బడా షేర్ల కంటే చోటా షేర్లు ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) మదుపరులకు ఎక్కువ లాభాలను తెచ్చిపెట్టాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్‌ఈ) స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ షేర్లు దాదాపు 62 శాతం వృద్ధిని ప్రదర్శించాయని తేలింది.
- లార్జ్‌క్యాప్ షేర్ల కంటే మదుపరులకు భారీ లాభాలు
- పెట్టుబడులకు క్యూ కట్టిన రిటైల్ ఇన్వెస్టర్లు
Stock Market | న్యూఢిల్లీ, మార్చి 29: బడా షేర్ల కంటే చోటా షేర్లు ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) మదుపరులకు ఎక్కువ లాభాలను తెచ్చిపెట్టాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్‌ఈ) స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ షేర్లు దాదాపు 62 శాతం వృద్ధిని ప్రదర్శించాయని తేలింది. ప్రధానంగా ఆయా కార్పొరేట్ సంస్థల త్రైమాసిక ఆర్థిక ఫలితాలు బాగుండటంతోనే ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున పెట్టుబడులకు ముందుకొచ్చారని ఈ ట్రెండ్‌ను నిపుణులు విశ్లేషిస్తున్నారు. స్మాల్‌క్యాప్ స్టాక్స్‌పై రిటైల్ ఇన్వెస్టర్లు ఆసక్తి కనబర్చి ఆకర్షణీయ స్థాయిలోనే లాభాలను అందుకోగలిగారని అంటున్నారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ల్లోనూ నికర పెట్టుబడుల రాక లార్జ్‌క్యాప్ కంటే మిడ్, స్మాల్‌క్యాప్ షేర్లలోనే ఎక్కువగా ఉన్నట్టు గుర్తుచేస్తున్నారు.
కొత్త ఏడాదిలోనూ..
వచ్చే కొత్త ఆర్థిక సంవత్సరం (2024-25)లోనూ స్మాల్, మిడ్‌క్యాప్ సూచీలు జోరు ను ప్రదర్శిస్తాయని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్ ఎండీ సునీల్ న్యాతీ అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్రంలో మరోసారి ఈ ప్రభుత్వమే అధికారంలోకి వస్తే మార్కెట్లు మరింత దూకుడు మీదుండగలవన్నారు. కాగా, వడ్డీరేట్ల పెరుగుదల, అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు, లాభాల స్వీకరణ అంశాలు.. మార్కెట్లను ఒడుదొడుకులకు లోను చేయవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
రూ.3.4 లక్షల కోట్లు రాక
విదేశీ మదుపరులు భారతీయ మార్కెట్లపై ఈ ఆర్థిక సంవత్సరం అమితాసక్తినే కనబర్చారు. దేశీయ క్యాపిటల్ మార్కెట్లలోకి విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపరులు (ఎఫ్‌పీఐ) తెచ్చిన పెట్టుబడులు దాదాపు రూ.3.4 లక్షల కోట్లుగా ఉన్నాయి మరి. ఈ 2023-24లో స్టాక్ మార్కెట్లలోకి సుమారు రూ.2.08 లక్షల కోట్ల పెట్టుబడుల్ని తీసుకొచ్చిన ఎఫ్‌పీఐలు.. రుణ మార్కెట్లలోకి మరో రూ.1.3 లక్షల కోట్ల పెట్టుబడుల్ని పట్టుకొచ్చారు. నిజానికి అంతకుముందు రెండు ఆర్థిక సంవత్సరాల్లోనూ పెట్టుబడుల ఉపసంహరణకే మదుపరులు పెద్దపీట వేశారు. అంతర్జాతీయంగా కేంద్ర బ్యాంకులన్నీ వడ్డీరేట్లను భారీ ఎత్తున పెంచడంతో దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి 2021-22లో రూ.1.4 లక్షల కోట్లు, 2022-23లో రూ.37,632 కోట్లు తరలిపోయాయి. అయితే 2020-21లో మాత్రం రికార్డు స్థాయిలో రూ.2.74 లక్షల కోట్ల పెట్టుబడులను తెచ్చారు. మళ్లీ ఆ తర్వాత ఈ ఆర్థిక సంవత్సరంలోనే పెట్టుబడులకు ఎఫ్‌పీఐలు ముందుకొచ్చారు. ఇక గత ఆర్థిక సంవత్సరం (2022-23) భారతీయ రుణ మార్కెట్ల నుంచి రూ.8,938 కోట్ల పెట్టుబడుల్ని ఎఫ్‌పీఐలు వెనక్కి తీసుకున్నారు.
ఈ ఆర్థిక సంవత్సరం విశేషాలు
- 15,013.95 పాయింట్లు లేదా 62.38 శాతం ఎగిసిన బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ సూచీ
- 16,068.99 పాయింట్లు లేదా 59.60 శాతం ఎగబాకిన స్మాల్‌క్యాప్ ఇండెక్స్
- 14,659.83 పాయింట్లు లేదా 24.85 శాతం పుంజుకున్న లార్జ్‌క్యాప్ సూచీ సెన్సెక్స్
- ఫిబ్రవరి 8న మునుపెన్నడూ లేనివిధంగా 40,282.49 పాయింట్ల స్థాయిని తాకిన మిడ్‌క్యాప్. నిరుడు మార్చి 31న 52 వారాల కనిష్ఠాన్ని తాకుతూ 23,881.79 పాయింట్ల వద్దకు
- ఫిబ్రవరి 7న ఆల్‌టైమ్ హైని చేరుతూ 46,821.39 పాయింట్ల వద్ద స్మాల్‌క్యాప్. గత ఏడాది మార్చి 31న 52 వారాల కనిష్ఠ స్థాయిని సూచిస్తూ 26,692.09 వద్దకు
