
సిట్ కేసును 4 వారాల్లో పూర్తి చేయాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే బీజేపీ, సిట్ నిందితులు వేర్వేరుగా పలు కేసులు దాఖలు చేయడంతో సిట్ దర్యాప్తు జాప్యం అవుతున్నది. అంతమాత్రాన కేసు వేయడాన్ని వ్యతిరేకించలేం. నిందితులకు ఆ హక్కు రాజ్యాంగం ఇచ్చింది. అయితే, ఈడీ మాత్రం ఫిర్యాదుదారుడిని దర్యాప్తు పేరుతో వేధిస్తున్నది.
సిట్ స్వేచ్ఛగా, స్వతంత్రంగా దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అయినా, సిట్ దర్యాప్తును అడ్డుకొనేందుకు బీజేపీ సర్వశక్తులను ఒడ్డడమే కాకుండా ఏసీబీ కోర్టు, హైకోర్టులకు వచ్చి మధ్యంతర ఉత్తర్వులు పొందింది. దర్యాప్తును ముందుకు సాగకుండా బీజేపీ, ఇతర నిందితులు చేస్తున్నారని సిట్ వాదన. నిందితుల అవినీతి వీడియో సాక్ష్యాధారాలు ఉన్న కేసుకే ఈ దుర్గతి పడితే సామాన్యులకు చెందిన కేసుల్లో పోలీసుల దర్యాప్తు ఇంకెంత జాప్యం అవుతుందనేది న్యాయకోవిదుల ప్రశ్న.
మరోవైపు ఈ కీలక కేసు ఫిర్యాదుదారు రోహిత్‌రెడ్డిని ఈడీ విచారణ పేరుతో పిలుస్తున్నది. కేసు ఏమిటో కూడా రోహిత్‌రెడ్డికి చెప్పకుండా విచారణకు పిలిచి మొదటి రోజు ఏకంగా ఆరు గంటలపాటు ఈడీ ప్రశ్నిం చింది. తనపై ఏం కేసులు ఉన్నాయో చెప్పాలని రోహిత్‌రెడ్డి కోరినా ఈడీ ఇవ్వలేదు.
నిష్పక్షపాతమైన ఎన్నికల కమిషన్ విధులను కూడా ఈడీనే నిర్వహిస్తుందా? రోహిత్‌రెడ్డిపై ఓడిపోయిన అభ్యర్థి ఫిర్యాదు చేస్తే ఈసీ చర్యలు తీసుకోవాలి. లేదా పబ్లిక్ డొమైన్లో ఎన్నికల అఫిడవిట్‌పై జనానికి అభ్యంతరం ఉంటే, ఫిర్యాదు చేస్తే ఈసీ చర్యలు తీసుకోవాలి. వీటిపై ఆధారాలు నిరూపణ జరిగితే ఈసీ నిబంధనల ప్రకా రం ఎన్నిక రద్దు అవుతుంది. ఇవన్నీ చేయాల్సింది ఈసీ. ఈడీ కానేకాదు.
ఇటు నుంచి కాకపోతే అటు నుంచి నరుక్కురావాలని సామెత. భారతదేశాన్ని ఏలుతున్న భారతీయ జనతా పార్టీ పెద్దలు ఇప్పుడు ఆ పనే చేస్తున్నారు. అటూ ఇటూ ఎటూ దారీతెన్నూ కనబడని చోట బీజేపీ పెద్దలు అడ్డదారులు తొక్కుతున్నారు. నైతిక విలువలను నట్టేట ముంచుతున్నారు. చట్టం, న్యాయం, ధర్మం మొదలైనవాటికి తర్పణాలు వదిలి వేశారు. ఒకప్పుడు విలువల పార్టీగా చెప్పుకొన్న బీజేపీ ఇప్పుడు అవినీతిపరులకు నిలువెత్తు అండగా ఉక్కు సంకల్పంతో నిలబడింది. ఉత్తర భారతదేశంలో కోల్పోయే సీట్లను దక్షిణ భారతదేశంలో ఏదో ఒక విధంగా కాపాడుకోవాలనే రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఈడీ, సీబీఐ, ఐటీ శాఖలను బీజేపీ ప్రత్యర్థి పార్టీలపై అస్ర్తాలుగా చేసుకుంటోంది. బీజేపీ అన్ని ప్రమాణాలను వదిలేసి నిస్సిగ్గుగా విష పాచికలతో ఆటలాడుతోంది.
