శరీరంలో ద్రవాల స్థాయిని నియంత్రణలో ఉంచేందుకు, ఎలక్ట్రోలైట్లను సమతౌల్యం చేసేందుకు కొబ్బరి నీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. సోడియం, పొటాషియం, మాంగనీసులాంటివి ఇందులో ఎక్కువగా ఉంటాయి. వడదెబ్బకు, డయేరియాకు కొబ్బరినీళ్లు మంచి మందు.
ఎండాకాలం దాహం కోసమో, ఆరోగ్యానికి మంచిదనో కొబ్బరి నీళ్లు తాగుతుంటాం. అయితే ఇటీవల బోండాలతోపాటు బాటిళ్లలోనూ కొబ్బరి నీళ్లను అమ్ముతున్నారు. ఇలా ఒకేసారి లీటరు కొబ్బరి నీళ్లు తాగొచ్చా? దీనివల్ల కిడ్నీల మీద ఏమైనా భారం పడుతుందా! అసలు ఒక రోజులో, లేదా వారంలో ఎన్ని కొబ్బరి నీళ్లు తాగొచ్చు తెలియజేయండి?
- ఓ పాఠకురాలు
శరీరంలో ద్రవాల స్థాయిని నియంత్రణలో ఉంచేందుకు, ఎలక్ట్రోలైట్లను సమతౌల్యం చేసేందుకు కొబ్బరి నీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. సోడియం, పొటాషియం, మాంగనీసులాంటివి ఇందులో ఎక్కువగా ఉంటాయి. వడదెబ్బకు, డయేరియాకు కొబ్బరినీళ్లు మంచి మందు. పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి గుండె జబ్బులు, బీపీ ఉన్నవాళ్లకు మంచిది. ఇందులో ఉండే మీడియం చెయిన్ ట్రై గ్లిజరైడ్లు చర్మానికి, జుట్టుకి మేలు చేస్తాయి. జీర్ణశక్తికి కూడా ఉపయోగపడతాయి.
పొటాషియం శరీరంలోని విషతుల్యాలను బయటికి నెట్టేసేందుకు ఉపయోగపడుతుంది. కాబట్టి కిడ్నీలకు కూడా మంచివి. అంతేకాదు కొబ్బరినీళ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థకు మేలు చేస్తుంది. ఇందులో విటమిన్లు, మినరళ్లు పోను 95 శాతం మంచి నీళ్లే ఉంటాయి. 20-40 ఏండ్ల మధ్య వయసున్న వాళ్లు రోజుకు లీటరు కొబ్బరినీళ్లు తాగొచ్చు. యాభై ఏండ్లు పైబడిన వాళ్లు ఏ ఇతర ఆరోగ్య సమస్యలు లేకపోతే చక్కగా వీటిని తాగొచ్చు. అయితే డయాబెటిస్ ఉన్న వాళ్లు మాత్రం రక్తంలోని గ్లూకోజ్ స్థాయులను బట్టి తీసుకోవాలి. కాబట్టి, న్యూట్రీషనిస్టులను సంప్రదించి దానికి తగ్గట్టు తీసుకోవడం మంచిది.
– మయూరి ఆవుల న్యూట్రిషనిస్ట్
Mayuri.trudiet@ gmail.com