సీఎం జగన్‌పై దాడి దారుణమని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి (Sajjala Ramakrishna Reddy) అన్నారు. ముఖ్యమంత్రిపై దాడిని పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నదని చెప్పారు. ఇది పిరికిపంద చర్య అని విమర్శించారు.
అమరావతి: సీఎం జగన్‌పై దాడి దారుణమని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి (Sajjala Ramakrishna Reddy) అన్నారు. ముఖ్యమంత్రిపై దాడిని పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నదని చెప్పారు. ఇది పిరికిపంద చర్య అని విమర్శించారు. దాడిలో జగన్‌కు సున్నితమైన భాగంలో రాయి తాకడంతో బలమైన గాయమైందన్నారు. కనుబొమ్మకు కింద భాగంలో తాకితే కన్ను పోయేదని తెలిపారు. కణతి భాగంలో రాయి తగిలి ఉండుంటే ప్రాణానికే ప్రమాదం ఉండేదన్నారు. తాడేపల్లిలోని పార్టీ ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కనుగుడ్డుకు రాయి తాకిందని, జగన్‌కు తాకిన రాయి వెల్లంపల్లికి కూడా తాకిందంటే ఎంత ఫోర్స్‌గా ప్రయోగించారో తెలుస్తుందన్నారు. దాడికి ఎయిర్ గన్ ఉపయోగించి ఉండొచ్చని అనుమానం వ్యక్తంచేశారు.
ఇది ఆకతాయిలు చేసిన పని కాదని, పక్కా ప్రణాళికతోనే చేశారని వెల్లడించారు. జగన్‌పై దాడి భద్రతా వైఫల్యమని టీడీపీ నాయకులు అంటున్నారని విమర్శించారు. దాడిని నటన అంటూ ఆ పార్టీ నేతలు మూర్ఖంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎవరైనా తమపై తామే ఇలాంటి దాడి చేయించుకుంటారా అని ప్రశ్నించారు. కొంచెం తేడా వచ్చినా ప్రాణం పోతుందని, అలాంటిది ఎవరైనా తమపై తామే దాడులు చేయించుకుంటారా అని నిలదీశారు. మెడపై తలకాయ ఉన్నవాడు ఎవడైనా ఇలా మాట్లాడతాడా అంటూ ఫైర్ అయ్యారు. తమ తప్పు లేదని చెప్పుకోవచ్చు కానీ.. ఇంత దారుణంగా మాట్లాడాతారా అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
అసలు నటించేది ఎవరో అందరికీ తెలుసన్నారు. నటించడం చంద్రబాబుకు బాగా అలవాటని చెప్పారు. జనం ఉమ్మేస్తారని కూడా వాళ్లకు తెలియదా అని ప్రశ్నించారు. చంద్రబాబు మీద అలిపిరిలో దాడి జరిగితే ఎవరూ ఎగతాళి చేయలేదన్నారు. ఆయన ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. జగన్ బస్సు యాత్రకు ఆదరణ వస్తున్న సమయంలో దాడి జరగడం గమనార్హమన్నారు. ఇది పక్కా హత్యాయత్నమని చెప్పారు. ఓటమి ఖాయమైపోవడంతోనే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. జగన్ జనంలోకి రావొద్దనే ఆలోచనతోనే ఇలా చేశారన్నారు. ద్వేషం పెంచడం, రెచ్చగొట్టడం, అలజడి సృష్టించడం ద్వారా లాభం పొందాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. సోమవారం నుంచి జగన్ బస్సుయాత్ర యధావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. సానుభూతితో ఓట్లు తెచ్చుకోవాలన్న ఆలోచన తమకు లేదని చెప్పారు.