
ఆ సందేశం చూడగానే ఎవరికైనా సందేహం రావాలి! కానీ, కొందరికి ఏ అనుమానమూ కలుగదు. ‘మీకు లాటరీలో కోట్ల రూపాయలు వచ్చాయ’ని చెబితే.. ఎగిరి గంతేస్తారు కానీ, ఎంతమంది ఆరాలు తీస్తారు? ఆ మెసేజ్ చదువుతున్నప్పుడే వారి కండ్లలో ఓ వెలుగు కనిపిస్తుంది. అయితే, అవే వారి జీవితంలో చివరి ఆనంద క్షణాలని అప్పుడు గుర్తించలేరు. తలుపు తట్టిన అదృష్టం వెనుక అదృశ్య రూపంలో దురదృష్టం పొంచి ఉందని తెలుసుకోలేరు. ఇలా సైబర్ లాటరీ ఉచ్చులో చిక్కుకొని లూటీ అవుతున్నవాళ్లు ఎందరో. ఈ ట్రాప్‌లో పడొద్దంటే.. అప్పనంగా వచ్చిపడే నడమంత్రపు నిధి రహస్యాన్ని విధిగా తెలుసుకోవాల్సిందే!
Cyber Crime | క్విక్ మనీ జమానా ఇది. మొబైల్‌లో పేకముక్కలు ఆడి లక్షలు సంపాదిస్తున్నామని కొందరు గర్వంగా చెబుతుంటారు. బెట్టింగ్ యాప్స్‌లో లక్షలు కొల్లగొట్టానని చాటి చెబుతుంటారు. ఈజీ మనీకి అలవాటుపడిన మనుషుల్ని సైబర్ దొంగలు టార్గెట్ చేస్తుంటారు. భాగ్యలక్ష్మిని మించిన బంపర్ లాటరీ వచ్చిందంటూ మెసేజ్ రూపంలో, ఈ-మెయిల్ ద్వారా బురిడీ కొట్టిస్తారు. మెసేజ్ పట్టించుకోకపోతే పంపినవారికి పోయేదేం ఉండదు. పొరపాటున పట్టించుకున్నామో.. ఖాతాలో ఉన్న సొత్తంతా ఖాళీ అవుతున్న సందేశాల పరంపర మొదలవుతుంది. రెండు మెసేజ్‌లు చదివి, కంగారులోంచి తేరుకునేంతలో అకౌంట్ అంతా గుటకాయ స్వాహా అవుతుంది!
మాయలో పడేసేలా.. లాటరీ ఫ్రాడ్‌స్టర్ల సందేశాలు చాలా కామన్‌గా ఉంటాయి. రకరకాల సంస్థల నుంచి మీకు లాటరీ వచ్చినట్టుగా మెసేజ్ గానీ, మెయిల్ గానీ, కొన్నిసార్లు ఫోన్‌లో గానీ తెలియజేస్తుంటారు. స్క్రాచ్ కార్డు ఆఫర్‌లో లక్షలు గెలుచుకున్నారని, మీ ఫోన్ నంబర్‌కు ఆర్బీఐ లాటరీ తగిలిందని, కౌన్ బనేగా కరోడ్‌పతీ అవకాశం వచ్చిందని, యూరో లాటరీ బంపర్ డ్రా గెలుచుకున్నారని, హాలిడే ట్రిప్ ఫ్రీ ఓచర్ వచ్చిందని ఇలాంటి మెసేజ్‌లు పంపుతూ ఉంటారు. కాస్త బుర్రపెట్టి ఆలోచిస్తే.. ఇవన్నీ ఫేక్ సందేశాలని ఇట్టే తెలిసిపోతుంది. ఉత్త పుణ్యానికి కోట్ల రూపాయలు వస్తున్నాయన్న కక్కుర్తితో నిజానిజాలు నిర్ధారించుకోకుండానే వాళ్ల మాయలో పడిపోతుంటారు చాలామంది. మెసేజ్ రిసీవర్ ధనలక్ష్మి దరువేసుకుంటూ వస్తుందన్న ఆనందంలో ఉండగానే.. కాగల కార్యాన్ని నెరవేర్చుకుంటారు ఫ్రాడ్‌స్టర్లు. లాటరీ మొత్తం పొందాలంటే ముందుగా పన్ను చెల్లించాలనీ, బ్యాంకు వివరాలు పంపాలనీ మెసేజ్‌లు పంపుతారు. ఆర్బీఐ, కౌన్ బనేగా కరోడ్‌పతి, స్నాప్ డీల్ లాటరీ లాంటి ప్రఖ్యాత పేర్లను అడ్డం పెట్టుకొని నమ్మించే ప్రయత్నం చేస్తారు. ‘లక్షల మందిలో లాటరీ దక్కించుకున్న భాగ్యవంతులు మీరే’ అన్నట్టుగా మేసేజ్ ఇస్తారు. కానీ, ఇదే సందేశం వేలమందికి పంపి చోద్యం చూస్తుంటారు. ఇంకాస్త ముదుర్లు ఫోన్ చేసి మరీ యూరో లాటరీ తగిలిందని అద్భుతమైన ఇంగ్లిష్‌లో చెబుతారు. ‘ఆలసించిన ఆశాభంగం.. సత్వరం స్పందించండి.. కోట్లు సొంతం చేసుకోండి’ అని ఆశ పెడతారు. లాటరీ మొత్తం మీద దొంగ చెక్కులు, డీడీలు సృష్టించి వాటి ఫొటోకాపీలను మీకు పంపుతారు. ‘చెక్కు సిద్ధమైందని ప్రాసెసింగ్ ఫీజు చెల్లించిన వెంటనే మీ ఖాతాలో జమ చేస్తామ’ని చెబుతారు. అంతేకాదు, ఈ తతంగం అంతా పూర్తయ్యే దాకా.. ‘మీకు లాటరీ వచ్చిందని ఎవరితో చెప్పకండి.. మిమ్మల్ని మోసం చేసే ప్రమాదం ఉంద’ని సుద్దులు కూడా చెబుతారు.
