MLC Kavitha | ఆరు గ్యారెంటీల(Six guarantees) అమలుకు ఈ బడ్జెట్(Budjet) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయలేదని, బడ్జెట్‌లో మొత్తం ఆత్మస్తుతి, పరనిందలే ఉన్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.
హైదరాబాద్ : ఆరు గ్యారెంటీల(Six guarantees) అమలుకు ఈ బడ్జెట్(Budjet) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయలేదని, బడ్జెట్‌లో మొత్తం ఆత్మస్తుతి, పరనిందలే ఉన్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రజావాణిని(Prajavani) వినడం లేదు..ఢిల్లీవాణినే వింటున్నారు. ప్రజావాణికి ఒక్క రోజే హాజరైన సీఎం వారానికి 2 సార్లు ఢిల్లీకి పయనమవుతున్నారని ఎద్దేశా చేశారు. పాత పద్ధతులే కొనసాగించడానికి కొత్త ప్రభుత్వం ఎందుకు ? అని ప్రశ్నించారు.
2024-25 మధ్యంతర బడ్జెట్ పై బుధవారం శాసన మండలిలో జరిగిన చర్చలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొని మాట్లాడారు. కౌన్సిల్ ప్రతిష్టను, గౌరవ మర్యాదలను భంగపరిచే విధంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాము సభను స్థంభింపజేసినా ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారో ముఖ్యమంత్రి చెప్పాలని కోరారు.
బడ్జెట్‌లో ప్రస్తావనే లేదు
రానున్న ఐదేళ్లకు పునాది వేసే బడ్జెట్‌లో మొదటి ఏడాదే ప్రజలకు ఏం చేస్తారో ప్రభుత్వం చెప్ప లేకపోయిందని తప్పుబట్టారు. గత ప్రభుత్వంపై నిందలు వేయడం తప్పా ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో బడ్జెట్ లో చెప్పలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పేర్కొన్న హామీల అమలుపై ఎక్కడా చెప్పలేదని వివరించారు. ఆరు గ్యారెంటీలు ఖురాన్, బైబిల్, భగవద్గీత అని ఎన్నికల సమయంలో పదేపదే ముఖ్యమంత్రి ప్రచారం చేశారని, కానీ ఆ గ్యారెంటీల్లో 10 శాతం అంశాలు కూడా బడ్జెట్ లో ప్రస్తావన లేకపోవడం బాధాకరమన్నారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రకు తెలంగాణ బస్సును పంపించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఖర్చు కోసం తెలంగాణ ఏటీఎంగా మారిందని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో ఒక్క నిమిషం కూడా కరెంటు పోలేదని, ఇప్పుడు హైదరాబాద్ లోనే రోజుకు 3-4 గంటలు కరెంటు పోతుంటే పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రతిష్ట దిగజారిపోతున్నదని మండిపడ్డారు. గత రెండు నెలల్లో సాంఘీక సంక్షేమ హాస్టళ్లలో ముగ్గురు ఆడబిడ్డలను ఆత్మహత్య చేసుకుంటే స్పందించడానికి సీఎంకు తీరిక లేదా అని నిలదీశారు.
బతుకమ్మ చీరల పంపిణీ కొనసాగిస్తారా?
బడ్జెట్ లో ఆరు గ్యారెంటీలు అమలు చేయాలంటే దాదాపు రూ. కోటి 36 లక్షల కోట్లు అవరమవుతాయని అంచనా అని, కానీ ప్రభుత్వం ఈ బడ్జెట్ లో కేవలం రూ. 53 వేల కోట్లు మాత్రమే అవసరమవుతాయని ప్రభుత్వం చెప్పిందని వివరించారు. వికలాంగులకు కూడా బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. బీసీ సబ్ ప్లాన్ కు చట్టబద్ధత ఇస్తామన్న హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తారా లేదా నిలిపివేస్తారా అని ప్రభుత్వాన్ని అడిగారు.
వరి, పత్తి, పసుపు వంటి పంటలకు బోనస్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, కానీ ఇప్పుడు కనీస మద్ధతు ధర కంటే తక్కువ వస్తానే బోనస్ ఇస్తామని మంత్రులు అంటున్నారని విమర్శించారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించి కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయిందని అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ ను తిట్టడం మానేసి కోతలు లేని విద్యుత్తును పంపిణీ చేయాలని సవాలు చేశారు.