ఒక నేతను లొంగదీసుకోవాలంటే అతనిపై లేనిపోని కేసుల దర్యాప్తు పేరుతో భయపెట్టి, బెదిరించి దారికి తెచ్చుకునేలా ఇప్పటి వరకు పలు ప్రభుత్వాలు చేశాయి. వాటిని కాదని చట్ట వ్యతిరేకంగా కొత్త పుంతలు తొక్కడంలో బీజేపీ పెద్దలది అందె వేసిన చేయి అని చెప్పడానికి తెలంగాణలో ఇటీవల నమోదైన ఎమ్మెల్యేల కొనుగోలు బాగోతంపై సిట్ కేసు ఒక ఉదాహరణ. దేశంలో తమకు వ్యతిరేకంగా గళం విప్పుతున్న బీజేపీయేతర పార్టీల నేతలను లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) వంటి అస్ర్తాలను సంధించడం బీజేపీ పాలకులకు గత ఎనిమిదేండ్లుగా పరిపాటి అయ్యింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా అందరి నోళ్లను మూయించడమే కాకుండా తమ వైపు తిప్పుకునేలా బీజేపీ ఆడిస్తోంది.
ఎమ్మెల్యేల ఎర కేసు వ్యవహారంపై సిట్ జరుపుతున్న దర్యాప్తులో నిందితులకు ఏసీబీ కోర్టు, హైకోర్టుల్లో ఊరట లభించింది. ఆ కేసు ఫిర్యాదుదారుడికి మాత్రం ఈడీ నుంచి విచారణ పేరుతో వేధింపులు ఎదురవుతున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు కుట్ర చేసిన కేసులో వీడియో ఫుటేజీ సాక్ష్యాధారాలతో నిందితులు పట్టుబడ్డారు. కేసు దర్యాప్తు మాత్రం ముందుకు జరగడం లేదు.
బీజేపీ నేతలు, నిందితులు అనేక కేసులు వేసి సిట్ దర్యాప్తులో ఏమాత్రం కదలిక లేకుండా చేస్తున్నారు. సిట్ దర్యాప్తు చేయడానికి వీల్లేదని ఒక కేసు. ఏసీబీ కేసు కాబట్టి సిట్ చెల్లదని ఒక కేసు. సిట్ దర్యాప్తును రద్దు చేసి దానిని సీబీఐ దర్యాప్తునకు ఇవ్వాలని ఇంకో కేసు. లేదంటే హైకోర్టు ఏర్పాటు చేసే సిట్‌కు కేసు ఇవ్వాలంటూ కేసు మీద కేసులు వేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని పోలీసులతో సిట్ దర్యాప్తు ఏకపక్షంగా ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సీబీఐకి ఇవ్వాలని కోరుతున్నారు. రాష్ట్ర పోలీసులు టీఆర్ఎస్ నేతల చెప్పుచేతల్లో ఉంటారని ఆరోపించే ఆ పార్టీ పెద్దలు.. కేంద్ర ప్రభుత్వ పగ్గాలు బీజేపీ చేతుల్లో ఉన్నందున సీబీఐ కూడా బీజేపీ నేతలు చెప్పినట్టుగానే చేస్తుందనే కోణంలో కోర్టు భావిస్తుందన్న ఆలోచన చేయకపోవడమే ఏకపక్షం. ఎమ్మెల్యేల ఎర కేసుతో తమకు సంబంధం లేదని చెప్పే బీజేపీ నేతలే (అప్పటికి కేసులో నిందితులు కూడా కాదు) ముందుగా హైకోర్టు తలుపులు తట్టారంటే ఆ పార్టీ నేతలు ఎంతగా భయపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. కేసుతో ఏవిధంగానూ సంబంధం లేని బీజేపీ రిట్ పిటిషన్ దాఖలు చేసి మధ్యంతర ఉత్తర్వులు పొందడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని సిట్ వాదనగా ఉంది.