మనిషి అత్యాశే ఫ్రాడ్‌స్టర్లకు బలం. సైబర్ క్రైమ్‌లో ఆర్థిక నేరాలదే పెద్ద వాటా! కష్టపడకుండా డబ్బులు సంపాదించాలనే కొందరి తత్వం.. ఫ్రాడ్ లాటరీ మేకర్ల కల్పతరువుగా మారుతున్నది. లాటరీ రెగ్యులేషన్ యాక్ట్, 1998 ప్రకారం.. భారతదేశంలో తెలంగాణ సహా 13 రాష్ర్టాల్లో లాటరీలపై నిషేధం కొనసాగుతున్నది. గ్యాంబ్లింగ్ ఆటలపై కూడా మన దేశంలో నిషేధం ఉన్నది. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌కు కూడా ఇది వర్తిస్తుంది.
ఇలా జాగ్రత్త పడదాం..
- మెసేజ్, ఈ-మెయిల్స్‌లో వచ్చే షార్ట్ లింక్స్‌ను క్లిక్ చేయొద్దు.
- HTTPS:// తో మొదలయ్యే వెబ్‌సైట్ల (అడ్రస్ బార్‌లో లాక్ గుర్తును కలిగి ఉంటాయి)ను మాత్రమే క్లిక్ చేయాలని గుర్తుంచుకోండి.
- ఫ్రాడ్‌స్లర్లు పంపే సందేశాల్లో మీ పేరు ఉండక పోవడాన్ని గమనించొచ్చు. పేరూ, ఊరూ లేకుండా వచ్చే సందేశాలు సందేహాత్మకమైనవే!
- మనం లాటరీ టికెట్ కొనకుండా.. ఎలా ప్రైజ్ గెలుచుకుంటామని ఒక్క నిమిషం ఆలోచించండి.
- అన్నిటికన్నా ముఖ్యంగా తెలియని వ్యక్తులు, సంస్థలు డబ్బులు పంపమని అడిగితే.. అస్సలు స్పందించొద్దు.
- ఒక్క మాటలో చెప్పాలంటే లాటరీ పేరిట వచ్చే ఎలాంటి సందేశాలకు, ఈ-మెయిల్స్‌కు, సోషల్ మీడియా పోస్టులకు రెస్పాండ్ అవ్వొద్దు.
- ఒకవేళ మీరు ఏదైనా లాటరీ టికెట్ కొనుగోలు చేసినట్లయితే.. ఆ సంస్థకు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ ద్వారా వివరాలు తెలుసుకోండి.
- అధికారిక లాటరీ సంస్థలు డ్రా వివరాలు పత్రికా ప్రకటన ద్వారా, టెలివిజన్ ద్వారా తెలియజేస్తాయి.
- లాటరీ స్కామ్‌కు గురైతే 1930 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయండి. www.cybercrime.gov.in
- <http://www.cybercrime.gov.in> వెబ్‌సైట్ ద్వారా కైంప్లెంట్ ఇవ్వొచ్చు. బ్యాంకు స్టేట్‌మెంట్, ఎస్సెమ్మెస్ స్క్రీన్‌షాట్, ఏదైనా కొరియర్ రిసీవ్ చేసుకుంటే దానికి సంబంధించిన ఆధారాలు పోలీసులకు అందజేయండి.
