దైనందిన జీవితంలోని దాదాపు అన్ని అంశాలూ టెక్నాలజీని అందిపుచ్చుకున్నట్టే.. జర్నలిజం కూడా అత్యంత వేగంగా డిజిటలైజ్ అవుతున్నది. నెట్వర్క్ జనరేషన్ మారేకొద్దీ.. న్యూస్ జనరేషన్‌కు మిల్లీసెకండ్ల సమయం కూడా ఎక్కువే అనిపి స్తున్నది.
దైనందిన జీవితంలోని దాదాపు అన్ని అంశాలూ టెక్నాలజీని అందిపుచ్చుకున్నట్టే.. జర్నలిజం కూడా అత్యంత వేగంగా డిజిటలైజ్ అవుతున్నది. నెట్వర్క్ జనరేషన్ మారేకొద్దీ.. న్యూస్ జనరేషన్‌కు మిల్లీసెకండ్ల సమయం కూడా ఎక్కువే అనిపి స్తున్నది. ఢిల్లీ ముచ్చట మరుక్షణం గల్లీలో వైరల్ అవుతున్నదంటే.. జర్నలిజంలో టెక్నాలజీ పాత్ర ఎంత పెరిగిందో ఊహించుకోవచ్చు. అయితే, ఈ సాంకేతిక యుగంలో వేలం వెర్రిగా పుట్టుకొస్తున్న డిజిటల్, సోషల్ మీడియా చానెళ్లు జర్నలిజం విలువలను హ్యాక్ చేసి పబ్బం గడుపు కొంటున్నాయన్న విమర్శలూ వినిపిస్తున్నాయి.
Tek Talk | పాత్రికేయ వృత్తి ఒకప్పటిలా ఇప్పుడు సంక్లిష్టంగా లేదు. వార్త సేకరణ, ప్రసారం వరకు అడుగడుగునా డిజిటల్ ఇంటెలిజెన్స్ అండగా నిలుస్తున్నది. సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటల్ మీడియా ప్లాట్‌ఫాంలు రాజ్యమేలుతున్నాయి. సంప్రదాయ ప్రసార మాధ్యమాలను తోసిరాజని వీటి హవా నడుస్తున్నది. చేతిలో ఫోన్, ఫోన్లో యూట్యూబ్ అకౌంట్ ఉంటే చాలు.. వాక్చాతుర్యం ఉన్న ప్రతి వ్యక్తీ మీడియా అధినేతగా మారిపోతున్నాడు. కానీ, ఈ డిజిటల్ ప్రవాహంలో నికార్సైన నిజాలు.. అబద్ధాలైపోతున్నాయి, అచ్చమైన అబద్ధాలు.. పచ్చి నిజాలుగా చెలామణీ అవుతున్నాయి. అయితే, డిజిటల్ ఇంటెలిజెన్స్‌ను సక్రమంగా వినియోగించుకుంటే సరైన సమాచారాన్ని ప్రజలకు త్వరగా, మరింత కచ్చితత్వంతో అందించే అవకాశాలు ఉన్నాయి.
డిజిటల్ ఇంటెలిజెన్స్‌తో..
- అందుబాటులో ఉన్న ఆన్లైన్ డాటాబేస్, సెర్చ్ ఇంజిన్ల సాయంతో వార్తకు అదనపు సమాచారాన్ని జోడించవచ్చు. ఒక సంఘటన పూర్వాపరాలను మరింత విశ్లేషించవచ్చు.
- డాటా విశ్లేషణకు డిజిటల్ ఇంటెలిజెన్స్ చక్కని మార్గం. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న ట్రెండ్స్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. వాటికి అనుగుణంగా వార్తలు ప్రసారం చేయొచ్చు. విజువలైజేషన్ టూల్స్, స్టాటిస్టికల్ అనాలిసిస్ సాఫ్ట్వేర్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సాయంతో వార్తలను మరింత ఆకర్షణీయంగా పాఠకులకు, వీక్షకులకు అందించవచ్చు.
- సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న విషయాల ఆధారంగా న్యూస్ జనరేషన్‌కు డిజిటల్ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుంది. పాఠకులు, వీక్షకుల అవసరాలు, ఆసక్తులకు అనుగుణంగా కంటెంట్ రూపొందించి జర్నలిస్ట్‌గా మీ మైలేజ్‌ను పెంచు
కోవచ్చు. - ఫేక్ న్యూస్ కట్టడికి కూడా డిజిటల్ ఇంటెలిజెన్స్ సహాయకారిగా పనిచేస్తుంది. నిజ నిర్ధారణ, రివర్స్ ఇమేజ్ సెర్చ్, డిజిటల్ ఫోరెన్సిక్ లాంటి టూల్స్‌ను ఉపయోగించి విశ్వసనీయత పెంచుకోవచ్చు.