తనపై ఏ కేసు నమోదు చేసిందీ చెప్పకుండా సిట్ ఫిర్యాదుదారుని (ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిని) ఈడీ పిలిచి గంటలపాటు కూర్చోబెట్టుకుని విచారణ చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. సిట్ కేసు వదిలేయాలనే లక్ష్యంతో ఫిర్యాదుదారుని నిందితుడి మాదిరిగా ఈడీ పలుసార్లు విచారణకు పిలవడం సరికాదు. ‘లలితకుమారి కేసులో’ కూడా ఎవరైనా వ్యక్తి ఫిర్యాదు ఇస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఎమ్మెల్యేల ఎర కేసులో అదే జరిగింది. కేసులోని ఆరోపణలను ప్రాసిక్యూషన్ నిరూపించుకోవాలి. నిందితులకు నేరాభియోగాలతో సంబంధం లేనప్పుడు కోర్టు విచారణలో పవిత్రులుగా బయట పడతారు కదా?
సిట్ కేసును 4 వారాల్లో పూర్తి చేయాలని సుప్రీంకోర్టు హైకోర్టుకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే బీజేపీ, సిట్ నిందితులు వేర్వేరుగా పలు కేసులు దాఖలు చేయడంతో సిట్ దర్యాప్తు జాప్యం అవుతోంది. అంతమాత్రాన కేసు వేయడాన్ని వ్యతిరేకించలేం. నిందితులకు ఆ హక్కు రాజ్యాంగం ఇచ్చింది. అయితే, ఈడీ మాత్రం ఫిర్యాదుదారుడిని దర్యాప్తు పేరుతో వేధిస్తోంది. కాదంటే రేపు ఐటీ, సీబీఐ కూడా కేసులను పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదనే మాట కూడా వినిపిస్తోంది. దేశవ్యాప్తంగా అనేక మందిపై ఇదే తరహా కేసులు నమోదు చేసి, ఎదురు తిరిగిన నేతలు బీజేపీ వైపు చేరేలా కేంద్ర దర్యాప్తు సంస్థలు చేస్తున్నాయనే విమర్శలు ఉండనే ఉన్నాయి. సిట్‌ను సుప్రీం అడ్డుకోలేదు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును వీడియో ఆధారాలతో ఫిర్యాదుదారుడు రోహిత్‌రెడ్డి బట్టబయలు చేశారు.
ఏవిధమైన కుట్ర చేసిందీ టీఆర్ఎస్ పార్టీ సీజేఐ, హైకోర్టు సీజేలకు వీడియో క్లిప్పింగ్స్ పంపింది. ఎన్నో ఆధారాలు ఉన్నాయని సిట్ చెబుతున్నప్పటికీ ఆ కేసు దర్యాప్తు మాత్రం ప్రాథమిక దశలోనే ఉంది. ఏ విధంగానూ ముందుకు వెళ్లడం లేదు. సిట్ దర్యాప్తును అడ్డుకునేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అంగీకరించలేదు. సిట్ దర్యాప్తును తెలంగాణ హైకోర్టు పర్యవేక్షణ చేయాలన్న ఇక్కడి హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఉత్తర్వులను సైతం రద్దు చేసింది. సిట్ స్వేచ్ఛగా, స్వతంత్రంగా దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అయినా, సిట్ దర్యాప్తును అడ్డుకునేందుకు బీజేపీ సర్వశక్తులను ఒడ్డడమే కాకుండా ఏసీబీ కోర్టు, హైకోర్టులకు వచ్చి మధ్యంతర ఉత్తర్వులు పొందింది. దర్యాప్తును ముందుకు సాగకుండా బీజేపీ, ఇతర నిందితులు చేస్తున్నారని సిట్ వాదన. నిందితుల అవినీతి వీడియో సాక్ష్యాధారాలు ఉన్న కేసుకే ఈ దుర్గతి పడితే సామాన్యులకు చెందిన కేసుల్లో పోలీసుల దర్యాప్తు ఇంకెంత జాప్యం అవుతుందనేది న్యాయకోవిదుల ప్రశ్న.
