Kadiam Srihari | అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నాం. ప్రజల తీర్పే శిరోధార్యమని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiam Srihar) అన్నారు.
యాదాద్రి భువనగిరి : అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నాం. ప్రజల తీర్పే శిరోధార్యమని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiam Srihar) అన్నారు. సోమవారం యాదగిరిగుట్ట(Yadagirigutta)లో బీఆర్ఎస్(BRS) విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పార్టీ క్యాడర్‌కు ప్రాధాన్యం ఇవ్వకపోవడం, పార్టీ, ప్రభుత్వానికి సమన్వయం లోపించడం, ఆన్ లైన్ పథకాల వల్లే ఓడిపోవాల్సి వచ్చిందని రివ్యూలో తెలిసిందన్నారు.
అలాగే ఎమ్మెల్యేలకే పూర్తి అధికారం ఇవ్వడంతో క్యాడర్‌ను కొందరు ఎమ్మెల్యేలు పట్టించుకోలేకపోవడం వల్లే ఓడినట్లు చెప్పారు. ఓటమితో కుంగిపోవాల్సిన అవసరం లేదు. ఎన్నికల్లో గెలుపు, ఓటమి సహజం అన్నారు. కేసీఆర్ పథకాలు ప్రజల్లో ఇంకా మెదులుతున్నాయి. కాంగ్రెస్ గ్యారంటీలకు ఆశపడి ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేశారన్నారు. ప్రజల్లో ఉన్న భ్రమలు మెల్లమెల్లగా తొలగిపోతున్నాయని ఆయన స్పష్టం చేశారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ 420 హామీలను ఇచ్చింది. 420 అంటేనే మోసానికి మారుపేరని గుర్తు చేశారు. తెలంగాణ ఆత్మగౌరవం బీఆర్ఎస్ తోనే సాధ్యమని పేర్కొన్నారు. తెలంగాణ కోసం కొట్లాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని, తెలంగాణకు నష్టం జరిగితే బీఆర్ఎస్ చూస్తూ ఊర్కోదన్నారు. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
