Gold Price | బంగారం అందమైన లోహమే కాదు, అధిక మారకపు విలువ కలిగి ఉంటుంది కూడా. మన దేశంలో మగ, ఆడ తేడా లేకుండా అందరూ బంగారాన్ని ఇష్టపడుతారు. ఎవరైనా నాలుగు రాళ్లు వెనకేసుకోగానే మొదటగా కొనాలనుకునేది బంగారాన్నే. డాబూ దర్పం ప్రదర్శించుకోవాలన్నా బంగారమే శరణ్యం. నగల కోసమే కాదు, పెట్టుబడుల కోసమూ బంగారాన్నే ఆశ్రయిస్తారు.

Gold Price | బంగారం అందమైన లోహమే కాదు, అధిక మారకపు విలువ కలిగి ఉంటుంది కూడా. మన దేశంలో మగ, ఆడ తేడా లేకుండా అందరూ బంగారాన్ని ఇష్టపడుతారు. ఎవరైనా నాలుగు రాళ్లు వెనకేసుకోగానే మొదటగా కొనాలనుకునేది బంగారాన్నే. డాబూ దర్పం ప్రదర్శించుకోవాలన్నా బంగారమే శరణ్యం. నగల కోసమే కాదు, పెట్టుబడుల కోసమూ బంగారాన్నే ఆశ్రయిస్తారు. బంగారం ధర అప్పుడప్పుడు ఆటుపోట్లకు గురైనప్పటికీ మొత్తం మీద స్థిరంగా పెరుగుతుండటమే అందుకు కారణం. పైగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్కెట్లో అమ్మేసి నగదుగా మార్చుకోవడం సులభం. అయితే హిమాలయాల్లో మంచులాగా, సముద్రాల్లో నీరులాగా బంగారం అపరిమితంగా లేదు. గనుల్లోంచి కొండంత మట్టిని తవ్విపోసి శుద్ధి చేస్తే దొరికేది పిడికెడు బంగారమే. అందుకే బంగారానికి అంత డిమాండ్! తాజాగా ఈ డిమాండ్ ప్రతిరోజూ పతాక శీర్షికలకు ఎక్కుతున్నది.
గత వందేండ్లలో బంగారం ధర రూ.100 లోపు నుంచి రూ.70 వేల ఎగువకు చేరుకోవడం గమనార్హం. ఇలా సరికొత్త రికార్డు సృష్టించిన బంగారం ప్రస్తుతం రూ.72 వేల దగ్గర తచ్చాడుతున్నది. 2016తో పోలిస్తే ఇప్పుడు బంగారం ధర రెట్టింపు కావడం విశేషం. ప్రస్తుత గమనాన్ని గమనిస్తే.. రూ.లక్ష దిశగా పసిడి పరుగులు పెడుతున్నదనే విశ్లేషణలూ వినవస్తున్నాయి. మరి ఇటీవలి పొంగు ఎలా, ఎందుకు వచ్చిందని విశ్లేషిస్తే మనకు కొన్ని బాహ్య, అంతర్గత కారణాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా చూస్తే మూడు ప్రధాన కారణాలు దోహదం చేసి ఉంటాయని ఆర్థిక విశ్లేషకుల అభిప్రాయం. అందులో మొదటిది చైనా సెంట్రల్ బ్యాంకు ఇబ్బడిముబ్బడిగా బంగారం నిల్వలు పెంచుకుంటుండటం. రెండోది అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లు పెరుగుదల. మూడోది ద్రవ్యోల్బణం. డాలరు బలహీనమైపోతూ, స్టాక్‌మార్కెట్లు డీలా పడిపోవడంతో మదుపరులు బంగారం వైపు చూస్తున్నారు. యుద్ధాల వల్ల భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగి సరఫరా వ్యవస్థకు ఆటంకాలు ఏర్పడటం డిమాండ్ పెరుగుదలకు మరో కారణమని చెప్పవచ్చు.
బంగారానికి డిమాండ్ పెరగడానికి కొన్ని అంతరంగిక కారణాలూ ఉన్నాయి. భారతీయ కుటుంబ వ్యవస్థ ఇప్పటికీ బంగారం చుట్టే తిరుగుతున్నది. శుభకార్యాలకు బంగారం కొనడం అనే ఆనవాయితీ అనాదిగా వస్తున్నది. పెండ్లిళ్లు, పండుగల సీజన్ దృష్ట్యా మదుపరులే కాకుండా సాధారణ వినియోగదారులూ బంగారం కొంటుంటారు. ధన త్రయోదశి వంటి పండుగలు బంగారం కొనుగోలును ప్రోత్సహించడంలో ప్రముఖపాత్ర వహిస్తున్న సంగతి తెలిసిందే. కొన్నివర్గాల్లో దసరాకు బంగారం కొనడమనే ఆచారమూ ఉన్నది. అంతకంతకూ మధ్యతరగతి పెరుగుతుండటం వల్ల కొనేవారు పెరుగుతున్నారే తప్ప తగ్గడం లేదు. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని నగల వర్తకులు సీజనల్‌గా బంగారాన్ని నిల్వ చేయడం వల్ల కూడా ధరలు పెరిగి ఉండొచ్చని అంటున్నారు. బంగారం ధర విషయంలో మన దేశానికి, కొన్ని ఇతర దేశాలకూ చాలా అంతరం ఉంటుంది. అయితే విదేశాల నుంచి బంగారం తెచ్చుకోవాలంటే ఆంక్షలు, పన్నులు ఆటంకంగా ఉంటాయి. అందుకే అక్రమ తరలింపు అనేది ఒక జాడ్యంగా తయారైంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల దగ్గర అంతకంతకూ ఎక్కువ బంగారం పట్టుబడటం మనం చూస్తున్నాం. ఈ ఆంక్షలను, పన్నులను తగ్గిస్తే బంగారం ధర కొంతమేర దిగివచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే సామాన్యులకు కొంత ఉపశమనం కలుగుతుందని చెప్పొచ్చు.