నిందితులకు ఊరట
పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన 24 గంటల్లోపే బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి హైకోర్టుకు రావడంతో.. సిట్ దర్యాప్తు నిలుపుదలకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. నిజానికి బీజేపీ వేసిన రిట్ పిటిషన్లో సిట్ దర్యాప్తుపై స్టే ఆదేశాలు ఇవ్వాలని కోరలేదు. సిట్ దర్యాప్తును సీబీఐకి లేదా హైకోర్టు ఏర్పాటు చేసే సిట్‌కు బదిలీ చేయాలని మాత్రమే కోరింది. దర్యాప్తును స్టే చేయాలని బీజేపీ కోరనప్పడు స్టే ఇవ్వరాదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ జే రామచంద్రరావు పలుసార్లు అభ్యంతరం చెప్పారు. సిట్ దర్యాప్తు వద్దు, సీబీఐ కావాలని కోరడమంటే సిట్ దర్యాప్తు ఆపాలని కోరడమేనంటూ బీజేపీ కొత్త భాష్యం చెప్పింది. హైకోర్టులోని ఈ కేసు విచారణకు ముందే నిందితులు రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజిలను రిమాండ్‌కు తరలించేందుకు ఏసీబీ కోర్టు నిరాకరించింది. నిందితులకు సీఆర్పీసీలోని 41ఏ సెక్షన్ కింద నోటీసు ఇవ్వలేదని తప్పుపట్టిన ఏసీబీ కోర్టు రిమాండ్‌కు పంపేందుకు నిరాకరించింది. దీనిపై హైకోర్టులో సిట్ సవాల్ చేసి ఉత్తర్వులు పొందడం ద్వారా నిందితులను జైలుకు తరలించింది. తిరిగి హైకోర్టు నుంచి ముగ్గురు నిందితులు బెయిల్ పొంది జైలు నుంచి విడుదలయ్యారు. ఈ క్రమంలోనే బీజేపీ జాతీయ నేత బీఎల్ సంతోష్, న్యాయవాది బీ శ్రీనివాస్ ఇతరులకు సిట్ 41ఎ నోటీసులు ఇస్తే పోలీసులు వారిని అరెస్టు చేయరాదని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా అన్ని దశల్లోనూ నిందితులు కోర్టులకు రావడంతో మధ్యంతర ఉత్తర్వులు వెలువడ్డాయి. మరోవైపు ఈ కీలక కేసు ఫిర్యాదుదారు రోహిత్‌రెడ్డిని ఈడీ విచారణ పేరుతో పిలుస్తున్నది. కేసు ఏమిటో కూడా రోహిత్‌రెడ్డికి చెప్పకుండా విచారణకు పిలిచి మొదటి రోజు ఏకంగా ఆరు గంటలపాటు ఈడీ దర్యాప్తు చేసింది. తనపై ఏం కేసులు ఉన్నాయో చెప్పాలని రోహిత్‌రెడ్డి కోరినా ఈడీ ఇవ్వలేదు. నేరం జరిగిందని తెలిసి దానిపై ఫిర్యాదు చేసిన వ్యక్తికి చట్ట ప్రకారం గౌరవం ఉంటుంది. ఆలాంటి వ్యక్తిని లొంగదీసుకోవడం ద్వారా సిట్ కేసును నీరుగార్చాలనే ఏకైక లక్ష్యంతో కేంద్రంలోని బీజేపీ ఈడీ అస్ర్తాన్ని సంధించి వేధిస్తోందేమోనన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
‘సిట్ దర్యాప్తు చేసే పోలీసు అధికారులంతా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటారు కాబట్టి దర్యాప్తు ఏకపక్షంగా ఉంటుంది. నిష్పక్షపాతంగా ఉండదు. కాబట్టి సీబీఐ, లేదా హైకోర్టు నియమించే సిట్‌తో దర్యాప్తునకు ఆదేశాలు ఇవ్వాలి’ అని బీజేపీ, ఆ తర్వాత నిందితులు కూడా హైకోర్టులో వాదన చేశారు. ఇదే నిజమైతే (?).. సీబీఐ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తుంది కదా అనే లాజికల్ ప్రశ్నకు బీజేపీ నుంచి జవాబు లేదు. పైగా, సిట్ కంటే సీబీఐ కేసుల దర్యాప్తు సమగ్రంగా ఉంటుందనే బీజేపీ వాదన అవాస్తవమని కేసుల గణాంకాలను చూస్తే స్పష్టం అవుతోంది.
