Kadiyam Srihari | హైదరాబాద్ : కర్ణాటకలో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక చేతులెత్తేసినట్టే తెలంగాణలోనూ చేతులెత్తేస్తారేమోనని అనుమానాలు ఉన్నాయని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు.
Kadiyam Srihari | హైదరాబాద్ : కర్ణాటకలో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక చేతులెత్తేసినట్టే తెలంగాణలోనూ చేతులెత్తేస్తారేమోనని అనుమానాలు ఉన్నాయని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఇటీవల ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అందులో అంతర్లీనంగా ఉన్న 420 హామీలను ఎప్పుడు అమలు చేస్తారో తెలిపే షెడ్యూల్‌కు సంబంధించిన శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ భవన్‌లో బుధవారం బీఆర్‌ఎస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో పాల్గొన్న అనంతరం కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేస్తుందా? చేయదా? అని కర్ణాటకలో చోటుచేసుకుంటున్న పరిణామాలను బట్టి తమకు అనుమానాలు కలుగుతున్నాయన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఐదు హామీలను అమలుచేయటం సాధ్యం కాదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఆర్థిక సలహాదారు బసవరాజ్ రాయరెడ్డి చేతులెత్తేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఉన్నదిఉన్నట్టుగా వాటిని అమలు చేయలేమని వాటిల్లో కొన్ని కోతలు పెట్టాల్సిందేనని తేల్చిచెప్పిన విషయాన్ని ఆయన ఉదహరించారు. ఈ పరిణామం దృష్ట్యా రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తుందా? చేయదా? అనే అనుమానాలు కలుగుతున్నాయని ఆయన అన్నారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కానీ, సీఎం రేవంత్‌రెడ్డి కానీ ఈ విషయంలో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. రైతు రుణమాఫీ, రైతుబంధు, ఎంఎస్‌పీతోపాటు క్వింటాలుకు రూ. 500 బోనస్, 200 యూనిట్ల ఉచిత కరెంటు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు విషయంలో స్పష్టత లేదన్నారు. కాలయాపన చేయటానికే శ్వేతపత్రాల విడుదల, ప్రజాపాలన దరఖాస్తు, వాటి క్రోడీకరణ, కంప్యూటీకరణ వంటి వాటిని చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా కాలయాపన కోసమేనన్న విషయం తేటతెల్లం అవుతుందన్నారు.
తొందరపాటు..గుర్తుచేస్తున్నాం
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాత్రమే తాము కాంగ్రెస్ పార్టీకి గుర్తుచేస్తున్నామని కడియం శ్రీహరి తెలిపారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం కుదుటపడే దాకా వేచిచూడాలన్నదే తమ ఉద్దేశమన్నారు. అయితే డిసెంబర్ 9వ తేదీ నుంచే గ్యారంటీలు అమలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు స్పష్టమైన తేదీలు ప్రకటించిన నేపథ్యంలోనే తాము బాధ్యతాయుత ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వానికి గుర్తుచేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం మీద తమకేం అక్కసులేదని ఆయన తేల్చిచెప్పారు. తాము ప్రజాతీర్పును గౌరవించి ప్రతిపక్ష పాత్రనే పోషిస్తున్నామన్నారు. దీనికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వంద్వార్థాలు తీయాల్సిన పనిలేదన్నారు. ఎన్నికల సమయంలో దళితబంధు పథకాన్ని రెండు లక్షలు పెంచి రూ. 12 లక్షలు ఇస్తామని చెప్పిందని, దీనిపై ప్రభుత్వ వైఖరి ఏమిటని ప్రశ్నించారు. దళితబంధు, గృహలక్ష్మి వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందా? చేయదా? స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎంసీహెచ్‌ఆర్డీలో రాజకీయ సమీక్షలా?
కాంగ్రెస్ ప్రభుత్వం ఎంసీహెచ్‌ఆర్టీని రాజకీయ సమావేశాల వేదికగా మార్చటం సరికాదని కడియం శ్రీహరి పేర్కొన్నారు. అధికారిక కార్యక్రమాల నిర్వహణకు, అధికారుల శిక్షణ కోసం ఉద్దేశించిన ఎంసీహెచ్‌ఆర్డీలో సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ సమావేశాలు నిర్వహించటం వల్ల ప్రజలకు ఏ సంకేతాలు ఇస్తున్నారని ప్రశ్నించారు. ప్రగతిభవన్‌లో కండువాలు కప్పుకుంటున్నారని ఆనాడు ఆనాడు కేసీఆర్‌ను తప్పుపట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేస్తున్నదేమిటన్నారు.
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయొద్దు
ప్రజలచేత ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల విధి, నిధుల నిర్వహణ విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నదని కడియం శ్రీహరి ఆరోపించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యేల (ఎస్‌డీఎఫ్)కు రూ. 10 కోట్లకు కేటాయిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొనటాన్ని ఆయన స్వాగతించారు. అదే సమయంలో ఆ నిధులను ఇన్‌ఛార్జి మంత్రుల ద్వారా ఖర్చుచేస్తానని సీఎం పేర్కొనడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇన్‌ఛార్జీ మంత్రుల ద్వారా సీడీఎఫ్ నిధులు మొత్తం ఖర్చుచేయటం అప్రజాస్వామికమని అన్నారు. గతంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రభుత్వాలు ఎప్పుడూ పూర్తిస్థాయిలో ఎస్‌డీఎఫ్ నిధులను ఇన్‌చార్జీ మంత్రులకు కేటాయించలేదని, 50 శాతం నిధులను ఇన్‌చార్జీలను, మరో 50 శాతం నిధులను సంబంధిత ఎమ్మెల్యేలకు కేటాయించిన ఉదంతాలను తెలుసుకోవాలని ఆయన సూచించారు. ప్రజల చేత ఎన్నికైన ఎమ్మెల్యేలకు బదులు ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులచే వాటిని ఖర్చుచేయాలనే కుట్ర జరుగుతుందని, ఇలాంటి చర్యలకు పాల్పడి ప్రభుత్వం తన ప్రతిష్టను దిగజార్చుకోవద్దని ఆయన సూచించారు. అలాగే ఫార్ములా ఈ-రేసింగ్ నిధులు దుర్వినియోగమైతే విచారణ చేసి బాధ్యులపై చర్య తీసుకోవచ్చని, అలా కాకుండా రేస్‌నే రద్దుచేయటం సరికాదన్నారు.