గజ్వేల్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ కార్యకర్తల గురించి ఎంత చెప్పినా తక్కువే.. మూడు సార్లు ఈ గడ్డ నుండి కేసీఆర్‌ను గెలిపించారు. ఈ నియోజకవర్గం కార్యకర్తల రుణం తీర్చుకోలేనిది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. సమస్యలపైన, పరిపాలన మీద పట్టు ఉన్న వ్యక్తి వెంకట్రామిరెడ్డిని గెలిపించాలి. దుబ్బాకలో పనికి రాని రఘునందన్ ఇప్పుడు మెదక్ పార్లమెంట్‌కు పనికి వస్తాడా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
మెదక్ పార్లమెంట్ పరిధిలోని గజ్వేల్ నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. రూ. 100 కోట్లతో ట్రస్టు ఏర్పాటు చేసి మన పిల్లల భవిష్యత్తు కోసం ఖర్చు చేసేందుకు ముందుకు వచ్చిన మంచి మనసున్న మనిషి మన వెంకట్రామిరెడ్డి. ఎంతో మంది అనాథ బిడ్డల్ని అక్కున చేర్చుకున్న గొప్ప వ్యక్తి. కలెక్టర్‌గా తన పాలన మార్కుతో ఎన్నో అవార్డుల్ని ఈ గడ్డకు తెచ్చిన వ్యక్తి వెంకట్రామిరెడ్డి. గజ్వేల్ గడ్డ మీద ఈర్ష్య పెట్టుకున్న ఈ కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఓటు ఎందుకు వేయాలి? గజ్వేల్ నియోజకవర్గ బిడ్డల నోట్లో మట్టి కొట్టిన ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు ఉందా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదు. 100 రోజుల కాంగ్రెస్ పార్టీ బాండ్ పేపర్ పాలనలో ఉద్దరించుడు మాట దేవుడెరుగు కానీ, అన్నీ ఉద్దెర మాటలే చెప్తున్నారు. రూ. 2 లక్షల రుణమాఫీ అయితే కాంగ్రెస్‌కు ఓటెయ్యండి. కాకపోతే కారుకు ఓటు వేయండి. యాసంగి వడ్లకు, మక్కలకు 500 బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతదని మనం ప్రతీ ఊర్ల పంచాయితీ పెట్టాలి. మన అక్కలకు, చెల్లెలకు ప్రతి నెల రూ. 2,500లు డిసెంబర్ నెల నుండి ఇస్తా అన్న మొట్ట మొదటి హామీని అమలు చేయకుండా మహా మోసం చేసిన పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ. రూ. 200 ఉన్న పెన్షన్‌ను రూ. 2000 చేసిన ఘనత మన కేసీఆర్‌ది అయితే, రూ. 4000 ఇస్తామని బాండ్ పేపర్ రాసిచ్చి ఇంత వరకూ పెన్షన్ ఇయ్యని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. తులం బంగారం, నిరుద్యోగ భృతి ఇస్తామని కల్లబొల్లి మాయ మాటలు, పచ్చి అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకున్నది కాంగ్రెస్ పార్టీ అని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేగులు మెడలో వేసుకోవడం కాదు రేవంత్ రెడ్డి.. పేదలకు హామీ ఇవ్వు. మానవ బాంబు అవడం కాదు మనిషివి అయితే పంట నష్టపోయిన రైతులను, ఆటో డ్రైవర్ సోదరులను ఓదార్చు. పార్టీ గేట్లు కాదు ప్రాజెక్టుల గేట్లు తెరువు. మల్లన్న సాగర్ గేట్లు తెరిచి మా కూడవెల్లి వాగుకు నీళ్ళు ఇస్తే మా గజ్వేల్, దుబ్బాక రైతులు పంటలు పండించుకుంటరు. మన ప్రభుత్వంలో 15 రోజులకు ఒకసారి కో-ఆపరేటివ్ డైరీ ఫామ్ రైతులకు బిల్లులు వస్తుండే. కానీ, నేడు 3 నెలలు దాటిపోయినా బిల్లులు లేవు. కార్యకర్తలు ధైర్యంగా ఉండండి, భవిష్యత్ మనదే. మీరే మాకు దేవుళ్లు. మీ కాళ్లు కడిగి నీళ్లు చల్లుకున్నా తక్కువే అని హరీశ్‌రావు తెలిపారు.
10 ఏండ్ల బీజేపీ పాలనలో రాష్ట్రానికి చేసింది శూన్యం. బీజేపీ చెప్పింది వింటే జోడీ.. లేకపోతే ఈడీ. 2 కోట్ల ఉద్యోగాల హామీ పేరుతో దేశంలోని నిరుద్యోగులను మోసం చేసిన పార్టీ బీజేపీ పార్టీ. పదేళ్లలో పెట్రోల్, డీజిల్, సిలిండర్ రెండింతలు చేసి ఎన్నికల ముందు రెండు రూపాయలు తగ్గించింది. కానీ, ఈ పదేళ్లు తెలంగాణ రైతుల కోసం అహర్నిశలు పాటుపడి కాళేశ్వరం కట్టి రైతులకు నీళ్లు అందించిన మహనీయుడు మన కేసీఆర్. ఈ 100 రోజుల పాలనను రేపు ఎన్నికల రెఫరెండంగా చూపించి మనల్ని మోసం చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మోసపోతాం. రూ. 2 లక్షల రుణమాఫీ, 4,000 పెన్షన్, తులం బంగారం ఇవ్వకపోయినా ప్రజలు అంగీకరించారు అంటారు. కాబట్టి, కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలి. దీనిపైన ప్రతి గ్రామంలో చర్చ జరగాలి. గజ్వేల్ అభివృద్ధిని చూసి ఓర్వలేని కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు బుద్ధి చెప్పాలి. మన మెదక్ పార్లమెంట్ అభ్యర్థి అయిన వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి అని హరీశ్‌రావు ప్రజలకు పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి రైతులు ఉన్నారని సోయి కూడా లేదు