హైదరాబాద్: రాష్ట్రంలోని వరదల గురించి పీపీఏ సమావేశంలో ప్రస్తావించినట్లు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ తెలిపారు. పోరవరంలో నీరు నిలిచిపోవడంతో రాష్ట్రంలో ముంపునకు గురవుతున్న విషయాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నట్లు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కేంద్ర జల సంఘం ప్రతినిధులు, ఈఎన్సీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఇంజనీర్లు హాజరయ్యారు.
పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం అనంతరం తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ మీడియాతో మాట్లాడారు. పోలవరంపై ఇతర రాష్ట్రాలు కొన్ని ఆందోళనలు చేశాయన్నారు. అన్నీ పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర జల సంఘం ఈ అధ్యయనాన్ని చేపట్టనుంది. ఉమ్మడి విచారణకు ఆంధ్రప్రదేశ్ కూడా అంగీకరించింది. 892 ఎకరాలు ముంపునకు గురవుతాయని రాష్ట్ర ఇంజినీర్లు నిర్ధారించారు. సంయుక్తంగా విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని ఈఎన్సీ మురళీధర్ తెలిపారు.
841912