ఇలా చేయండి.. - మీడియా ప్రపంచంలో ఇప్పుడు డిజిటల్ జర్నలిస్ట్‌లకు ప్రాధాన్యం పెరిగింది. వీడియో క్రియేషన్, ఎడిటింగ్, పోడ్కాస్ట్, ఇన్ఫోగ్రాఫిక్స్ చేయడంలో పట్టున్న వాళ్లకు డిజిటల్ దునియాలో తిరుగులేదు. మీరు అనుకున్న కంటెంట్‌ను మల్టీమీడియా సాయంతో విజువల్ వండర్‌గా చూపించగలిగితే గంటల్లోనే వైరల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
- వీడియో అప్లోడ్ చేసి వదిలేయకుండా.. వీక్షకుల కామెంట్స్‌పై దృష్టిసారించాలి. అందులోని సలహాలు తీసుకోవాలి. సద్విమర్శలకు సహేతుకమైన సమాధానం ఇవ్వాలి.
- మీరు అందించే వాటిలో తప్పుడు సమాచారం ఉండకుండా చూసుకోవాలి. ఒకటికి రెండుసార్లు నిజాన్ని నిర్ధారణ చేసుకున్న తర్వాతే ఆ వార్తకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి.
- మీ డిజిటల్ మీడియా ప్లాట్‌ఫాం ప్రత్యేకంగా ఉండేలా చూసుకోవాలి. ఎవరినీ కాపీ చేసినట్టుగా ఉండొద్దు. నాకు తెలిసిందే వేదం అన్నట్టుగా భావించొద్దు. నిత్య విద్యార్థిగా ఉన్నప్పుడే ఈ ఫీల్డ్‌లో విజయం సాధించగలం.
- లైకుల కోసం, షేర్ల కోసం నాసిరకం వార్తలను ప్రసారం చేయొద్దు. సున్నితమైన అంశాల జోలికి వెళ్లకపోవడమే మంచిది.
ఈ టూల్స్ మీ కోసం..
- ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ టూల్స్ ద్వారా సమాచారాన్ని సేకరించొచ్చు. సదరు సమాచారాన్ని విశ్లేషించొచ్చు. సోర్స్ తెలుసుకోవచ్చు. ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ టూల్స్‌లో కొన్ని..
- మాల్టెగో: సమాచారాన్ని సేకరించడానికి, దానిని విజువలైజ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. (https://www.maltego.com)
- డాటారాపర్: దీని సాయంతో ఆకర్షణీయమైన చార్ట్‌లు, గ్రాఫ్‌లు, మ్యాప్‌లు రూపొందించొచ్చు. (https://www.datawrapper.de)
- వెబ్ప్లాట్: గ్రాఫికల్ డాటాను సేకరించడానికి ఇది ఉపయోగపడుతుంది. విజువల్ సమాచారాన్ని అంకెల్లో మార్చడం ద్వారా తర్వాతి పరిశీలన సులభమవుతుంది. (https://automeris.io/WebPlotDigitizer/)
- తబులా: దీని ద్వారా పీడీఎఫ్ ఫైల్స్ నుంచి డాటాను టెక్ట్స్ రూపంలో తీసుకోవచ్చు. (https://tabula.technology)
- అపాచీ టికా: ఇదొక కంటెంట్ అనాలసిస్ టూల్‌కిట్. దీని సాయంతో పీడీఎఫ్ ఫైల్స్, ఇమేజ్‌లు, వర్డ్ డాక్యుమెంట్స్ నుంచి టెక్ట్స్‌తోపాటు మెటాడాటాను సేకరించొచ్చు. (https://tika.apache.org)
- ఇన్విడ్: దీంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలు ఎంతవరకు సరైనవో వెరిఫై చేయొచ్చు. (https://www.invid-project.eu)
- సెన్సిటీ: సామాజిక మాధ్యమాల్లో ఉండే డీప్‌ఫేక్ వీడియోలు, ఫొటోలను వెరిఫై చేయొచ్చు. (https://platform.sensity.ai/
deepfake-detection) - ఎస్సెమ్మెస్ హెడర్: దీంతో ఎస్సెమ్మెస్ సోర్స్ వెరిఫికేషన్ చేయొచ్చు. (https://smsheader.trai.gov.in/)
- ఇ-మెయిల్ హెడర్ అనలైజర్: అనుమానాస్పద ఇ-మెయిల్స్ గుట్టుతెలుసుకోవచ్చు. (https://mxtoolbox.com/ EmailHeaders.aspx)
– అనిల్ రాచమల్ల వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్
