Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) దుమ్మురేపాయి. బుల్న్‌త్రో సూచీలు సరికొత్త శిఖరాలను అధిరోహించగా, మదుపరుల సంపద లక్షల కోట్ల రూపాయల్లో ఎగబాకింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ట్రేడింగ్‌కు చివరిరోజైన గురువారం కూడా మార్కెట్లు పరుగులు పెట్టాయి. దీంతో ఘనంగా వీడ్కోలు పలికినైట్టెంది.
- ఘనంగా వీడ్కోలు పలికిన సూచీలు
- ఆల్‌టైమ్ హై రికార్డులతో మోత
- లక్షల కోట్లలో పుంజుకున్న మదుపరుల సంపద
Stock Market | ముంబై, మార్చి 28: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) దుమ్మురేపాయి. బుల్న్‌త్రో సూచీలు సరికొత్త శిఖరాలను అధిరోహించగా, మదుపరుల సంపద లక్షల కోట్ల రూపాయల్లో ఎగబాకింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ట్రేడింగ్‌కు చివరిరోజైన గురువారం కూడా మార్కెట్లు పరుగులు పెట్టాయి. దీంతో ఘనంగా వీడ్కోలు పలికినైట్టెంది. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 655.04 పాయింట్లు లేదా 0.90 శాతం పెరిగి 73,651.35 వద్ద నిలిచింది. ఒకానొక దశలో 1,194 పాయింట్లు పెరగడం విశేషం. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ కూడా 203.25 పాయింట్లు లేదా 0.92 శాతం ఎగిసి 22,326.90 వద్ద స్థిరపడింది. ఈ వారం మొత్తంగా సెన్సెక్స్ 819.41 పాయింట్లు లేదా 1.12 శాతం, నిఫ్టీ 230.15 పాయింట్లు లేదా 1.04 శాతం అందిపుచ్చుకున్నాయి.
కొనుగోళ్ల ఉత్సాహం
మదుపరులలో కొనుగోళ్ల ఉత్సాహం తొణికిసలాడింది. పవర్, క్యాపిటల్ గూడ్స్, యుటిలిటీస్, ఆటో, హెల్త్‌కేర్, ఇండస్ట్రియల్స్, కమాడిటీస్, టెలీకమ్యూనికేషన్స్, మెటల్ షేర్లు ఆకట్టుకోవడంతో వరుసగా రెండోరోజూ సూచీలు లాభాల్లోనే ముగిశాయి. గ్లోబల్ స్టాక్ మార్కెట్లలో బుల్లీష్ ట్రెండ్ కూడా కలిసొచ్చినట్టు మార్కెట్ నిపుణులు ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. ఇక సెన్సెక్స్ షేర్లలో బజాజ్ ఫిన్సర్వ్ దాదాపు 4 శాతం లాభపడింది. నెస్లే, ఎస్బీఐ, పవర్‌గ్రిడ్, టాటా స్టీల్, ఎల్అండ్టీ, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లూ పుంజుకున్నాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ సూచీ 0.62 శాతం, స్మాల్‌క్యాప్ సూచీ 0.33 శాతం ఎగిశాయి. ఆసియా మార్కెట్లలో చైనా, హాంకాంగ్ లాభాల్లో ఉంటే, జపాన్, దక్షిణ కొరియా నష్టపోయాయి.
రూ.386 లక్షల కోట్లకు..
బీఎస్ఈ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన మదుపరుల సంపద ఈ ఆర్థిక సంవత్సరం రూ.1,28,77,203.77 కోట్లు ఎగిసి రూ.3,86,97,099.77 కోట్లను చేరింది. గత ఆర్థిక సంవత్సరం (2022-23) రూ. 5,86,605.38 కోట్లే పెరిగింది. గత ఏడాది మార్చి 31న బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ రూ.2,58,19,896 కోట్లుగానే ఉన్నది. 2022-23లో సెన్సెక్స్ కేవలం 423.01 పాయింట్లు లేదా 0.72 శాతమే పెరిగింది. అయితే అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2021-22)లో రూ.59.75 లక్షల కోట్లకుపైగా పుంజుకున్నది.
ఈ ఆర్థిక సంవత్సరం విశేషాలు
- 14,659.83 పాయింట్లు లేదా 24.85 శాతం ఎగిసిన సెన్సెక్స్
- 4,967.15 పాయింట్లు లేదా 28.61 శాతం ఎగబాకిన నిఫ్టీ
- రూ.1,28,77,203.77 కోట్లు పుంజుకున్న మదుపరుల సంపద
- మార్చి 7న మునుపెన్నడూ లేనివిధంగా 74,119.39 పాయింట్ల ఆల్‌టైమ్ హైని తాకిన సెన్సెక్స్. 22,493.55 పాయింట్ల లైఫ్‌టైమ్‌కు చేరిన నిఫ్టీ
- ఇంట్రా-డేలో సెన్సెక్స్ 74,245.17 పాయింట్ల రికార్డు. నిఫ్టీ సైతం 22,525.65 పాయింట్ల గరిష్ఠానికి చేరిక
- మార్చి 2న బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ రికార్డు స్థాయిలో రూ.394 లక్షల కోట్లకు
మార్కెట్ విలువలో టాప్-5 సంస్థలు (రూ.కోట్లలో)
రిలయన్స్ 20,14,010.63
టీసీఎస్ 14,05,102.38
హెచ్డీఎఫ్సీ 11,00,184.60
ఐసీఐసీఐ 7,69,472.43
భారతీ ఎయిర్టెల్ 6,99,081.86
