లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) మూడో విడుత నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 పార్లమెంట్ స్థానాల్లో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) మూడో విడుత నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 పార్లమెంట్ స్థానాల్లో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 19 వరకు నామపత్రాలు సమర్పించవచ్చు. నామినేషన్లను ఏప్రిల్ 20న పరిశీలిస్తారు. ఆయా స్థానాల్లో మే 7న పోలింగ్ జరుగనుంది.
మూడో విడుతలో అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూ, జమ్ము కశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు జరుగనున్నాయి. వీటితోపాటు మధ్యప్రదేశ్‌లోని బేతుల్ లోక్‌సభ నియోజకవర్గానికి కూడా అదే రోజున పోలింగ్ జరుగనుంది. రెండో విడుతలో భాగంగా అక్కడ ఎన్నికలు జరుగాల్సి ఉన్నాయి. అయితే బీఎస్పీ అభ్యర్థి మరణంతో ఆ నియోజకవర్గంలో ఎన్నిక వాయిదాపడింది. దీనికి కూడా ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
18వ లోక్‌సభ ఎన్నికలు ఏడు విడుతల్లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలు 19న ప్రారంభమై జూన్ 1న ముగియనున్నాయి. జూన్ 4న ఫలితాలు విడుదలకానున్నాయి. ఇప్పటికే రెండు నోటిఫికేషన్లు విడుదలవగా, నాలుగో విడుత ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 18న నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ దశలో 96 ఎంపీ స్థానాల్లో మే 13న ఎన్నికలు జరుగనున్నాయి.