బెంగళూరు బొద్దుగుమ్మ.. వర్ష బొల్లమ్మ! కోలీవుడ్ ద్వారా చిత్రసీమలో అడుగుపెట్టింది. అగ్రనటులు ‘విజయ్’ ద్వయంతో నటించే చాన్స్ కొట్టేసి.. ‘96’, ‘బిగిల్’ విజయాల్లో పాలుపంచుకున్నది. టాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చి.. ‘చూసీ చూడంగానే’ తెలుగువారికీ నచ్చేసింది.
Varsha Bollamma | బెంగళూరు బొద్దుగుమ్మ.. వర్ష బొల్లమ్మ! కోలీవుడ్ ద్వారా చిత్రసీమలో అడుగుపెట్టింది. అగ్రనటులు ‘విజయ్’ ద్వయంతో నటించే చాన్స్ కొట్టేసి.. ‘96’, ‘బిగిల్’ విజయాల్లో పాలుపంచుకున్నది. టాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చి.. ‘చూసీ చూడంగానే’ తెలుగువారికీ నచ్చేసింది. ఆ తర్వాత ‘మిడిల్‌క్లాస్ మెలోడీస్’తో.. ఫస్ట్‌క్లాస్ హీరోయిన్‌గా మారిపోయింది. తాజాగా ‘ఊరిపేరు భైరవకోన’ ద్వారా.. హైదరాబాద్‌ను సొంతూరుగా మార్చుకున్నది. ‘మెలోడీ’ గీతాలంటే ఇష్టమంటున్న ఆ కోకిలమ్మతో.. మాటాముచ్చట!
- మా కుటుంబానికి ఎలాంటి సినిమా నేపథ్యం లేదు. అయినా, నాకు చిన్నప్పటి నుంచే ఈ రంగంలోకి రావాలనే ఆసక్తి ఉండేది. ఈ మాట ఇంట్లో చెప్పగానే అమ్మానాన్న కూడా సపోర్ట్ చేశారు. నేను ఈ స్థాయికి రావడం వెనక వాళ్ల ప్రోత్సాహం ఎంతో ఉంది.
- చిన్నప్పటి నుంచీ సీనియర్ నటి రేవతి అంటే ఇష్టం. ఏ పాత్ర అయినా.. చాలా అద్భుతంగా పండిస్తారు. ఇప్పటివారిలో అపర్ణా బాలమురళి, పార్వతీ మేనన్ నటన నచ్చుతుంది.
- నేను చేసే ప్రతి సినిమా నుంచీ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటా. దాన్ని తదుపరి సినిమాలో ఇంప్లిమెంట్ చేస్తా.
- సైకో పాత్ర చేయాలనేది నా డ్రీమ్. రామ్‌గోపాల్ వర్మ ‘కౌన్’లో ఊర్మిళ పాత్రలాంటిది ఎప్పటికైనా చేస్తాననే నమ్మకం ఉంది.
- నేను పుట్టింది పర్యాటక ప్రాంతం కూర్గ్‌లో. అక్కడికి ఎప్పుడు వెళ్లినా.. మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఏదో తెలియని మధురానుభూతి కలుగుతుంది. అందుకే, సంవత్సరంలో కనీసం ఓ పదిసార్లయినా.. కూర్గ్ వెళ్లొస్తుంటా.
- ప్రస్తుతం తెలుగుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లో నటిస్తున్నా. అన్ని భాషల ప్రేక్షకులూ నన్ను అభిమానిస్తున్నారు. తమ ఇంటి మనిషిగా భావిస్తున్నారు. ప్రేమిస్తున్నారు. అయితే, భాష తెలియకుంటే, ముఖంలో భావాన్ని పలికించలేమన్నది
నా అభిప్రాయం. - ‘96’లో చిన్న క్యారెక్టరే అయినా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ‘బిగిల్’తో ఇండస్ట్రీలో నా స్థానం సుస్థిరమైంది. ‘మిడిల్‌క్లాస్ మెలోడీస్’తో తెలుగువారికి మరింత దగ్గరయ్యా.
- హైదరాబాదీ బిర్యానీ ఇష్టంగా తినేదాన్ని. కానీ, ఈ మధ్య నాన్‌వెజ్ మానేశాను. ప్రమాదంలో గాయపడ్డ ఓ కుక్కపిల్లను కాపాడి, ఇంటికి తెచ్చుకున్నాను. దాన్ని నేనే పెంచుకుంటున్నా. ఎందుకో.. ఆ క్షణంలోనే నాన్‌వెజ్ తినొద్దని డిసైడ్ అయ్యాను!
- రొమాంటిక్ కామెడీ, హారర్ జానర్ ఇష్టం. ఈ మూడూ కలగలిసిన చిత్రం.. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా!’. ఇది నాకు బాగానచ్చిన
సినిమా. - చాలా ఇష్టంతో సినిమా రంగంలోకి వచ్చాను. అయితే, ఇష్టంలేని పాత్రలను మాత్రం చేయను. సినిమాలో నా పాత్ర నాకు నచ్చకుంటే.. ఎంత పెద్ద ప్రాజెక్టు అయినా ఒప్పుకోను.
- నేను పాజిటివ్ పర్సన్‌ను. నెగెటివిటీ అంటే అస్సలు నచ్చదు. అది ఇండస్ట్రీలో అయినా.. మరెక్కడైనా!
