Medaram Jatara | మేడారం మహాజాతర శనివారంతో ముగిసింది. మూడురోజుల పాటు భక్తుల పూజలందుకున్న సమ్మక్క-సారలమ్మ వనప్రవేశంతో జాతర పరిసమాప్తమైంది. వన ప్రవేశంతో బుధవారం సారలమ్మ తర్వాత మహాజాతర లాంఛనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే.
Medaram Jatara | మేడారం మహాజాతర శనివారంతో ముగిసింది. మూడురోజుల పాటు భక్తుల పూజలందుకున్న సమ్మక్క-సారలమ్మ వనప్రవేశంతో జాతర పరిసమాప్తమైంది. వన ప్రవేశంతో బుధవారం సారలమ్మ తర్వాత మహాజాతర లాంఛనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. గురువారం సమ్మక్కను గద్దెపైకి చేరుకున్నారు. తల్లులు గద్దెలపై కొలువుదీరగా.. అశేష భక్తజనం తరలివచ్చి మొక్కులు సమర్పించారు. భక్తులు పోటెత్తడంతో మేడారం జనజాతరను తలపించింది. భక్తులు జంపన్న వాగులో పుణ్య స్నానాలు చేసి.. బంగారం తులాభారం, మొక్కులు సమర్పించారు.
శనివారం ఇద్దరు తల్లులు సాయంత్రమే వన ప్రవేశం చేశారు. మేడారం గద్దెపై నుంచి చిలుకలగుట్టకు సమ్మక్క చేరుకుంది. కన్నెపల్లికి సారలమ్మ, పూనుగొండ్లకు పగిడిద్దరాజు, కొండాయికి గోవిందరాజు తిరిగి పయనమయ్యారు. వన దేవతలు గద్దెలను వీడుతున్న సమయంలో మేడారంలో వర్షం కురిసింది. దీన్ని శుభసూచకంగా భావించిన భక్తులు జయజయ ధ్వానాలు చేస్తూ గిరిజనదేవతలకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతర నాలుగు రోజుల పాటు కనులపండువలా సాగింది. జాతరలో కీలక ఘట్టమైన సమ్మక్క 7.27గంటలకు వనప్రవేశం చేయడంతో జాతర పరిసమాప్తమైంది.