సాక్ష్యాలున్నందునే 41ఎ నోటీసు
నిందితులకు 41ఎ కింద నోటీసు ఇస్తే హైకోర్టులో సవాల్ చేశారు. అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు నిందితులకు 41ఎ నోటీసులు ఇచ్చాకే విచారణ చేయాలని తీర్పు ఇచ్చిందన్న నిందితుల వాదనను సిట్ తీవ్రంగా వ్యతిరేకించింది. నిందితులు ఏదైనా డాక్యుమెంట్స్ సమర్పించాలంటే సీఆర్పీసీలోని సెక్షన్ 91 నోటీసు ఇవ్వాలి. సాక్షిగా పిలవాలంటే 160 నోటీసు ఇచ్చి 161 సెక్షన్ కింద విచారణ చేపట్టాలని నిందితులు నిబంధనలను గుర్తు చేస్తున్నారు. విచారణ తర్వాత నిందితుడిగా చేర్చాలని దర్యాప్తు అధికారి భావిస్తే సీఆర్పీసీలోని 161 (3) ప్రకారం చేయాలి. ఇదే హక్కు రాజ్యాంగంలోని 20(3) అధికరణం కల్పిస్తోంది. అయితే, ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితుల కుట్రకు చెందిన వీడియో, ఆడియో, ఫోన్ మెసేజ్ సాక్ష్యాధారాలు ఉన్నాయి. నిందితులు తిరుపతిలో యజ్ఞం చేసిన ఫొటోలున్నాయి. హరిద్వార్‌లో కలుసుకున్న ఫొటోలు ఉన్నాయి. కాబట్టి సీఆర్పీసీలోని సెక్షన్ 41ఎ ప్రకారం నిందితులకు నేరుగా నోటీసు ఇవ్వొచ్చు. అరెస్టు కూడా చేయవచ్చన్నది ఒక వాదన. అంతేకాకుండా ఒకసారి ఎఫ్ఐఆర్ దాఖలు చేశాక కేసు దర్యాప్తు క్రమంలో ఇతరులను నిందితులుగా చేర్చేందుకు ఏసీబీ కోర్టు లేదా ఇతర ఏ కోర్టు నుంచి సిట్ అనుమతి పొందక్కర్లేదు. ఈ కేసులో సిట్ బీఎల్ సంతోష్ ఇతరులను నిందితులుగా చేర్చుతూ ఏసీబీ కోర్టుకు మెమో దాఖలు చేయడం అంటే కేవలం సమాచారం ఇవ్వడమే. నిజానికి ప్రాసిక్యూషన్ మెమో దాఖలు చేయాల్సిన అవసరం లేదు. అయితే, కేసు విచారణ చేయబోయే కోర్టుకు సమాచారం నిమిత్తమే మెమో దాఖలు చేశారు. దీనిపై ఏసీబీ కోర్టు జ్యుడిషియల్ ఆర్డర్ ఇవ్వడం కేసు ప్రాథమిక దశలోనే తీర్పు చెప్పినట్టు అవుతుందని ప్రాసిక్యూషన్, న్యాయనిపుణుల వాదన. మెమోను ఏసీబీ కోర్టు కొట్టేయడాన్ని సిట్ సవాల్ చేసిన కేసులో హైకోర్టు తీర్పు వెలువరించాల్సివుంది.
