మాజీ ప్రధాని పీవీ నరసింహారావు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన ఓ ఆలోచనా ధార. తాత్వికతకు చిరునామా. ప్రజల కష్ట-సుఖాలను ఎరిగిన భూమి పుత్రుడు.
- అంతర్జాతీయ రాజకీయాలను అవపోసనపట్టిన దౌత్య చతురుడు
PV Narasimha Rao | హైదరాబాద్, ఫిబ్రవరి 9 ( స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): మాజీ ప్రధాని పీవీ నరసింహారావు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన ఓ ఆలోచనా ధార. తాత్వికతకు చిరునామా. ప్రజల కష్ట-సుఖాలను ఎరిగిన భూమి పుత్రుడు. అంతర్జాతీయ రాజకీయాలను అవపోసనపట్టిన దౌత్య చతురుడు కూడా. ఆర్థికవేత్తగా, భూసంస్కరణలు చేపట్టిన సంఘసంస్కర్తగా, సాహితీవేత్తగా, తాత్వికుడిగా ఆయన అందరికీ సుపరిచితులే. పీవీ ఆలోచనల్లోని భావధార ఎంత లోతైనదో ఆయన చేసిన ప్రసంగాలను బట్టి తెలుసుకోవచ్చు. ఆయన నోటినుంచి వివిధ సందర్భాల్లో జాలువారిన మాటలు అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ భవిష్యత్తు తరాలకు అనుసరణీయమే.
పీవీ మాట.. భవితకు బాట
ఆర్థిక స్వాతంత్య్రానికి త్యాగాలు అవసరం
దృఢమైన దేశ నిర్మాణంలో అంతర్భాగమైన ఆర్థిక స్వాతంత్య్రాన్ని కాపాడుకోవడం ఎంతో అవసరం. అయితే, దీనికోసం ఆర్థిక క్రమశిక్షణ పాటించడంతోపాటు అవసరమైన త్యాగాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలి.
మిథ్యలో మరో మిథ్య!
పురస్కారాలు స్వీకరించడం, సన్మానాలు చేయించుకోవడం, కిరీటాలు ధరించడం నాకు అంతగా నచ్చదు. రాజలక్షణాలన్నీ ప్రతిబింబించే ఇలాంటి వేషాలు వేయడానికి మనస్కరించదు. జీవితం మిథ్యైతే.. దానికి మరో మిథ్యను జోడించడం ఏమిటో?!
మొక్కలో మార్పు గమనించారా?
ఇప్పుడిప్పుడే పెరుగుతున్న మొక్కను దారిన వెళ్లే మేక కూడా తిని పారేయగలదు. కానీ, అది పెరిగి మహా వృక్షంగా మారితే ఏనుగును కూడా దానికి కట్టేయగలం.
చట్టమే ఆయుధం
నాగరిక సమాజంలో తుపాకులతో కూడిన పోరాటం ఉండదు. కత్తులతో యుద్ధం సాగదు. మన పోరాటం చట్టం ద్వారా సాగుతుంది. అదే మన ఆయుధం
అహింసాయుత ప్రపంచం అప్పుడే!
నిరాయుధీకరణకు అన్ని దేశాలు చిత్తశుద్ధితో, నిబద్ధతతో కృషి చేయాలి. తద్వారా అణ్వాయుధాల బారినుంచి బయటపడుతాం. అప్పుడే, అహింసాయుత ప్రపంచానికి నాందిపలికే అవకాశం దొరుకుతుంది.
పల్లెప్రగతి ఎంత ముఖ్యమైనదంటే?
గ్రామీణ ప్రాంతంలో జీవనోపాధి లేకపోతే, నిరుద్యోగి హింసకు పాల్పడుతాడు. లేకపోతే పట్టణప్రాంతాలకు వలసపోయి.. అక్కడ కొత్త సమస్యలు సృష్టిస్తాడు. అందుకే పల్లె ప్రగతి ఎంతో ముఖ్యం.
మతోన్మాదం ప్రమాదకరమైన వైరస్
మతోన్మాదం అనేది అత్యంత ప్రమాదకారియైన వైరస్. ఇది విద్వేషాలను పెంచుతుంది. అయితే ఈ వైరస్ను ఎదుర్కొనడానికి దేశశక్తిని, వనరులను ఉపయోగించవలసి రావడం దురదృష్టకరం.
దేశ నిర్మాణమే ధ్యేయం
రాజకీయాలు, వ్యక్తిగత ప్రయోజనాలకు అతీతంగా అందరూ ఏకమవ్వాలి. దేశ నిర్మాణమే ధ్యేయంగా కలిసిరావాలి. అప్పుడే నవభారతం సాకారమవుతుంది.
కార్మికులుగా మారాల్సిందే
సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోకపోతే మన దేశం అంతర్జాతీయ మార్కెట్లో నిలదొక్కుకోలేదు. అప్పుడు మన శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు ఇతర దేశాల పరిశ్రమల్లో కార్మికులుగా మగ్గిపోతారు.
సంస్కరణల బాట పూలబాట కాదు
సంస్కరణల బాట పూలబాట కాదు. ప్రజాస్వామ్యంలో ఇది మరింత కఠినతరం. ఇందుకు ప్రయత్నించిన ప్రతీ దేశం ఇబ్బందులను ఎదుర్కొన్నదే. అయితే చివరకు దక్కే ఫలాలే ముఖ్యం.
యువత రావాలి
యువత రాజకీయాల్లోకి రావాలి. స్వార్థం కోసమో, డబ్బు కోసమో కాకుండా ప్రజాసేవ చేయడానికి రావాలి. రాజకీయాల్లో కొనసాగాలంటే మనసుతో మాట్లాడుకోవాలి. మనసుకే సర్ధిచెప్పుకోవాలి. అలా చేయకపోతే, రాజకీయాలు చేయలేం.
నాణేనికి రెండు ముఖాలు
ఆత్మ నిగ్రహం పాటించనంత వరకూ అహింసను సంపూర్ణంగా స్థాపించలేం. హింసా భావన ఉన్నంతవరకూ ఆత్మ నిగ్రహం సాధ్యంకాదు. రెండూ ఒకే నాణేనికి రెండు ముఖాల్లాంటివి.
