
Kriti Sanon | వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ హిందీ చిత్రసీమలో ప్రత్యేకతను చాటుకుంటున్నది కృతిసనన్. ఇటీవల విడుదలైన ‘ది క్రూ’ చిత్రంతో ఈ భామ మంచి విజయాన్ని దక్కించుకుంది. ఆమె నటిస్తూ నిర్మాణ బాధ్యతలు చేపట్టిన ‘దో పత్తి’ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా నిర్మాతగా తన అనుభవాలను పంచుకుంది కృతిసనన్. సినీ రంగంలోకి అడుగుపెట్టినప్పుడే ఏదో ఒక రోజు నిర్మాతగా మారాలని నిర్ణయించుకున్నానని చెప్పిందీ భామ.
సినీ రంగంలో అవకాశాలు ఎవరూ ఇవ్వరని, మనమే సృష్టించుకోవాలని సలహా ఇచ్చింది. “మిమి’ సినిమా షూటింగ్ టైమ్‌లోనే ‘దో పత్తి’ స్క్రిప్ట్ విన్నా. మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో అద్భుతంగా అనిపించింది. నా హృదయానికి ఎంతో దగ్గరైంది. కథలో నేనే కొన్ని మార్పులను సూచించాను. సినీ రంగం సృజనాత్మకతతో కూడుకున్నది. ఇక్కడ ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో ముందుకెళ్లాలి. అవకాశాలను కూడా మనమే సృష్టించుకోవాలి’ అని కృతిసనన్ చెప్పింది. తాను కామెడీ సినిమాలను బాగా ఇష్టపడతానని, అలాగే ఓ స్వచ్ఛమైన ప్రేమకథలో నటించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నానని కృతిసనన్ పేర్కొంది.