Gold Rates Hike | బంగారం, వెండి ధరలు పరుగులు తీస్తున్నాయి. రోజురోజుకు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. ఇప్పటికే ఆల్‌టైమ్ హైకి చేరిన బంగారం ధరలు మంగళవారం మార్కెట్‌లో మరోసారి భారీగా పెరిగాయి.
Gold Rates Hike | బంగారం, వెండి ధరలు పరుగులు తీస్తున్నాయి. రోజురోజుకు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. ఇప్పటికే ఆల్‌టైమ్ హైకి చేరిన బంగారం ధరలు మంగళవారం మార్కెట్‌లో మరోసారి భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ నేపథ్యంలో దేశీయ మార్కెట్లలో తీవ్ర ప్రభావం పడుతున్నది. పెరుగుతున్న ధరలతో సామాన్యులకు అందకుండాపోతున్నది. అయితే, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా మదుపరులు బంగారంపై పెట్టుబడుల వైపు దృష్టి సారిస్తున్నారు.
దీంతో డిమాండ్ పెరిగి.. ధరలు పెరుగుతూ వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ బంగారం ఔన్స్‌కు 2,385.35 డాలర్లు పలుకుతున్నది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 2,401.90 వద్ద కొనసాగుతున్నది. మిడిల్ ఈస్ట్‌లో సంక్షోభం, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలతో పసిడికి విపరీతంగా డిమాండ్ నెలకొన్నది. రాబోయే ఆరు నెలల నుంచి ఏడాదిన్నర వరకు బంగారం ఔన్స్‌కు 3వేల డాలర్ల మార్క్‌ను దాట వచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక స్పాట్ వెండి ఔన్స్‌కు 28.69 డాలర్లు పలుకుతున్నది. ఇదిలా ఉండగా దేశీయ మార్కెట్లలో మంగళవారం బంగారం ధరలు ఆల్‌టైం రికార్డు స్థాయికి చేరింది.
తొలిసారిగా రూ.75వేలకు చేరువైంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.900 పెరిగి తులం రూ.67,950కి ఎగిసింది. 24 క్యారెట్ల పసిడిపై రూ.980కి పెరిగి తులానికి రూ.74,130కి చేరింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.68,700 పెరగ్గా.. 24 క్యారెట్ల పసిడి రూ.74,950కి పెరిగింది. ఆర్థిక రాజధాని ముంబయి నగరంలో 22 క్యారెట్ల పుత్తడి రూ.67,950 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.74,130కి చేరింది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.68,100 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.74,280కి పెరిగింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల స్వర్ణం రూ.67,950కి చేరగా.. 24 క్యారెట్ల బంగారం రూ.74,130కి ఎగిసింది. మరో వైపు బంగారంతో వెండి ధర సైతం పోటీపడుతున్నది. మంగళవారం ఒకే రోజు వెండి రూ.1000 పెరుగుదలను నమోదు చేసింది. ఢిల్లీలో కిలోకు రూ.87వేల మార్క్‌ను చేరుకొని రికార్డు స్థాయికి చేరింది. ఇక హైదరాబాద్ మార్కెట్‌లో తొలిసారిగా రూ.90,500 ధర పలుకుతున్నది.