ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో కొలువుల కోత కొనసాగుతున్నది. దిగ్గజ కంపెనీలను మొదలుకొని స్టార్టప్‌ల వరకూ భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. గత ఏడాది ఏకంగా 2.5 లక్షల మందికి ఉద్వాసన పలుకగా, ఈ ఏడాది తొలి మూడు నెలల్లోనే ఏకంగా 50 వేల మందిని ఇంటికి సాగనంపాయి. ల్యాప్‌ట్యాప్ తయారీ సంస్థ డెల్ రెండేండ్ల వ్యవధిలో రెండోసారి లేఆఫ్ ప్రకటించింది.

- నిరుడు 2.5 లక్షల మందికి ఉద్వాసన
- బైజూస్‌లో తాజాగా 500 మందిపై వేటు!
Layoffs | న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో కొలువుల కోత కొనసాగుతున్నది. దిగ్గజ కంపెనీలను మొదలుకొని స్టార్టప్‌ల వరకూ భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. గత ఏడాది ఏకంగా 2.5 లక్షల మందికి ఉద్వాసన పలుకగా, ఈ ఏడాది తొలి మూడు నెలల్లోనే ఏకంగా 50 వేల మందిని ఇంటికి సాగనంపాయి. ల్యాప్‌ట్యాప్ తయారీ సంస్థ డెల్ రెండేండ్ల వ్యవధిలో రెండోసారి లేఆఫ్ ప్రకటించింది. సుమారు 6 వేల మందిని కొలువుల నుంచి తొలగించింది. టెలికం దిగ్గజం వొడాఫోన్ జర్మనీలోని తమ కార్యాలయాల్లో 2 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా, మొబైల్ నెట్వర్క్స్ మార్కెట్ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎరిక్సన్ కంపెనీ గత నెలలో స్వీడన్లో 1200 మంది ఉద్యోగులను ఇంటికి పంపించేసింది. కెనడా టెలికం దిగ్గజం బెల్ దాదాపు 5 వేల మంది వర్కర్లను తొలగించగా, ఫేస్బుక్ మెసెంజర్ రెండు డజన్ల మంది ఉద్యోగుల సేవలకు స్వస్తి చెప్పింది. ఇక బెంగళూరు కేంద్రంగా పనిచేసే వర్చువల్ ఈవెంట్ ప్లాట్‌ఫామ్ కంపెనీ ఎయిర్‌మీట్ తన వర్క్ ఫోర్స్‌లో 20 శాతం మందిని తగ్గించుకొంది.
బైజూస్‌లో 500 మందిపై వేటు!
సేల్స్ తదితర విభాగాల్లో ఎడ్టెక్ దిగ్గజం బైజూస్ తాజాగా 500 మంది ఉద్యోగులపై వేటు వేయనున్నట్లు సమాచారం. దీనిపై ఆ కంపెనీ అధికారిక ప్రకటన చేయకపోయినా.. తొలగిస్తున్న ఉద్యోగులకు ఈ విషయాన్ని ఫోన్ ద్వారా చెప్తున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న బైజూస్ తన ఖర్చులను, వ్యాపారాన్ని క్రమబద్దీకరించే పనిలో ఉంది. తాజాగా తొలగిస్తున్న ఉద్యోగుల ప్రభావం సేల్స్ విధులపైనా, టీచర్లపైనా, ట్యూషన్ సెంటర్లపైనా పడనుంది.