- NIN సదస్సులో వక్తలు
సిటీబ్యూరో, డిసెంబరు 16 (నమస్తే తెలంగాణ): దేశానికి సమగ్ర ఆరోగ్య విధానం అవసరమని పలువురు పోషకాహార, ఆరోగ్య ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. “HFSSలో ఆహార వినియోగాన్ని తగ్గించడంలో పన్నుల పాత్ర” అనే అంశంపై నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నిర్వహించిన జాతీయ వెబ్‌నార్ జరిగింది. కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎన్‌ఐఎన్ డైరెక్టర్ హేమలత మాట్లాడుతూ సబ్సిడీలతోనే ఆరోగ్యకరమైన ఆహారం వినియోగం పెరుగుతుందని, జంక్‌ఫుడ్, చక్కెర, ఉప్పు, హానికరమైన ఆహారాన్ని తగ్గించేందుకు పన్ను విధింపు కీలకమని, అయితే ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రోత్సహించేందుకు ఎలాంటి సబ్సిడీ అమలు చేయడం లేదన్నారు. పౌష్టికాహారం ధర సామాన్యులకు అందడం లేదన్నారు. ప్రముఖ పోషకాహార నిపుణుడు డాక్టర్ మీరా శేఖర్ మాట్లాడుతూ… స్థూలకాయం అంతర్జాతీయ సమస్యగా మారుతోందని, చెడు ఆహారాన్ని అదుపులోకి తీసుకురావాలన్నారు. 96 దేశాలు ఉప్పు వినియోగాన్ని క్రమంగా తగ్గిస్తున్నాయని, హెచ్‌ఎఫ్‌ఎస్‌ఎస్ ఆహార పదార్థాల నియంత్రణకు ప్రపంచవ్యాప్తంగా విద్యార్థుల అవగాహన, ఉత్పత్తిని నియంత్రించడం, పన్నులు పెంచడం వంటి చర్యలను ప్రపంచ దేశాలు అమలు చేస్తున్నాయని పలువురు వక్తలు వివరించారు. ఎన్‌ఐఎన్ సైంటిస్ట్ సుబ్బారావు, డీకే యూనివర్సిటీ ప్రొఫెసర్ కేథరీన్ బ్యాక్‌హోలర్, నీతి ఆయోగ్ డిప్యూటీ సెక్రటరీ జనరల్ హేమంత్ కుమార్ మీనా, పబ్లిక్ హెల్త్ పాలసీ అనలిస్ట్ రిజో జాన్ ఈ వెబ్‌నార్‌లో పాల్గొన్నారు.