ఆరు నూరైనా తెలంగాణకు అన్యాయం జరగనివ్వబోనని తేల్చి చెప్పారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.నల్గొండ శివారులోని మర్రిగూడ బైపాస్ దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కృష్ణా జలాల కోసం చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని ప్రజలకు పిలుపునిచ్చారు.
‘‘కాలు విరిగినా కట్టె పట్టుకొని నల్గొండకు వచ్చా. ఇది రాజకీయ సభ కాదు.. ఉద్యమ సభ, పోరాట సభ. ఫ్లోరైడ్ వల్ల నల్గొండ ప్రజల నడుములు వొంగిపోయాయి. ఆ నాడు బాధితులను ఢిల్లీకి తీసుకెళ్లి అప్పటి ప్రధానికి చూపించాం. నీళ్లు లేకపోతే తెలంగాణ ప్రజలకు బతుకు లేదు. 24 ఏళ్లుగా పక్షిలాగా తిరిగి రాష్ట్రం మొత్తం చెప్పాను. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే ఫ్లోరైడ్ సమస్య సమసిపోయింది. ఇప్పుడు నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ రహిత జిల్లాగా మారింది. పోరాటం చేసి.. రాష్ట్రం తెచ్చి పదేళ్లు పాలించా. నా పాలనలో ఎవరికీ తక్కువ చేయలేదు. కొందరు ఓట్లు వచ్చినప్పుడే ప్రజల దగ్గరకు వస్తారు. నా ప్రాంతం, నా గడ్డ అనే ఆరాటం ఉంటే.. ఎక్కడివరకైనా పోరాడవచ్చు. పక్కనే కృష్ణమ్మ ఉన్నా.. ఫలితం లేకపాయే అని అప్పట్లో నేనే పాట రాశానని చెప్పారు.
బస్వాపూర్ ప్రాజెక్టు పూర్తయ్యింది, దిండి ప్రాజెక్టు పూర్తి కావొచ్చింది. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 80శాతం పూర్తయ్యాయి. ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా జీవన్మరణ సమస్య కృష్ణా జలాలు. ఏడాది పాటు తాత్కాలిక ప్రాతిపదికన కృష్ణా జలాలు కేటాయించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు సగం వాటా కేటాయించాలని కేంద్రాన్ని ఎన్నో సార్లు అడిగాం. ఇప్పుడు కృష్ణా జలాల్లో వాటా కోసం ట్రైబ్యునల్ ముందు పోరాడాలి. తెలంగాణకు అన్యాయం జరిగితే చివరి శ్వాస వరకు పులిలా కొట్లాడతా.. పిల్లి మాదిరిగా ఉండను’’ అని అన్నారు కేసీఆర్.
అసెంబ్లీలో పెట్టిన తీర్మానం కూడా సక్కగా లేదు… అందులో తాగునీళ్లు, సాగునీరు పెట్టారు కానీ విద్యుత్ గురించి ప్రస్తావించలేదు.కాంగ్రెస్ పార్టీకి కావలసింది పైసలు పైరవీలే.మన అందరం పిడికిలి బిగించాలి అప్పుడే మన హక్కులను కాపాడుకోగలుగుతాం.కృష్ణ ట్రిబ్యునల్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అప్రమత్తంగా లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా కొట్లాడాలి.ఇదే మాట చెప్పేందుకు ఇంత దూరం నల్లగొండకు వచ్చిన.కొత్త గవర్నమెంట్ వస్తే గత ప్రభుత్వం కంటే నాలుగు మంచి పనులు చేసి ప్రజల మెప్పు పొందాలని చూడాలి.కానీ కేవలం కేసీఆర్ అన్న తిట్టడమే పనిగా పెట్టుకున్నారు.ఎవరికి అధికారం శాశ్వతం కాదు తెలంగాణ ప్రజల హక్కులు శాశ్వతం తెలంగాణ ప్రజల వాటాలు శాశ్వతం తెలంగాణ బతుకులు శాశ్వతం.తెలంగాణను కొట్లాడి తెచ్చినం కాబట్టి వీటన్నింటి కోసం కొట్లాడుతూనే ఉంటాం.ఈ సభ పెట్టింది కొంతమంది సన్నాసులు తెలివి లేకుండా తమకు వ్యతిరేకం అనుకుంటున్నారు.మీ అందరి దీవెనలతోని 10 సంవత్సరాలు పరిపాలన చేసిన.ఒక్క నిమిషం కరెంటు పోకుండా కరెంటు ఇచ్చినం… ఇంటింటికి నీళ్లు ఇచ్చినం.ఇవన్నీ చేయాలంటే దమ్ము కావాలి తెలంగాణకు మంచి చేయాలన్న ఆరాటం కావాలి నా గడ్డ నా ప్రజలు అన్న ఆలోచన కావాలి.
పాలిచ్చే బర్రెను అమ్మేసి దున్నపోతును తెచ్చుకున్నారు… ఏమైతుందో మూడు నెలల నుంచి చూస్తున్నామన్నారు కేసీఆర్.మూడు నెలల్లోనే ఈ ప్రభుత్వం కె ఆర్ ఎం బి బోర్డుకి కృష్ణాజిల్లాలను అప్పజెప్పింది.నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రమే మంచి ఉంది అంటున్నాడు.మరి లక్షల మంది కోట్ల మంది ఎందుకు ఉద్యమం చేసిర్రు ఇదే జిల్లాకు చెందిన శ్రీకాంత్ ఆచారి ఎందుకు ఆత్మ త్యాగం చేసిండని ప్రశ్నించారు.
రైతుబంధు ఇయకున్నా పర్వాలేదు కానీ… రైతుల్ని పట్టుకుని చెప్పుతో కొట్టాలంటారు.ఎన్ని గుండెలు రా మీకు… పంటలు వండించే రైతులకు కూడా చెప్పులు ఉంటాయి… జాగ్రత్త బిడ్డా అని హెచ్చరించారు కేసీఆర్.రైతుల చెప్పులు బందోబస్తుగా ఉంటాయి… రైతుల చెప్పులు గట్టిగా ఉంటాయి… వాళ్ల చెప్పు దెబ్బతో మూడు పళ్ళు ఊడిపోతాయన్నారు.
కాలేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక ఆట బొమ్మ కాదు…గతంలో నాగార్జునసాగర్, మూసి ప్రాజెక్టు, కడెం ప్రాజెక్టులకు ఇబ్బంది రాలేదా..ఇబ్బందులు వస్తే సరి చేయాలన్నారు.అధికారం ఎవరికి శాశ్వతం కాదు… మేము మళ్లీ రెండు మూడింతల బలంతో అధికారంలోకి వస్తామన్నారు కేసీఆర్.
ఇది కూడా చదవండి:ఫలించిన ఎమ్మెల్సీ కవిత చొరవ.. అవిశ్వాస తీర్మానంపై వెనక్కి తగ్గిన కౌన్సిలర్లు
