Shiva Balakrishna | హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ (Shiva Balakrishna) అక్రమాస్తులపై ఏసీబీ అధికారులు(ACB officials) లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ : హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ (Shiva Balakrishna) అక్రమాస్తులపై ఏసీబీ అధికారులు(ACB officials) లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కస్టడీ విచారణ సమయంలో శివ బాలకృష్ణ సీనియర్ ఐఏఎస్ అధికారి పేరు చెప్పారు. ఐఏఎస్ అధికారి సూచనల మేరకు పాలనా పరమైన అనుమతులు జారీ చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించాడు. ఇదే విషయాన్ని కస్టడీ సమయంలో శివ బాలకృష్ణ తెలిపారు.
ఈ నేపథ్యంలో సదరు ఐఏఎస్ అధికారిని విచారించేందుకు సిద్ధమైంది. న్యాయ సలహా తీసుకొని నోటీసులు జారీ చేసేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ కేసును ప్రాసిక్యూషన్ చేసేందుకు అధికారులు ప్రభుత్వ అనుమతి తీసుకోనున్నారు. కాగా, అధికారాన్ని ఉపయోగించుకుని భారీగా అక్రమాస్తులను కూడబెట్టిన శివబాలకృష్ణను ఏసీబీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
8 రోజుల కస్టడీలో చేపట్టిన విచారణలో రూ.250 కోట్ల అక్రమాస్తులను గుర్తించారు. శివబాలకృష్ణ బంధువుల పేరిట 214 ఎకరరాల వ్యవసాయ భూములు రిజిస్టర్ అయినట్టు తేలిందని అధికారులు తెలిపారు. జనగామ జిల్లాలో 102, యాదాద్రి భువనగిరి జిల్లాలో 66, నాగర్‌కర్నూల్ జిల్లాలో 38, సిద్దిపేటలో 7 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు వెల్లడించారు.
తెలంగాణలో 29, ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం, విశాఖపట్నంలో 3 ఓపెన్ ప్లాట్లతోపాటు రూ.30.3 కోట్ల విలువైన 7 ఫ్లాట్లు, 3 విల్లాలను గుర్తించినట్టు తెలిపారు. బ్యాంకు లాకర్లో ఉన్న 18 తులాల బంగారం, ఓ పాస్‌బుక్‌ను జప్తు చేశామన్నారు. శివబాలకృష్ణ సోదరుడు శివనవీన్‌కుమార్ అరెస్టుతో మరో నలుగురు బినామీలను గుర్తించినట్టు చెప్పారు. శివనవీన్‌కుమార్ భార్య పేరిట ఉన్న ఆస్తులపై కూడా దర్యాప్తు జరుపుతున్నట్టు తెలిపారు. శివబాలకృష్ణ అక్రమాల వెనుక హెచ్ఎమ్డీఏ, మెట్రోరైల్ అధికారుల పాత్రపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.