ఈడీ కేసు ఏమిటో రోహిత్‌రెడ్డికి చెప్పనేలేదు
నిందితుల హక్కులకు అండగా కోర్టులు ఉంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. ఎమ్మెల్యేలకు కోట్లు ఇచ్చి కొనుగోలు చేస్తామని వీడియోలు, ఆడియోల సాక్ష్యాలతో పట్టుబడిన కేసులో సిట్ దర్యాప్తు ముందుకు సాగకపోవడం ఒక ఎత్తు. ఇంతటి కీలక కేసు ఫిర్యాదుదారు రోహిత్‌రెడ్డికి ఈడీ ఏ కేసో కూడా చెప్పకుండా వేధించడం మరొక ఎత్తు. ఈడీ విచారణకు పిలిచేప్పుడు ఫలానా కేసు మీపై ఉంది. ఫలానా వాటికి వివరణ ఇవ్వడానికి తమ ఎదుట హాజరుకావాలి అని చెప్పాలి. అలా కాకుండా ఈడీ విచారణకు పిలిచి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు గంటలు కూర్చోబెట్టి ఏం చేసిందో రోహిత్‌రెడ్డి చెప్పిన విషయాలు వింటే విస్తుపోతాం. ‘నన్ను ఏ కేసు విచారణ నిమిత్తం పిలిచారో చెప్పండి. నాపై ఉన్న కేసు ఏమిటో నాకే తెలియదు. దయచేసి నాపై ఉన్న కేసు గురించి చెప్పండి. రెండు రోజులుగా నేను ఆసక్తిగా చూస్తున్నాను. నేను ఏ తప్పు చేయలేదు. ఏ దందా చేయలేదు. నాపై ఉన్న కేసు ఏమిటో దయచేసి చెప్పండి..’ అని ఈడీని అడిగినట్టు రోహిత్‌రెడ్డి మీడియాకు చెప్పారు. చట్ట ప్రకారం ఈడీ దగ్గరున్న కేసు ప్రకారం ఆధారాలకు అనుగుణంగా ఫలానా చర్యలు నిబంధనలకు వ్యతిరేకంగా ఎందుకు చేశారని ఈడీ ప్రశ్నించాలి. కానీ, ఈడీనే రోహిత్‌రెడ్డి దగ్గర నుంచి గత ఆరేళ్ల ఆదాయ వ్యయాలు, ఎన్నికల అఫిడవిట్ల వివరాలు కావాలని కోరడం ఆశ్చర్యంగా ఉంది. రేపు ఆ డాక్యుమెంట్స్ ఆధారంగానే మీరు తప్పు చేశారంటూ రోహిత్‌రెడ్డిని ఈడీ వేధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నిష్పక్షపాతమైన ఎన్నికల కమిషన్ విధులను కూడా ఈడీనే చేస్తుందా? రోహిత్‌రెడ్డిపై ఓడిపోయిన అభ్యర్థి ఫిర్యాదు చేస్తే ఈసీ చర్యలు తీసుకోవాలి. లేదా పబ్లిక్ డొమైన్లో ఎన్నికల అఫిడవిట్‌పై జనానికి అభ్యంతరం ఉంటే, ఫిర్యాదు చేస్తే ఈసీ చర్యలు తీసుకోవాలి. వీటిపై ఆధారాలు నిరూపణ జరిగితే ఈసీ నిబంధనల ప్రకారం ఎన్నిక రద్దు అవుతుంది. ఇవన్నీ చేయాల్సింది ఈసీ. ఈడీ కానేకాదు. ఈసీ చేయాల్సిన విధుల్ని ఈడీ చేస్తోందా అనే సందేహం ఏర్పడుతోంది.
నిందితులు దర్యాప్తు సంస్థను ఎంచుకోలేరు
రాజ్యాంగంలోని 226 అధికరణం కింద రాజ్యాంగ ధర్మాసనాలైన హైకోర్టు/సుప్రీంకోర్టులు అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే దర్యాప్తు మార్పునకు ఉత్తర్వులు జారీ చేసే ఆస్కారం ఉంటుంది. ఉదాహరణకు బూటకపు ఎన్కౌంటర్ జరిగిందనే ఆరోపణలు వస్తే దర్యాప్తును ఆ కోర్టులు వేరే సంస్థలకు బదిలీ చేసే అధికారం ఉంటుంది. ఎమ్మెల్యే కొనుగోలు కుట్ర కేసు వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని అనుకున్నప్పటికీ క్రిమినల్ కేసు దర్యాప్తును ప్రాథమిక దశలో అడ్డుకునే హక్కు కోర్టులకు కూడా ఉండదని సుప్రీం కోర్టు గతంలో పేర్కొన్నది. పైగా, నిందితులు ఫలానా దర్యాప్తు సంస్థకు కేసును బదిలీ చేయాలని కోరే హక్కు అస్సలు ఉండదు. సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థకు కేసును బదిలీ చేయాలని కోరే హక్కు నిందితులకే కాదు, ఫిర్యాదుదారుడికి కూడా ఉండదు. ఫిర్యాదుదారుడు రాజకీయ ప్రత్యర్థి కాబట్టి సిట్ కేసును రద్దు చేసి మరో దర్యాప్తు సంస్థకు బదిలీ చేయాలని కోరడం చట్ట వ్యతిరేకం అవుతుంది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు ప్రకాష్‌సింగ్ బాదల్-పంజాబ్ రాష్ర్టాల మధ్య జరిగిన కేసులో తీర్పు ద్వారా చెప్పింది.
