భువనగిరిలో టెన్త్ విద్యార్థుల ఆత్మహత్య ఘటనలో విధుల్లో నిర్లక్ష్యం వహించి వార్డెన్ శైలజను అధికారులు సస్పెండ్ చేశారు. దీనికి సంబందించి జిల్లా కలెక్టర్ హనుమంతు జెండగే ఇవాళ(మంగళవారం) ఉత్తర్వులు జారీ చేశారు.భువనగిరి ఎస్సీ బాలికల హాస్టల్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మంగళవారం ఉదయం సందర్శించారు.
10వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు ఎస్సీ హాస్టల్లోని ఒకే గదిలో ఆత్మహత్య చేసుకున్న ఘటనపై కవిత ఆరా తీశారు. ఘటన జరిగి మూడు రోజులు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత హాస్టల్‌ను పరిశీలించిన తర్వాత ప్రభుత్వం కమిటీ వేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది.
ఇద్దరు బాలికలు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై తమ డిమాండ్‌కు స్పందించి.. ఆలస్యంగానైనా దర్యాప్తునకు విచారణ అధికారిని నియమించినందుకు ధన్యవాదాలు అని కవిత తన ట్వీట్లో తెలిపారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపించి ఇద్దరు బాలికల మరణానికి కారకులైన దోషులను త్వరగా గుర్తించి కఠినంగా శిక్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆమె ట్వీట్ చేశారు.
ఇది కూడా చదవండి: ఇంద్రవెల్లి కాల్పుల పాపం ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీదే
