మద్యం పాలసీ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) మరికాసేపట్లో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరు కానున్నారు. ఉదయం 10.30 గంటలకు సీబీఐ ఆమెను కోర్టులో ప్రవేశపెట్టనుంది.

న్యూఢిల్లీ: మద్యం పాలసీ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) మరికాసేపట్లో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరు కానున్నారు. ఉదయం 10.30 గంటలకు సీబీఐ ఆమెను కోర్టులో ప్రవేశపెట్టనుంది. నిన్న తీహార్ జైలులో ఉన్న కవితను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారం రోజులపాటు కస్టడీ కోరే అవకాశం ఉంది. అయితే కనీసం నోటీసు కూడా ఇవ్వకపోవడం చట్ట వ్యతిరేకమని కవిత తరఫు లాయర్ అన్నారు. సీబీఐ ఎవరికీ తెలియకుండా కోర్టులో అప్లికేషన్లు దాఖలుచేసి అనుమతులు పొందిందని ఆక్షేపించారు.
ప్రస్తుతం తీహార్ జైలులో కస్టడీలో ఉన్న కవితను సీబీఐ గురువారం అరెస్టు చేసింది. ఐపీసీ 477, 120(ఆ), పీసీ చట్టం 7 సెక్షన్ల ప్రకారం ఆమెను అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించింది. ఆమెను శుక్రవారం ట్రయల్ కోర్టులో హాజరుపర్చనుంది. కాగా కవితను సీబీఐ అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఆమె తరఫు న్యాయవాది మోహిత్‌రావు గురువారం రౌస్ ఎవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రంజాన్ సెలవు దినం కావడం, ఈ కేసుకు సంబంధించిన సమాచారం లేదని ప్రతివాదులు చెప్పడంతో ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ సాధ్యం కాదని కోర్టు తెలిపింది. రెగ్యులర్ కోర్టులోనే ఈ వివాదాన్ని పరిషరించుకోవాలని సూచించింది.
కనీస సమాచారం లేకుండా అరెస్టు
కవిత అరెస్టును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలన్న విజ్ఞప్తిమేరకు గురువారం సాయంత్రం 4.55 నిమిషాలకు ప్రత్యేక న్యాయమూర్తి మనోజ్‌కుమార్ విచారణ చేపట్టారు. కవిత తరఫున న్యాయవాది నితేశ్ రాణా వర్చువల్‌గా, మోహిత్‌రావు ప్రత్యక్షంగా వాదనలు వినిపిస్తూ.. సీబీఐ చర్యలు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని అన్నారు. సీబీఐ చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తున్నదని, నిబంధనలను తుంగలోకి తొకిందని అన్నారు. సీబీఐ కనీస ప్రమాణాలు పాటించలేదని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం ఇవ్వాలన్న ఉన్నత న్యాయస్థానాల ఆదేశాలను సీబీఐ పాటించలేదని తెలిపారు. పిటిషన్‌పై వాదనలు వినాలా? వద్దా? అన్న దానిపై ఇంకా నిర్ణయమే జరగలేదని జడ్జి మనోజ్ కుమార్ పేరొన్నారు.
ఈ కేసుపై తన దగ్గర ఎటువంటి సమాచారం లేదని తెలిపారు. మీకేమైనా సమాచారం ఉందా? అని సీబీఐ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ప్రశ్నించగా.. తనకూ ఎలాంటి సమాచారం లేదని జవాబు ఇచ్చారు. అసలు సీబీఐ అరెస్టు చేసిందని మీరెలా చెబుతున్నారని కవిత తరఫు న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది. కవితను అరెస్టు చేసినట్టు ఆమె భర్త అనిల్‌కు సీబీఐ సమాచారం ఇచ్చిందని మోహిత్‌రావు తెలిపారు. అయితే.. అత్యవసర కేసులను మాత్రమే తాము విచారిస్తామని, కాబట్టి ఈ విషయంలో కవితకు ఎటువంటి ఊరట ఇవ్వలేమని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ వ్యవహారాన్ని రెగ్యులర్ కోర్టులోనే తేల్చుకోవాలని చెప్పారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టాలని రెగ్యులర్ బెంచ్‌కు సూచించారు. ఈ దశలో న్యాయవాది మోహిత్‌రావు కల్పించుకుంటూ తమ అప్లికేషన్‌ను పరిగణనలోకి తీసుకోవాలని కోరగా.. అందుకు జడ్జి అంగీకరించారు.
అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది?
కవిత అరెస్ట్ అన్యాయం, రాజ్యాంగ విరుద్ధమని ఆమె న్యాయవాది మోహిత్‌రావు మీడియాతో చెప్పారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. సీబీఐ స్పెషల్ కోర్టు వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. జైలులో ఉన్న కవితను అరెస్ట్ చేయాలంటే వారంట్, కోర్టు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కోర్టు అనుమతులు ఇవ్వడం అన్యాయమని అన్నారు. ఇలా జరగడం ఇది రెండోసారని చెప్పారు. ఈ నెల 5న కవితను జైళ్లో విచారించేందుకు, ఇప్పుడు అరెస్ట్ చేసేందుకు కోర్టు అనుమతిచ్చిందని తెలిపారు. తమకు ఏం జరుగుతున్నదో తెలియకుండా పూర్తిగా చీకట్లో పెట్టి ఆమెను అరెస్ట్ చేశారని తప్పుపట్టారు. చట్టం పక్రారం.. ప్రతివాదులుగా తమకు నోటీసు ఇవ్వాలని అన్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామన్నారు.