ఏ కేసులోనైనా దర్యాప్తును ప్రాథమిక దశలో అడ్డుకోవడం చెల్లదని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో చెప్పింది. ఎమ్మెల్యేల ఎర కేసులో లంచం ఇస్తామన్న డబ్బులు ఎక్కడా లభ్యం కాలేదు కాట్టి అవినీతి కిందకు రాదన్న వాదన వాస్తవం కాదు.
లంచం ఇస్తామని చెప్పడం కూడా అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 120 కింద నేరమే.
ఓటర్లకు లంచం ఇవ్వడం నేరమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణయ్యర్ నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన తీర్పుతో ఒక చట్టసభ సభ్యుడి ఎన్నిక రద్దు అయ్యింది.
ఇక్కడి కేసులకు ఈ తీర్పులన్నీ వర్తిస్తాయి. క్రిమినల్ కేసుల విచారణ జాప్యమవ్వడం వల్ల సాక్ష్యాధారాలు తారుమారయ్యే ప్రమాదం ఉంటుంది. సుప్రీంకోర్టు పలు కేసుల్లో వెలువరించిన తీర్పుల ప్రకారం క్రిమినల్ కేసుల దర్యాప్తులను కోర్టులు అడ్డుకోజాలవు.
(వ్యాసకర్త: సీనియర్ అడ్వొకేట్, హైకోర్టు) జంధ్యాల రవిశంకర్
‘సిట్ దర్యాప్తు చేసే పోలీసు అధికారులంతా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటారు కాబట్టి దర్యాప్తు ఏకపక్షంగా ఉంటుంది. నిష్పక్షపాతంగా ఉండదు. కాబట్టి సీబీఐ, లేదా హైకోర్టు నియమించే సిట్‌తో దర్యాప్తునకు ఆదేశాలు ఇవ్వాలి’ అని బీజేపీ, ఆ తర్వాత నిందితులు కూడా హైకోర్టులో వాదన చేశారు. ఇదే నిజమైతే .. సీబీఐ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తుంది కదా అనే లాజికల్ ప్రశ్నకు బీజేపీ నుంచి జవాబు లేదు. పైగా, సిట్ కంటే సీబీఐ కేసుల దర్యాప్తు సమగ్రంగా ఉంటుందనే బీజేపీ వాదన అవాస్తవమని కేసుల గణాంకాలను చూస్తే స్పష్టం అవుతోంది.
చట్ట ప్రకారం ఈడీ దగ్గరున్న కేసు ప్రకారం ఆధారాలకు అనుగుణంగా ఫలానా చర్యలు నిబంధనలకు వ్యతిరేకంగా ఎందుకు చేశారని ఈడీ ప్రశ్నించాలి. కానీ, ఈడీనే రోహిత్‌రెడ్డి దగ్గర నుంచి గత ఆరేళ్ల ఆదాయ వ్యయాలు, ఎన్నికల అఫిడవిట్ల వివరాలు కావాలని కోరడం ఆశ్చర్యంగా ఉంది. రేపు ఆ డాక్యుమెంట్స్ ఆధారంగానే మీరు తప్పు చేశారంటూ రోహిత్‌రెడ్డిని ఈడీ వేధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నిష్పక్షపాతమైన ఎన్నికల కమిషన్ విధులను కూడా ఈడీనే చేస్తుందా?
ఎమ్మెల్యేల ఎర కేసుతో తమకు సంబంధం లేదని చెప్పే బీజేపీ నేతలే (అప్పటికి కేసులో నిందితులు కూడా కాదు) ముందుగా హైకోర్టు తలుపులు తట్టారంటే ఆ పార్టీ నేతలు ఎంతగా భయపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. కేసుతో ఏవిధంగానూ సంబంధం లేని బీజేపీ రిట్ పిటిషన్ దాఖలు చేసి మధ్యంతర ఉత్తర్వులు పొందడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని సిట్ వాదనగా ఉంది.