ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి ఊరట లభించింది. ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మిపై వచ్చిన ఆరోపణలను కొట్టివేసిన హైకోర్టు ఆమెకు క్లీన్ స్లేట్ ఇచ్చింది. 2004 నుంచి 2009 వరకు మైనింగ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన శ్రీలక్ష్మి గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ లీజులకు సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమెపై కేసు నమోదు చేసిన సీబీఐ విచారణ ప్రారంభించి అరెస్ట్ చేసింది. ఆ కేసులో శ్రీలక్ష్మికి ఏడాది జైలు శిక్ష పడింది. అనంతరం బెయిల్పై విడుదలయ్యారు. అప్పటి నుంచి ఆమె న్యాయపోరాటం చేస్తోంది. ఇందులో భాగంగా 2022 జనవరిలో హైకోర్టులో డిశ్చార్జి పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న హైకోర్టు ఈరోజు తీర్పు వెలువరించింది. సీబీఐ ఆరోపణలు అవాస్తవమని పేర్కొంది. ఈ కేసులో శ్రీలక్ష్మికి వ్యతిరేకంగా సీబీఐ సరైన సాక్ష్యాలను అందించలేక పోవడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.