అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడైనా నిజాలు చెప్పాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత. ఇవాళ(గురువారం) తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ కవత..స్టాఫ్ నర్స్, పోలీస్ కానిస్టేబుల్ నియామకాలు చేపట్టడంతో పాటు మినీ అంగన్ వాడీలను బీఆర్ఎస్ ప్రభుత్వమే అప్ గ్రేడ్ చేసిందని, కానీ ఇప్పుడు తాము నియామకపత్రాలు ఇస్తామంటున్నారని తప్పుబట్టారు. కేసీఆర్ చేసిన పనులు తామే చేస్తున్నామని చెప్పకుంటుంటే ఇక ప్రజలు అధికారం ఎందుకిచ్చినట్లని అడిగారు. ప్రజలు అధికారమిచ్చినప్పుడు కొత్త పనులు, ప్రజలకు పనికివచ్చే పనులు చేయాలని సూచించారు. ఈ ఏడాది డిసెంబరులోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కేవలం 60 మాత్రమే కొత్త ఉద్యోగాలను నోటిఫై చేసిందని ప్రస్తావించారు. గతంలో కేసీఆర్ నోటిఫై చేసిన ఉద్యోగాలను ఇప్పుడు ఇస్తున్నారని చెప్పారు. చేయని పనులు చేస్తున్నామని చెప్పడం మానేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు.
సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాలు వచ్చిన వారికి నియామక పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి అందించడం సిగ్గుచేటన్నారు ఎమ్మెల్సీ కవిత. కాంగ్రెస్ పార్టీయే డిపెండెంట్ ఉద్యోగాలను రద్దు చేసిందని, అందుకు అంగీకరిస్తూ ఐఎన్ టీయూసీ సంతకాలతో ఏఐటీయూసీ సంతకాలు చేశాయని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించిన కేసీఆర్ …. ఒక్కసారి కూడా నియామక పత్రాలు అందించలేదని, ఇది కేవలం సాధారణంగా జరిగే ప్రక్రియగా భావించి జనరల్ మేనేజర్ స్థాయిలో నియామక పత్రాలు ఇచ్చేవారని అన్నారు. జీఎం స్థాయిలో జరిగే పనిని హైదరాబాద్ లో సీఎం స్థాయిలో నియమకా పత్రాలు ఇస్తున్నాయని విమర్శించారు. కొత్తగా 400 డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చామని కాంగ్రెస్ చెప్పుకోవడం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు. అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడైనా నిజాలు చెప్పాలని సూచించారు. కేసీఆర్ సింగరేణిని కన్నతల్లిలా చూశారని, సింగరేణి ప్రైవేటీకరణను వ్యతిరేకించారని, ఉద్యోగుల సంఖ్య పెరగాలని చూశారని వివరించారు. “మీ గురువు చంద్రబాబు హయాంలో సింగరేణిలో గోల్డెన్ హ్యాండ్ షేక్ ఇచ్చి ఉద్యోగులను తొలగించి సంఖ్యను కుదించారు. కాబట్టి అబద్దాలు చెప్పడం మానేసి కొత్తగా వేసిన ఉద్యోగాలు ఎన్నో చెప్పాలి” అని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత.
ఇది కూడా చదవండి: మహేందర్ రెడ్డిపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలి
