ప్రస్తుత ఎన్నికల్లో పార్టీల ప్రచారం ఎలా ఉన్నా.. సగటు ఓటరు మాత్రం తన సమస్యల చుట్టే ఆలోచిస్తున్నాడు. నిరుద్యోగం, ధరలే ప్రధానంగా ఓటేస్తామని 50శాతం మంది అభిప్రాయ పడినట్టు లోక్‌నీతి తాజా సర్వే వెల్లడించింది.

- నిరుద్యోగం.. ధరల భారం
- ఈ రెండింటి ఆధారంగానే ఓటు
- ప్రతి ఇద్దరు ఓటర్లలో ఒకరి మాట ఇదే
- సీఎస్‌డీఎస్ – లోక్‌నీతి సర్వేలో వెల్లడి
- రామమందిర నిర్మాణ ప్రభావం స్వల్పమే
- అవినీతి పెరిగిందన్న 55 శాతం మంది
- రైతుపోరుకు 59 శాతం సానుకూలం
ప్రస్తుత ఎన్నికల్లో పార్టీల ప్రచారం ఎలా ఉన్నా.. సగటు ఓటరు మాత్రం తన సమస్యల చుట్టే ఆలోచిస్తున్నాడు. నిరుద్యోగం, ధరలే ప్రధానంగా ఓటేస్తామని 50శాతం మంది అభిప్రాయ పడినట్టు లోక్‌నీతి తాజా సర్వే వెల్లడించింది.
Lok Sabha Elections | న్యూఢిల్ల్లీ, ఏప్రిల్ 11: దేశంలో నిరుద్యోగ సమస్య, విపరీతంగా పెరుగుతున్న ధరల ప్రభావం రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కనిపించబోతున్నదా? బీజేపీ విజయావకాశాలపై ఈ రెండు అంశాలు గట్టిగానే దెబ్బతీస్తాయా? అంటే అవుననే అంటున్నది సీఎస్‌డీఎస్ – లోక్‌నీతి సర్వే. 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దేశ ప్రజల మనోగతాన్ని గుర్తించేందుకు సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవెలపింగ్ సొసైటీస్(సీఎస్‌డీఎస్) – లోక్‌నీతి సంస్థ ప్రీ పోల్ సర్వే నిర్వహించింది. 19 రాష్ర్టాల్లోని 100 లోక్‌సభ నియోజకవర్గాల్లో సర్వే చేసి 10,019 మంది అభిప్రాయాలను సేకరించింది.
ప్రభావం చూపేది బీజేపీపైనే ?!
లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఏ అంశాన్ని ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటారని ఓటర్లను అడగగా.. నిరుద్యోగ అంశాన్ని తీసుకొంటామని 27 శాతం మంది ఓటర్లు అభిప్రాయపడ్డారు. ధరల పెరుగుదల అంశం ముఖ్యమైనదని 23 శాతం మంది పేర్కొన్నారు. అంటే, మొత్తం ఓటర్లలో 50 శాతం మంది ఈ రెండు అంశాల ఆధారంగానే ఓటు వేయబోతున్నారని ఈ సర్వే పేర్కొన్నది. పదేండ్లుగా కేంద్రంలో, మెజారిటీ రాష్ర్టాల్లో అధికారంలో ఉన్నందున నిరుద్యోగం, ధరల పెరుగుదల అంశాల్లో ఓటర్ల అసంతృప్తి బీజేపీకి ఇబ్బందికరంగా మారవచ్చు. ధరల పెరుగుదలకు కేంద్రమే కారణమని 26 శాతం మంది భావిస్తుండగా, 12 శాతం మంది మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలే కారణంగా చెప్తున్నారు. 56 శాతం మంది రెండూ కారణమంటున్నారు.

Unemployment
రామమందిర నిర్మాణం ఓట్లు రాల్చదా?
అభివృద్ధిని ప్రధాన అంశంగా పరిగణించి ఓటు వేస్తామని 13 శాతం మంది అభిప్రాయపడ్డారు. గత ఐదేండ్లలో అభివృద్ధి ఎలా జరిగిందని అడిగిన ప్రశ్నకు.. 32 శాతం మంది కేవలం ధనికులకే పరిమితమైందని చెప్పగా, 48 శాతం మంది అందరికీ అభివృద్ధి ఫలాలు అందాయని అభిప్రాయపడ్డారు. 15 శాతం మంది మాత్రం అసలు అభివృద్ధి జరగలేదని పేర్కొన్నారు. ఇక, ఎనిమిది శాతం మంది అవినీతి అంశాన్ని పరిగణనలోకి తీసుకొని ఓటు వేస్తామని చెప్పారు.
గత ఐదేండ్లలో అవినీతి పెరిగిందా? తగ్గిందా? అని అడిగిన ప్రశ్నకు 55 శాతం మంది పెరిగిందని, 19 శాతం మంది యథాతథంగా ఉందని, 19 శాతం మంది మాత్రం అవినీతి తగ్గిందని చెప్పారు. తమకు ఓట్లు కురిపిస్తుందని బీజేపీ ఎంతగానో ఆశలు పెట్టుకున్న అయోధ్యలో రామమందిర నిర్మాణం అంశాన్ని ఓటు వేయడానికి ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటామని కేవలం 8 శాతం మంది మాత్రమే చెప్పారు. హిందుత్వ అంశం ఆధారంగా ఓటు వేస్తామని రెండు శాతం మంది, అంతర్జాతీయంగా భారత్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఓటు వేస్తామని రెండు శాతం మంది అభిప్రాయపడ్డారు.