కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో మళ్లీ తాగునీటి తండ్లాట మొదలైందని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజలు గొంతు ఎండి ఇబ్బంది పడుతుంటే రేవంత్ రెడ్డి గొంతు చించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మహిళలు రోడ్ల పైన ఖాళీ బిందెలతో తల్లడిల్లుతుంటే రేవంత్ రెడ్డి లంక బిందెల కోసం మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఇవాళ(బుధవారం) హైదరాబాద్ తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో నేడు ట్యాంకర్లు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తున్నాయన్నారు. నగరంలో ట్యాంకర్ల దందా జోరుగా సాగుతున్నదని విమర్శించారు. మూడు, నాలుగు రెట్లు అధికంగా చెల్లించి వాటర్ ట్యాంక్‌తో నీళ్లు కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.
మిషన్ భగీరథను సక్రమంగా నిర్వహించడం ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదని చెప్పారు. అబద్ధాల పునాదులపైనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శించారు. తాగునీళ్లు లేక ప్రజలు, సాగునీళ్లందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇది ప్రకృతి ప్రకోపం వల్ల వచ్చిన కరువు కాదని, అసమర్ధ కాంగ్రెస్ వల్ల వచ్చిన కరువని ఆగ్రహం వ్యక్తంచేశారు. నీళ్లు ఉన్నా వినియోగించడం ఈ ప్రభుత్వానికి చేతకవాడం లేదన్నారు. ఫోన్‌ట్యాపింగ్ మీద కాకుండా వాటర్ ట్యాప్ మీద దృష్టి పెట్టాలని హితవు పలికారు. చేరికల కోసం పార్టీ గేట్లు ఎత్తడం కాదు.. రైతుల కోసం ప్రాజెక్టుల గేట్లు ఎత్తండని ముఖ్యమంత్రికి సూచించారు.
ఈ ప్రభుత్వానికి ధన వనరులను ఢిల్లీకి తరలిస్తున్న శ్రద్ధ జనవనరులను తరలించడంపై లేదన్నారు. ఇవాళ తాగునీళ్ల కోసం అడుక్కోవాల్సి దుస్థితిని ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు. హైదరాబాద్‌లో మళ్లీ ఇన్వర్టర్లు, జనరేటర్లు వచ్చాయన్నారు. కాళేశ్వరంపై నోటికొచ్చినట్లు విషప్రచారం చేశారని, కేసీఆర్ జనగామ, సూర్యాపేట వెళ్లగానే అదే కాళేశ్వరం నుంచి జలాలను విడుదల చేశారని చెప్పారు. కాళేశ్వరం పంపులను ఆన్ చేసి, మేడిగడ్డ మరమ్మతులు చేస్తే రైతులకు ఈ దుస్థితి ఉండేదా అని ప్రశ్నించారు. హరీశ్ రావు మల్లన్న సాగర్ నీటి కోసం అల్టిమేటం ఇస్తే వెంటనే విడుదల చేశారన్నారు. కాళేశ్వరం నీటిని కొండపోచమ్మ వరకు తీసుకురావచ్చని చెప్పారు.
పుష్కలంగా నీళ్లుంటే ట్యాంకర్లు ఎందుకు కొనక్కోవాల్సి వచ్చిందన్నారు. పంటలు పండితే బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే కాంగ్రెస్ సాగునీళ్లవ్వడం లేదని ఆరోపించారు. నీళ్ల ట్యాంకర్లను ఫ్రీగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజకీయ కుట్రతో ప్రజల కనీస అవసరమైన తాగునీళ్లు ఇవ్వకుండా చేశారని విమర్శించారు. బెంగళూరులో నీటి వృథాకు జరిమానా విధించాలని అక్కడి ప్రభుత్వం అంటున్నదని, ఇక్కడ వంద రోజులుగా నీళ్లను ఎత్తిపోయకుండా ఉన్న ఈ ప్రభుత్వంపై ఏం జరిమానా విధించాలని ప్రశ్నించారు. తాము అధికారం నుంచి దిగిపోయేనాటికి ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీళ్లున్నాయని చెప్పారు. ప్రజల నుంచి ముక్కు పిండేలా బిల్లులు వసూలు చేయరాదని, ఆత్మహత్య చేసుకున్న రైతులకు రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 218 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, వారి వివరాలు ఈ రోజే ముఖ్యమంత్రికి అందిస్తామన్నారు.
ఎలాంటి ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. అప్రతిష్టపాలు చేసేవారిపై లీగల్‌గా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 2011 నుంచి జరిగిన ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు అన్ని బయటపెట్టాలన్నారు. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఫోన్ ట్యాపింగ్ చేసింది ఇప్పుడున్న అధికారులేనని చెప్పారు. 2011లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆంధ్ర సీఎం, తెలంగాణ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని ఇప్పుడున్న కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు గడ్డం వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వయంగా చెప్పారని తెలిపారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్ మీద ఆధారాలు తీస్తే ఎవరు ఏంటో తెలుస్తుందన్నారు. ఎవరి ఫోన్లు టాప్ అయినయ్. ఎవరు చేశారనేది ప్రభుత్వం తేల్చాలి . ట్యాపింగ్ పైన అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టకుండా అడ్డగోలు ప్రచారం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం పబ్బం గడుపుకుంటుంది. ప్రతిసారి మొగోడివైతే మొగోడివైతే అని మాట్లాడుతావు కదా… మరి నువ్వు నిజంగానే మగాడివైతే రేవంత్ రెడ్డి రుణమాఫీ చెయ్.
ఒక పార్టీ గుర్తుపై గెలిచి, మరో పార్టీలో చేరి మళ్లీ పోటీ చేయడం రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందన్నారు. పార్టీ మారిన కడియం శ్రీహరి, దానం నాగేందర్‌పై కచ్చితంగా కోర్టుకు వెళ్లామన్నారు. స్టేషన్ ఘన్పూర్, ఖైరతాబాద్‌లో ఉపఎన్నిక ఖాయమన్నారు.
ఇది కూడా చదవండి: తక్షణమే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలి: హరీశ్ రావు. !