Kadiyam Srihari | కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరిపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదిగల్లో ఒకడిగా చెప్పుకుంటూ రాజకీయంగా లబ్ధి పొందుతున్న కడియం శ్రీహరి అసలు కులం ఏంటో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మాదిగ నేతలను కాదని కడియం కావ్యకు ఎంపీ టికెట్ ఇస్తే.. కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు.
Kadiyam Srihari | కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరిపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదిగల్లో ఒకడిగా చెప్పుకుంటూ రాజకీయంగా లబ్ధి పొందుతున్న కడియం శ్రీహరి అసలు కులం ఏంటో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మాదిగ నేతలను కాదని కడియం కావ్యకు ఎంపీ టికెట్ ఇస్తే.. కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు. విద్యానగర్‌లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వంగపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. కడియం శ్రీహరి మాదిగలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
కడియం శ్రీహరి కులం విషయంలో మొదటి నుంచి సందేహాలు ఉన్నాయని వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. 30 సంవత్సరాలుగా మాదిగనని చెప్పుకున్న కడియం బీఆర్‌ఎస్‌లో చేరినప్పుడు బైండ్ల కులంగా చెప్పుకున్నారని అన్నారు. బైండ్ల కులం మాదిగలలో ఉప కులం అయినప్పటికీ మాదిగ కులంగా చెప్పుకొని తమ జాతి నేతల అవకాశాలకు అడ్డుతగిలారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో మోత్కుపల్లి నర్సింహులు ఎదగకుండా కడియం శ్రీహరి కుట్రలు చేశారని అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో తాటికొండ రాజయ్య ఎదగకుండా, మంత్రి పదవి పోవడానికి కారణమయ్యారని ఆరోపించారు. మాదిగలను కాదని స్టేషన్ ఘన్‌పూర్ టికెట్‌ను బీఆర్‌ఎస్ కడియం శ్రీహరికి ఇస్తే.. గెలిచిన తర్వాత కాంగ్రెస్‌లో చేరారని మండిపడ్డారు. ఇప్పుడు తన బిడ్డ కావ్యకు కాంగ్రెస్ నుంచి ఎంపీ టికెట్ ఇప్పించుకోవడానికి మాదిగలకు టికెట్ దక్కకుండా అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏనాడు తెలంగాణ ఉద్యమంలో గానీ, మాదిగ దండోరా ఉద్యమంలో గానీ పాల్గొనని కడియం కావ్యకు వరంగల్ ఎంపి టికెట్ ఎలా ఇస్తారని వంగపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు. ఆంధ్రాకు చెందిన ముస్లింను వివాహం చేసుకున్న కడియం కావ్యకు తెలంగాణతో ఏం పని అని ఆయన ప్రశ్నించారు. అసలైన మాదిగలు మోతుకుపల్లి నర్సింహులు, ఆరూరి రమేశ్, పసునూరి దయాకర్ వంటి వారి అవకాశాలను కొల్లగొట్టి, మాదిగలను మోసం చేసిన చరిత్ర కడియం శ్రీహరిదని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డికి మాదిగల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వరంగల్ టికెట్ మాదిగలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి, నాగర్ కర్నూల్ టికెట్ల విషయంలో అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికల్లో మాదిగలకు టికెట్ ఇవ్వకుండా ఎలా తిరుగుతారో చూస్తామని హెచ్చరించారు. కడియం కావ్యకు టికెట్ ఇస్తే రేవంత్‌రెడ్డి మాదిగల ద్రోహిగా నిలిచిపోతారని అన్నారు. మాదిగలను విస్మరిస్తే చంద్రబాబుకు ఏ గతి పట్టిందో భవిష్యత్తులో రేవంత్‌కు అదేగతి పడుతుందని హెచ్చరించారు. మాదిగలకు అన్యాయం చేస్తే తమ సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు.
