
- దేశంలోనే అతిపెద్ద వేరుశనగ మార్కెట్ వనపర్తి
- వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
వనపర్తి, డిసెంబర్ 18: రాష్ట్రంలో సాగునీటి రాకతో తెలంగాణ సస్యశ్యామలమైందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎనిమిదేళ్లలో రాష్ట్రం మరో పది లక్షల ఎకరాల సాగు భూమిని చేర్చిందని చెప్పారు. ఆదివారం వనపర్తి ఉత్పత్తుల మార్కెట్లో నూతన పాలకవర్గం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద మార్కెట్‌గా వనపర్తి వేరుశనగ మార్కెట్ గుర్తింపు పొందిందన్నారు. ఇక్కడి బడ్స్‌కు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని చెప్పారు. సాగునీటి రాకతో ఏటా లక్ష ఎకరాల్లో వేరుశనగ సాగవుతుందని పేర్కొన్నారు. వనపర్తి మార్కెట్ రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలని సూచించారు. సంక్షేమ కార్యక్రమాలతో రైతులకు వ్యవసాయంపై నమ్మకం ఉందన్నారు. వ్యవసాయ రంగాన్ని ఆదుకుంటున్నది సీఎం కేసీఆర్ ఒక్కరేనన్నారు. విపరీతంగా పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. దేశంలో రైతులను ఆదుకునే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కేసీఆర్ బీఆర్ఎస్ను ఏర్పాటు చేశారన్నారు.