆయా బ్రాంచ్‌లను రిజిస్ట్రేషన్ చేయాలని స్పష్టం చేసింది.
- విద్యార్థులకు కెరీర్ గైడెన్స్‌తో పాటు మానసిక ఒత్తిడిని అధిగమించేలా కౌన్సెలింగ్ ఏర్పాటు చేయాలని సూచించింది.
