
న్యూఢిల్లీ: ప్రత్యర్థులను టార్గెట్ చేసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ వాడుకుంటోందని విపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలకు ఇవాళ ప్రధాని మోదీ(PM Modi) కౌంటర్ ఇచ్చారు. కేవలం మూడు శాతం ఈడీ కేసులు మాత్రమే రాజకీయ నాయకులతో సంబంధం ఉన్నట్లు ఆయన తెలిపారు. హిందుస్థాన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. మీకో నిజం చెబుతానని, దాని గురించి ఎవరికీ తెలియదని, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తున్న అవినీతి కేసుల్లో, కేవలం మూడు శాతం కేసులు మాత్రమే రాజకీయాలతో లింకు ఉన్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. మిగితా 97 శాతం కేసులు అధికారులు, క్రిమినల్స్‌కు సంబంధం ఉన్నట్లు ఆయన చెప్పారు. గత పదేళ్లుగా తమ ప్రభుత్వం అవినీతి నిర్మూలనకే పనిచేసిందని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ అవినీతిని అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.